ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ‘వైబ్ కోడింగ్’పై టెక్ దిగ్గజాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నేచురల్ లాంగ్వేజీలో ఆదేశాలు ఇస్తూ ఏఐ ద్వారా కోడ్‌ను రాయించుకునే ఈ విధానంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అనుకూలంగా స్పందిస్తుంటే, టెక్ టైకూన్ జోహో సీఈఓ శ్రీధర్ వెంబు అంతగా దీన్ని సపోర్ట్ చేయడం లేదు. అందుకు వారు చెబుతున్న కారణాలు విభిన్నంగా ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.
వైబ్ కోడింగ్ అంటే ఏమిటి?
వైబ్ కోడింగ్ అనేది సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ (Software Development)లో కొత్తగా వాడుకలోకి వచ్చిన ఒక విధానం. ఇందులో సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని వ్యక్తులు కూడా తమ ప్రాజెక్ట్ లక్ష్యాలను సాధారణ, రోజువారీ భాషలో(Natural Language Prompts) ఏఐ ఆధారిత టూల్స్‌కు (ఉదాహరణకు, Google's AI Studio, OpenAI Codex) కమాండ్ ఇస్తారు. ఏఐ ఆ ఆదేశాలను అర్థం చేసుకొని దానికి సంబంధించిన ఫంక్షనల్ కోడ్‌ను జనరేట్ చేస్తుంది. కోడింగ్ పరిజ్ఞానం లేనివారు కూడా యాప్‌లు, వెబ్‌సైట్‌లు లేదా ప్రోటోటైప్‌లను సులభంగా తయారు చేయవచ్చు.
సుందర్ పిచాయ్..
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వైబ్ కోడింగ్‌ను సానుకూలంగా చూస్తున్నారు. టెక్నికల్ పరిజ్ఞానం లేని వ్యక్తులు కూడా తమ ఆలోచనలను ప్రోటోటైప్‌లుగా మార్చవచ్చని చెబుతున్నారు. గతంలో ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఆలోచన గురించి మాటల్లో వివరించేవారు. ఇప్పుడు, వైబ్ కోడింగ్ ద్వారా ఆ ఆలోచనకు కోడెడ్ వెర్షన్ లేదా ప్రోటోటైప్‌ను జనరేట్ చేసే వీలుందన్నారు.
శ్రీధర్ వెంబు..
జోహో సీఈఓ శ్రీధర్ వెంబు వైబ్ కోడింగ్ పట్ల అంతగా సానుకూలంగా లేరు. ఏఐ జనరేట్ చేసే కోడ్ మనకు అద్భుతంగా అనిపించినప్పటికీ, కంప్యూటర్ ఎలా పనిచేస్తుందనే క్లిష్టమైన, లోతైన అవగాహన అవసరమన్నారు. ఏఐ సాధారణంగా రీయూజబుల్ కోడ్‌ను రాయడంలో సహాయపడుతుందన్నారు. కానీ, కోర్ లాజిక్, కొత్త సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలు ఏఐకి ఉండవని చెప్పారు. ఇవి మానవ సృజనాత్మకత, అనుభవంపై ఆధారపడి ఉంటాయని వెంబు నమ్ముతున్నారు. కోడింగ్ అనేది ఓ మ్యాజిక్ అన్నారు.
వైరుధ్యంలో ఏకాభిప్రాయం
ఈ రెండు దృక్పథాల మధ్య పిచాయ్ కూడా ఓ పోడ్‌కాస్ట్‌లో వైబ్ కోడింగ్ పరిమితులను అంగీకరించారు. కొన్ని రకాల లార్జ్, సెక్యూరిటీ సిస్టమ్స్‌కు వైబ్ కోడింగ్ సరిపోదన్నారు. అందుకు అనుభవం కలిగిన ఇంజినీర్లు అవసరమని చెప్పారు.


