మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు? | Top Maoist Leader Ganapathi Likely To Surrender Amid Health Concerns, May Lay Down Arms In Delhi | Sakshi
Sakshi News home page

మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు?

Mar 4 2026 9:19 PM | Updated on Mar 5 2026 12:36 PM

Top Maoist Leader Ganapathi Likely To Surrender

ఢిల్లీ: మావోయిస్టు అగ్రనేత, సీపీఐ(మావోయిస్టు) మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోయే అవకాశం ఉన్నట్లు  తెలుస్తోంది. 50 ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిన గణపతి.. ఆపరేషన్ కగార్ తర్వాత  అజ్ఞాతంలోకి వెళ్లారు. నేపాల్‌లో గణపతి ఆశ్రయం పొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేపాల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న గణపతి.. లొంగిపోతున్నట్లు ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గణపతి లొంగుబాటుతో మావోయిస్టులో అగ్రనేతల శకం దాదాపు ముగిసినట్లే.

వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ఆయన తెలంగాణ పోలీసులతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నారని.. త్వరలోనే లొంగిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. దశాబ్దాల పాటు సాయుధ మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన గణపతి.. 2018లో ప్రధాన కార్యదర్శి పదవి నుండి వైదొలిగారు. గణపతి వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యుల కోరిక. తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆయనతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం.

గణపతి లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ అని.. వారి సాయుధ పోరాట ముగింపునకు దారితీసే పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గణపతి.. గణపతి పర్యవేక్షణలో దేశంలో సంచలన దాడులు జరిగాయి. మావోయిస్టు నెట్‌వర్క్‌ విస్తరణలో కీలక పాత్ర పోషించిన గణపతి.. షార్ట్ కట్‌లో పార్టీలో ఎదిగాడన్న వాదన కూడా ఉంది.

1949లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్పూర్‌లో ఆయన జన్మించారు. ఉద్యమంలో గణపతిని టీచర్ అని పిలిచేవారు. 1970లో రైతు పోరాటాలు జగిత్యాల జైత్రయాత్ర ద్వారా పోరాటానికి దిగారు. నక్సల్స్‌ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్‌గా గణపతికి గుర్తింపు పొందారు. ఇప్పటికీ గణపతి భార్య సుజాత ఉద్యమంలో కొనసాగుతున్నారు. గణపతి స్వస్థలం జగిత్యాల జిల్లా సారంగపూర్.

Advertisement
 
Advertisement
Advertisement