టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి
మీడియా, వినోద పరిశ్రమకు ఐఅండ్‌బీ కార్యదర్శి జాజు సూచన
కృత్రిమ మేథ (ఏఐ)లాంటి టెక్నాలజీలు మీడియా, వినోద రంగంపై (ఎంఅండ్‌ఈ) పెను ప్రభావం చూపుతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార (ఐఅండ్‌బీ) శాఖ కార్యదర్శి సంజయ్ జాజు చెప్పారు. ఈ నేపథ్యంలో సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. డైరెక్ట్ టు మొబైల్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రాజెక్టుపై ఐఐటీ కాన్పూర్‌లో పరిశోధనలు జరుగుతున్నాయని సీఐఐ బిగ్ పిక్చర్ సమిట్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఏఐ వల్ల టెక్నాలజీలో మరిన్ని మార్పులు రాబోతున్నాయని, వాటిలో సానుకూలాంశాలను ఉపయోగించుకోవాలని జాజు తెలిపారు. దీని వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుందని, ఉత్పాదకత పెరుగుతుందని పేర్కొన్నారు. వందలో ఒక్క వంతు ఖర్చుతో పదిలో ఒక వంతు సమయంలో ఏదైనా పని పూర్తయితే, ఉత్పాదకత తప్పకుండా పెరుగుతుందని జాజు చెప్పారు.
కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా 2030 నాటకి మీడియా, వినోద రంగం (ఎంఅండ్‌ఈ) భవిష్యత్ పరిస్థితుల గురించి రూపొందించిన సీఐఐ శ్వేతపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వం, పరిశ్రమ అంచనాల ప్రకారం ఈ పరిశ్రమ ఏటా 7 శాతం వృద్ధితో 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరనుందని జాజు చెప్పారు. ఆహారం, నీడ, దుస్తుల్లాగే వినోదమనేది నాగరికత మూల స్తంభాల్లో ఒకటని, ఆర్థిక వృద్ధితో పాటు సమాజ శ్రేయస్సుకు కూడా కీలకమని పేర్కొన్నారు. భారతదేశపు క్రియేటివ్ ఎకానమి ప్రస్తుతం 1 కోటి మందికి పైగా జవనోపాధి కల్పిస్తోందని, రూ. 3 లక్షల కోట్ల మేర స్థూల దేశీయోత్పత్తికి దోహదపడుతోందని ఆయన చెప్పారు.
ఇంతటి కీలకమైన వినోద రంగాన్ని ఏఐ మార్చివేస్తున్న తరుణంలో కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోకపోతే అంతర్జాతీయంగా మన వాటా తగ్గిపోతుందన్నారు. వర్ధమాన ఆర్థిక శక్తిగా భారతదేశ గాథలను ప్రపంచానికి వినిపించాల్సిన, చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం తన వంతు సహాయాన్ని పరిశ్రమకు అందిస్తుందని చెప్పారు.


