breaking news
Sanjay Jaju
-
‘ఇదేందిది?’: బీజేపీ సీఎంతో తెలంగాణ సీఎస్!
భోపాల్: తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజుకు శుభాకాంక్షలు చెబుతూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక దినపత్రికలో ప్రచురితమైన ప్రకటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ ప్రకటనలో ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌తో కలిసి ఉన్న ఒక ఫొటో ప్రచురితమయ్యింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ ఫొటోపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు జూన్ 26న తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆయన కుటుంబం ప్రస్తుతం భోపాల్‌లో ఉంటోంది. ఆయన సీఎస్‌గా అత్యున్నత పదవిని చేపట్టిన తరుణంలో ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు స్థానిక పత్రికలో శుభాకాంక్షల ప్రకటనను ఇచ్చారు.ఇది సాధారణ ప్రకటనలా కనిపించినప్పటికీ, అందులో కనిపిస్తున్న ఫొటో చర్చకు దారితీసింది. ఆ ఫొటో ఏ ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించినదో ప్రకటనలో పేర్కొనలేదు. అలాగే ఈ ఫొటో ఎంపికలో సంజయ్ జాజు ప్రమేయం ఉందా లేదా అనే విషయం తెలియరాలేదు. రాష్ట్రంలో అత్యున్నత పరిపాలనా పదవిలో ఉన్న అధికారి రాజకీయాలకు అతీతంగా, తటస్థంగా కనిపించాలని కొందరు అభిప్రాయపడుతుండగా, ప్రభుత్వ కార్యక్రమంలో సీఎంతో కలిసి ఫొటో దిగడం సాధారణ పరిపాలనా ప్రక్రియేనని మరికొందరు అంటున్నారు. -
తెలంగాణ సీఎస్‌గా సంజయ్ జాజు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎస్‌గా సంజయ్ జాజు ఈ రోజు ( మంగళవారం) బాధ్యతలు స్వీకరించారు. సరిగ్గా 2 గంటల 15 నిమిషాల సమయంలో ముహూర్తం చూసుకొని సచివాలయంలోని ప్రధాన కార్యదర్శి సీటులో కూర్చున్నారు. మాజీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీకాలం నేటితో ముగియడంతో ఆయన స్థానంలో సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించారు. 2029 ఫిబ్రవరి వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సంజయ్ జాజు నేపథ్యంప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు 1992 బ్యాచ్‌కు చెందిన ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్, విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్‌గా, ఐటీ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అదేవిధంగా రెండు తెలుగురాష్ట్రాలలో ఎంతో ప్రాముఖ్యత చెందిన మీ సేవ రూపకర్తలలో ఆయన ఒకరు. ఈ ప్రాజెక్టు రూపకల్పన, అమలులో ఆయన కీలక పాత్ర పోషించారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కేంద్ర సర్వీసుల్లో ఆయన డిప్యూటేషన్‌పై ఉన్నారు. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NHIDCL) డైరెక్టర్‌గా, కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా పనిచేశారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అభ్యర్థన మేరకు రాష్ట్రానికి రప్పించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. -
తెలంగాణ కొత్త సీఎస్ సంజయ్ జాజు
-
తెలంగాణ సీఎస్‌గా సంజయ్ జాజు నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎస్‌గా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజు తెలంగాణకు తిరిగి వచ్చారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న కె. రామకృష్ణారావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. సంజయ్ జాజు ప్రస్తుతం ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.మూడు రోజుల కిందట ఆయన కేంద సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన అంతకుముందు సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ ముఖ్యకార్యదర్శిగా, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా, విశాఖపట్టణం కమిషనర్‌గా, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, సహాయ పునరావాస శాఖ కమిషనర్‌గా, నీటిపారుదల ఆయకట్టు ప్రాంత అభివృద్ధి శాఖ కమిషనర్‌గా, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీగా పనిచేశారు. -
కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజు తెలంగాణకు తిరిగి రానున్నారు. ఆయనను తెలంగాణ కేడర్‌కు పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో సంజయ్ జాజు సీఎస్‌గా నియమితులు కానున్నారని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి, ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న కె. రామకృష్ణారావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. సీఎస్ పదవి కోసం మొన్నటి వరకు 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్‌లు అయిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్ రంజన్ (పురపాలక శాఖ), వికాస్‌రాజ్ (ఆర్అండ్బీ) పోటీపడ్డారు. వారిద్దరి మధ్యనే పోటీ ఉంటుందని భావించారు. అయితే అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వమే తాజాగా సంజయ్ జాజును తెలంగాణ కేడర్‌కు తిరిగి పంపించాలని కేంద్రాన్ని కోరడంతో దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆయన తిరిగి సొంత కేడర్ అయిన తెలంగాణకు వస్తున్నారు. సంజయ్ జాజును కేడర్‌కు పిలిపించుకోవడం ద్వారా ప్రభుత్వం ఒక బలమైన సంకేతాన్ని పంపిందనే చర్చ మొదలైంది. వచ్చే కొన్ని రోజుల్లో తెలంగాణ పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. సంజయ్ జాజు ప్రస్తుతం ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన అంతకుముందు సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ ముఖ్యకార్యదర్శిగా, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా, విశాఖపట్టణం కమిషనర్‌గా, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, సహాయ పునరావాస శాఖ కమిషనర్‌గా, నీటిపారుదల ఆయకట్టు ప్రాంత అభివృద్ధి శాఖ కమిషనర్‌గా, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన అక్టోబర్‌లో కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తే ఆయన 2029 ఫిబ్రవరి వరకు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. సీఎస్‌గా సంజయ్ జాజు రాకను ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు సైతం ధ్రువీకరించాయి. -
ఏఐ టెక్నాలజీ: మీడియాపై పెను ప్రభావం!
కృత్రిమ మేథ (ఏఐ)లాంటి టెక్నాలజీలు మీడియా, వినోద రంగంపై (ఎంఅండ్‌ఈ) పెను ప్రభావం చూపుతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార (ఐఅండ్‌బీ) శాఖ కార్యదర్శి సంజయ్ జాజు చెప్పారు. ఈ నేపథ్యంలో సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. డైరెక్ట్ టు మొబైల్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రాజెక్టుపై ఐఐటీ కాన్పూర్‌లో పరిశోధనలు జరుగుతున్నాయని సీఐఐ బిగ్ పిక్చర్ సమిట్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఏఐ వల్ల టెక్నాలజీలో మరిన్ని మార్పులు రాబోతున్నాయని, వాటిలో సానుకూలాంశాలను ఉపయోగించుకోవాలని జాజు తెలిపారు. దీని వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుందని, ఉత్పాదకత పెరుగుతుందని పేర్కొన్నారు. వందలో ఒక్క వంతు ఖర్చుతో పదిలో ఒక వంతు సమయంలో ఏదైనా పని పూర్తయితే, ఉత్పాదకత తప్పకుండా పెరుగుతుందని జాజు చెప్పారు.కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా 2030 నాటకి మీడియా, వినోద రంగం (ఎంఅండ్‌ఈ) భవిష్యత్ పరిస్థితుల గురించి రూపొందించిన సీఐఐ శ్వేతపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వం, పరిశ్రమ అంచనాల ప్రకారం ఈ పరిశ్రమ ఏటా 7 శాతం వృద్ధితో 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరనుందని జాజు చెప్పారు. ఆహారం, నీడ, దుస్తుల్లాగే వినోదమనేది నాగరికత మూల స్తంభాల్లో ఒకటని, ఆర్థిక వృద్ధితో పాటు సమాజ శ్రేయస్సుకు కూడా కీలకమని పేర్కొన్నారు. భారతదేశపు క్రియేటివ్ ఎకానమి ప్రస్తుతం 1 కోటి మందికి పైగా జవనోపాధి కల్పిస్తోందని, రూ. 3 లక్షల కోట్ల మేర స్థూల దేశీయోత్పత్తికి దోహదపడుతోందని ఆయన చెప్పారు.ఇంతటి కీలకమైన వినోద రంగాన్ని ఏఐ మార్చివేస్తున్న తరుణంలో కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోకపోతే అంతర్జాతీయంగా మన వాటా తగ్గిపోతుందన్నారు. వర్ధమాన ఆర్థిక శక్తిగా భారతదేశ గాథలను ప్రపంచానికి వినిపించాల్సిన, చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం తన వంతు సహాయాన్ని పరిశ్రమకు అందిస్తుందని చెప్పారు. -
జీహెచ్ఎంసీ కార్యాలయంలో మరో కరోనా కేసు
హైదరాబాద్: ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా జీహెచ్ఎంసీ పరిదిలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పడు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరో కరోనా కేసు నమోదైంది. మేయర్ పేషీలో పనిచేస్తున్న అటెండర్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిణామంతో మేయర్ ఛాంబర్‌ను సిబ్బంది మూసివేసి శానిటైజ్ చేశారు. మరోవైపు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి జీహెచ్ఎంసీ కమీషనర్, హైదరాబాద్ కలెక్టర్, ఇతర అధికారులతో కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి సంజయ్ జాజు చర్చించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఆఫీస్‌లో ఒక పాజిటివ్ కేసు నమోదయింది. రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన విషయం తెలిసిందే. కాగా జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే కాక అనేక ప్రభుత్వ ఆఫీసులలో కరోనా కేసులు నయోదవుతున్నాయి. చదవండి: న్యూజిలాండ్‌తో సహా 9 దేశాల్లో జీరో కేసులు -
ఏపీలో ఐటీ రంగానికి తోడ్పాటు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు తమవంతు సహకారం అందిస్తామని పలువురు ఐటీ రంగ ప్రముఖులు ప్రకటించారు. ఐటీ కంపెనీల సీఈవోలలో విశాఖపట్నంలో సోమవారం నిర్వహించిన సదస్సులో రాష్ట్రాన్ని డిజిటలైజ్ చేయడానికి గూగుల్ సంస్థ సహకారం అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. విప్రో(రూ.150కోట్లు), టెక్ మహీంద్ర (రూ.250కోట్లు), సమీర్(రూ.80కోట్లు), టెస్సాల్వ్( రూ.250కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, ఆయా సంస్థల తరపున వాటి ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 16 సంస్థలకు విశాఖపట్నం, విజయవాడలలో కంపెనీలు ప్రారంభించేందుకు వీలుగా భూ కేటాయింపులు, ఇంక్యుబేషన్ సెంటర్లో స్థలాలు కేటాయించింది. ఈ సందర్భంగా ఐటీ రంగ ప్రముఖులు పలువురు తమ అభిప్రాయాలను ఇలా వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నిపుణులు రావాలి గ్రామీణ ప్రాంతాల నుంచి ఐటీ రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలను రూపొందించాలి. స్టార్ట్ అప్ విలేజ్‌లు ఒక అద్భుత ప్రయోగం. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే విశాఖపట్నంతోపాటు ఏపీ అభివృద్ధి పథంలో సాగుతుంది. - క్రిష్ గోపాలకృష్ణన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోవాలి మన యువత ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూడకుండా ఉపాధి అవకాశాలు కల్పించేస్థాయికి చేరుకోవాలి. విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు పాఠ్యాంశాలలో మార్పులు అవసరం. ఐటీ రంగంలో రాష్ట్రం వృద్ధికి కాస్మోపాలిటన్ నగరంగా ఉన్న విశాఖ మెట్రోపాలిటన్ నగరంగా ఎదగాలి. - బీవీ మోహన్‌రెడ్డి, నాస్కామ్ ఉపాధ్యక్షుడు ప్రపంచస్థాయి స్టార్ట్ అప్ ఎకోసిస్టమ్ ఇంక్యుబేటర్ విధానం ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడింది. కేరళలో విజయవంతమైన ఈ విధానాన్ని విశాఖపట్నం కేంద్రంగా ఏపీలో అమలు చేస్తాం. స్టార్ట్ అప్ విలేజ్ విధానంతో విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం. - సంజయ్ విజయ్‌కుమార్, సీఈవో, మోబ్మీ ఏపీ డిజిటలైజ్‌కు కార్యాచరణ ఏపీనీ డిజిటలైన్ చేసేందుకు 4 ప్రధాన అంశాలతో కార్యాచరణ ప్రణాళిక చేపట్టాం. మొదటగా ఇంటర్నెట్ సేవలను తెలుగులో అందుబాటులోకి తెస్తాం. ఈ ప్రక్రియలో తెలుగు పత్రికలు, మ్యాగజైన్లను భాగస్వాములుగా చేసుకుంటాం. 2. చిన్న, మధ్య తరహా వ్యాపారాలను ఆన్లైన్ విధానంలోకి తీసుకువస్తాం. రానున్న రెండేళ్లలో లక్ష చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలను ఆన్లైన్ విధానంలోకి తీసుకురావాలన్నది లక్ష్యం. 3. వినియోగదారులను ప్రత్యేకించి మహిళా వినియోగదారులను ఆన్లైన్ విధానంలోకి తీసుకువస్తాం. 4. అన్ని ప్రభుత్వ వెబ్సైట్లు, ఇతరవాటిని మోబైల్ డివైజస్లోకి అందుబాటులోకి తెస్తాం. - రాజన్ అనందన్, గూగుల్ సంస్థ ఎండీ -
‘విశాఖ ఐటీ రాజధాని’ ఉత్తిమాటేనా?
విశాఖపట్నం: రాష్ట్రంలో ఐటీ రంగానికి పెద్దదిక్కుగా ఉన్న విశాఖ ప్రస్తుతం భవిష్యత్తు ప్రయాణం ఎటో తేల్చుకోలేకపోతోంది. నగరాన్ని ఐటీ రాజధానిగా తీర్చుదిద్దుతామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో స్పష్టత ఇవ్వకపోవడంతో కంపెనీలు గందరగోళానికి గురవు తున్నాయి. ఒకపక్క సమస్యలతో మనుగడ కష్టంగా మారగా, మరోపక్క పభుత్వం మొక్కుబడి వ్యవహారంతో అయోమయానికి గురవుతున్నాయి. కంపెనీల విస్తరణ, ఉద్యోగ నియామకాల విషయంలో ముందడుగు వేయడానికి సంశయిస్తున్నాయి. ఉన్న సంక్షోభ పరిస్థితులు చక్కదిద్దకుండా హడావుడి చేస్తుండడంతో మొదట్లో కాస్తోకూస్తో ఆశగా ఉన్న యాజమాన్యాలు క్రమక్రమంగా నిరుత్సాహానికి లోనవుతున్నాయి. సోమవారం విశాఖలో ఐటీశాఖ అత్యున్నతస్థాయి విధానపరమైన సమీక్ష జరుగుతుండడంతో తాడోపేడో తేల్చుకోవడానికి సమాయత్తమవుతున్నాయి. ఐటీ రాజధానిగా చేస్తారా? విభజనకు ముందు హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఐటీ రంగంలో విశాఖది రెండోస్థానం. అక్కడ మొత్తం 2,500 కంపెనీలు పనిచేస్తుండగా, వార్షిక టర్నోవర్ రూ.60,200 కోట్లు. విశాఖలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న మొత్తం 70 కంపెనీల టర్నోవర్ రూ.1450 కోట్లు. కానీ విడిపోయిన తర్వాత రాష్ట్రంలో విశాఖ ఐటీ రంగం కేవలం మూడుశాతమే మిగిలింది. దీంతో విశాఖను ఐటీ రాజధానిగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం అదే పనిగా ప్రకటిస్తోంది. కానీ ఇక్కడ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లి సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రిని కలిసి సమస్యలు వివరించినా పెద్దగా స్పందన లేకపోవడంతో భవిష్యత్తుపై ఆశలు వదిలేసుకుంటున్నాయి. ప్రస్తుతం నగరంలో 70 ఐటీ కంపెనీలు, నాలుగు ఎస్ఈజెడ్లున్నాయి. ఇవన్నీ అనేక పురిటినొప్పులు పడుతున్నాయి. ఎస్ఈజెడ్లకు కేటాయించిన భూముల్లో సగానికిపైగా కంపెనీలు నిర్మాణాలు చేపట్టకుండా భూములు ఖాళీగా ఉంచాయి. నిర్మాణం పూర్తిచేసుకున్న కంపెనీలకు అనుమతులు, మౌలిక సదుపాయాలు లేక పాడుబడ్డ భవనాలుగా మారాయి. ఐటీకి పవర్‌హాలీడే విధిస్తుండడంతో ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా ఏదో చేస్తామని యాజమాన్యాలను ఊరించే ప్రయత్నం చేస్తోంది. ఈ నెల 16న ఐటీశాఖ నుంచి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ప్రభుత్వ ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్, ఐటీఈ అండ్ సీ సెక్రటరీ సంజయ్‌జాజూ, పరిశ్రమల అభివృద్ధి ఫోరం చైర్మన్ జె.ఎ.చౌదరి తదితరులు నగరానికి వస్తున్నారు. రాష్ట్రంలో విశాఖను ఐటీ రాజధానిగా ఏవిధంగా తీర్చిదిద్దాలి? సమస్యలు? వంటివాటిపై విధానపరమైన సమీక్ష జరపనున్నారు. ఇందులో ఐటీ సమస్యలను ఏకరువుపెట్టడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇక్కడ ఐటీ కంపెనీల సమావేశాలు, ఇతరత్రా అవసరాలను తీర్చేందుకు రూ.20 కోట్లతో చేపట్టిన ఇంక్యుబేషన్ సెంటర్ రెండేళ్లవుతున్నా నిర్మాణం పూర్తవలేదు. రెండో ఇంక్యుబేషన్ కేంద్రానికి మరో రూ.23 కోట్లు నిధులు సిద్ధంగా ఉన్నా భూములే లేవు. దీనిపై కంపెనీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నాయి. ఐటీ కంపెనీలకు కనీసం బస్సు సౌకర్యం, తాగునీటి వసతి ఇలా ప్రాథమికంగా ఏవీ లేవు. ముందు ఈ సౌకర్యాలు కల్పించి ఆ తర్వాత ఐటీ రాజధానిగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేయనున్నట్లు రుషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఒ.నరేష్కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. రూ.50 వేల కోట్లతో 10వేల ఎకరాల్లో విశాఖకు ఐటీఐఆర్ వస్తుందని గత ప్రభుత్వంతోపాటు సీఎం చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే 4 వేల ఎకరాల భూములు కూడా సిద్ధం చేసి ఉంచారు. ఐటీఐఆర్‌ను ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ భూములను వెనక్కి తీసుకుని వేరే కంపెనీలకు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీనిపైనా తాము ప్రశ్నిస్తామని నరేష్కుమార్ చెప్పారు.


