రెపో రేటును పావు శాతం తగ్గించొచ్చన్న అంచనాలు
రూపాయి పతనం నేపథ్యంలో నిర్ణయంపై ఆసక్తి
ముంబై: ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తన కీలక నిర్ణయాలను శుక్రవారం ప్రకటించనుంది. రెపో రేటును పావు శాతం తగ్గించొచ్చని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొందరు విశ్లేషకులు యథాతథ స్థితినే కొనసాగించొచ్చని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో అత్యంత కనిష్ట స్థాయి 0.3 శాతానికి దిగిరావడం రెపో రేటు తగ్గింపునకు వీలు కల్పిస్తుందని కొందరు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
అదే సమయంలో జీడీపీ వృద్ధి క్యూ2లో 8.2 శాతానికి బలపడడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళుతున్న కారణంగా రూపాయి బక్కచిక్కుతున్న వేళ.. యథాథత స్థితిని కొనసాగించొచ్చన్నది కొందరి విశ్లేషణగా ఉంది. ఈ అంచనాల నడుమ ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మూడు విడతల్లో ఆర్‌బీఐ రెపో రేటును ఒక శాతం తగ్గించడంతో 5.5 శాతానికి దిగిరావడం తెలిసిందే. సీఆర్‌ఆర్‌ను సైతం ఒక శాతం తగ్గించడంతో 3 శాతానికి దిగొచ్చింది.


