భారత ఆర్థిక వ్యవస్థ 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జులై-సెప్టెంబర్) అనూహ్యంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 8.2 శాతానికి పెరిగింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 5.6% వృద్ధి కంటే గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. ఇది కొన్ని సర్వేలు అంచనా వేసిన 7.3 శాతం వృద్ధి రేటును మించిపోయింది.
ఇటీవల ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) హేతుబద్ధీకరణ వస్తువుల వినియోగాన్ని పెంచుతుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. కేర్ ఎడ్జ్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ రజనీ సిన్హా తెలిపిన వివరాల ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వ్యవసాయం, తయారీ, నిర్మాణ రంగాలు భారీగా వృద్ధి నమోదు చేశాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక సగటున 4.1% పెరిగింది (గత సంవత్సరం 2.7%), తయారీ ఉత్పత్తి 4.9% పెరిగింది (గత సంవత్సరం 3.3%) అన్నారు.
మెరుగైన వ్యవసాయ ఉత్పత్తి కారణంగా గ్రామీణ వ్యయం పెరగడంతో ఆర్థిక వ్యవస్థలో సుమారు 60% వాటాను కలిగి ఉన్న గృహ వినియోగం బలపడింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వ మూలధన వ్యయం 31% పెరిగింది. ఇది మునుపటి త్రైమాసికంలో 52% పెరుగుదల కంటే నెమ్మదిగా ఉన్నప్పటికీ, సంవత్సరం క్రితం నమోదైన 10% వృద్ధి కంటే మెరుగ్గా ఉంది.
సరుకుల ఎగుమతులు 8.8% పెరిగాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 7% తగ్గుదలను ఈ గణాంకాలు తిప్పికొట్టాయి. యూఎస్ సుంకాల అమలు కంటే ముందు ఫ్రంట్ లోడెడ్ షిప్‌మెంట్ల ద్వారా ఈ పెరుగుదల నమోదైంది.
జీఎస్టీ కోతలతో పెరిగిన డిమాండ్
భారతదేశం సెప్టెంబర్ 22 నుంచి చాలా వస్తువులపై జీఎస్టీ రేట్లను సవరించింది. ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌లో ఇది వినియోగాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ఈ జీఎస్టీ తగ్గింపులు అమల్లోకి రాకముందే గృహోపకరణాలు, కిరాణా సామాగ్రికి డిమాండ్ పెరిగినట్లు కొన్ని సంస్థలు నివేదికలు రూపొందించాయి. జీఎస్టీ పునర్వ్యవస్థీకరణ వల్ల సామాన్య ప్రజలకు రూ.2 లక్షల కోట్లు మిగులనుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ అదనపు డబ్బు భవిష్యత్తులో వినియోగాన్ని మరింతగా పెంచడానికి దోహదపడుతుంది.
ఆందోళన కలిగించే అంశాలు
అద్భుతమైన జీడీపీ వృద్ధి సాధించినప్పటికీ కొన్ని ఆందోళన కలిగించే అంశాలు కూడా ఉన్నాయని రాయిటర్స్ నివేదించింది. ముఖ్యంగా పట్టణ డిమాండ్, ప్రైవేట్ పెట్టుబడులు వెనుకబడుతున్నట్లు పేర్కొంది. గ్రామీణ డిమాండ్ పుంజుకున్నప్పటికీ స్థిరమైన, సమగ్రమైన వృద్ధికి పట్టణ డిమాండ్, ప్రైవేట్ రంగ పెట్టుబడుల పునరుద్ధరణ కూడా కీలకం.
ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి?


