ఏటా 5 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా ఎగుమతి | Uniper AM Green sign agreement for 5 lakh tons per year of renewable ammonia | Sakshi
Sakshi News home page

ఏటా 5 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా ఎగుమతి

Jan 12 2026 4:00 PM | Updated on Jan 12 2026 5:48 PM

Uniper AM Green sign agreement for 5 lakh tons per year of renewable ammonia

ఏఎం గ్రీన్‌, యూనిపర్ కీలక ఒప్పందం

భారత పునరుత్పాదక ఇంధన రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తిలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఏఎం గ్రీన్, జర్మనీకి చెందిన ఇంధన దిగ్గజం యూనిపర్ (Uniper)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ నుంచి ఏటా 5 లక్షల టన్నుల వరకు పునరుత్పాదక అమ్మోనియాను యూనిపర్ సంస్థ కొనుగోలు చేయనుంది. ఈమేరకు యూనిపర్ సీఈఓ మైఖేల్ లూయిస్, ఏఎం గ్రీన్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ కుమార్ చలమలశెట్టి ఒప్పంద పత్రాలను  మార్చుకున్నారు.

ఒప్పందంలోని అంశాలు..

  • ఏడాదికి గరిష్టంగా 5,00,000 టన్నుల గ్రీన్ అమ్మోనియాను యూనిపర్ కొనుగోలు చేయనుంది. 

  • ఒక భారతీయ సంస్థ ఇటువంటి భారీ స్థాయి అంతర్జాతీయ ఎగుమతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఇదే తొలిసారి. 

  • ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 1 ఎంటీపీఏ (ఏటా మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం) ప్లాంట్ నుంచి 2028 నాటికి మొదటి విడత ఎగుమతి ప్రారంభం కానుంది. 

  • ఈ అమ్మోనియా యూరోపియన్ RFNBO (Renewable Fuel of Non-Biological Origin) సర్టిఫికేషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.

ఈ సందర్భంగా ఏఎం గ్రీన్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ చలమలశెట్టి మాట్లాడుతూ.. ‘గ్లోబల్‌గా ఎనర్జీ పరంగా వస్తున్న మార్పులో భారత్ పాత్రకు ఈ భాగస్వామ్యం ఒక మైలురాయిగా నిలుస్తుంది. మా ప్రత్యేకమైన క్లీన్ ఎలక్ట్రిసిటీ సొల్యూషన్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ గ్రీన్ అమ్మోనియా.. కెమికల్స్, అల్యూమినియం వంటి కర్బన ఉద్గారాలు ఎక్కువగా ఉత్పత్తయ్యే పరిశ్రమలు తమ ఉద్గారాలను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు. 

యూనిపర్ సీఈఓ మైఖేల్ లూయిస్ స్పందిస్తూ.. ‘భారత్, యూరప్ మధ్య మొట్టమొదటి భారీ స్థాయి సరఫరా కేరిడార్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు గర్వంగా ఉంది. గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ద్వారా ఎరువులు, రిఫైనింగ్ వంటి రంగాలకు ఎంతో మేలు జరుగుతుంది’ అని తెలిపారు. ఏఎం గ్రీన్ కో-ఫౌండర్ మహేష్ కొల్లి మాట్లాడుతూ, తమ పెట్టుబడిదారులు (Gentari, GIC, ADIA) సహకారంతో ప్రపంచ స్థాయి నాణ్యతతో సరైన ధరలో గ్రీన్ అమ్మోనియాను అందించే పర్యావరణ వ్యవస్థను నిర్మించామని తెలిపారు.

ఇదీ చదవండి: బ్యాంకింగ్ పారదర్శకతపై సందిగ్ధత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement