
మధ్యప్రదేశ్‌లో చిన్నారుల మరణాలకు కారణమైన దగ్గు మందు ‘కోల్డ్‌రిఫ్’ ఇతర దేశాలకు ఎగుమతి అయ్యిందా..? అంటూ భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టత కోరింది. భారత అధికారుల నుంచి వివరణ అనంతరం ఆ దగ్గు మందుపై అలర్ట్ జారీ చేసే అవసరముందా? అనే దానిపై పరిశీలిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
తాజాగా, మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో దగ్గు సిరప్ తాగి మరో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. దీంతో, దగ్గు సిరప్ సంబంధిత మరణాల సంఖ్య 20కి చేరుకుంది. తమియా బ్లాక్‌లోని భరియాధానా గ్రామానికి చెందిన రెండున్నరేళ్ల బాలిక ధని దెహారియా, జున్నార్‌దియోకు చెందిన రెండేళ్ల జయుషా యదువంశీ సోమ, మంగళవారాల్లో చనిపోయినట్లు అదనపు కలెక్టర్ ధీరేంద్ర సింగ్ చెప్పారు. దగ్గు మందు తాగిన తర్వాత వీరిద్దరూ కిడ్నీలు ఫెయిలై ప్రాణాలు కోల్పోయారన్నారు. జిల్లాకే చెందిన మరో ఆరుగురు చిన్నారులు నాగ్‌పూర్‌లోని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.
ఇప్పటికే తెలంగాణ, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు సహా అనేక రాష్ట్రాలు కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్‌ను నిషేధించాయి. తమిళనాడు ల్యాబ్ నివేదికల ప్రకారం ‘కోల్డ్రిఫ్’లో 48.6 శాతం డైఎథిలిన్ గ్లైకాల్ (DEG) ఉన్నట్లు తేలింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ‘కోల్డ్‌రిఫ్’ అనే దగ్గు మందు వాడడం వల్ల పలువురు చిన్నారులు మృత్యువాత పడడంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా.. ఎడపెడా పిల్లలకు దగ్గు, జలుబు సిరప్‌లు వాడొద్దంటూ సూచనలు జారీ చేసింది.