ఎక్కువ ఈఎంఐతో ఇల్లు కొంటున్నారా? ఎంత రిస్కో చూడండి.. | Missed Just 3 EMIs Lost Rs 1 2 Crore Home Hidden Risks of Housing Loans | Sakshi
Sakshi News home page

ఎక్కువ ఈఎంఐతో ఇల్లు కొంటున్నారా? ఎంత రిస్కో చూడండి..

Mar 4 2026 3:36 PM | Updated on Mar 4 2026 4:50 PM

Missed Just 3 EMIs Lost Rs 1 2 Crore Home Hidden Risks of Housing Loans

సొంతిల్లు ప్రతి ఒక్కరికీ జీవిత కల. చాలా మంది హోమ్ లోన్‌ తీసుకుని తమ సొంతింటి ప్రయాణాన్ని మొదలు పెడుతుంటారు. అయితే సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా ఎంత పడితే అంత ఈఎంఐ (నెలసరి వాయిదా) పెట్టుకుని ఇల్లు కొనుక్కోవడం ఎంత రిస్కో ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సోషల్‌ మీడియా ముందుకు తీసుకొచ్చారు.

బెంగళూరులో ఒక వ్యక్తి కేవలం మూడు హోమ్‌ లోన్‌ ఈఎంఐలు చెల్లించకపోవడంతో తన రూ.1.2 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కోల్పోయిన సంఘటన చర్చనీయాంశమైంది. గృహ రుణాల్లో దాగి ఉన్న ఆర్థిక ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు చార్టర్డ్ అకౌంటెంట్ మీనాల్ గోయెల్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

గోయెల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమె పొరుగువారు స్థిరమైన ఉద్యోగం, స్థిరమైన ఆదాయం కలిగి ఉండి ప్రముఖ ప్రాంతంలో ఫ్లాట్ కొనుగోలు చేశారు. అయితే అక్టోబర్‌లో ఉద్యోగం కోల్పోవడంతో ఆర్థిక ఒత్తిడి మొదలైంది. జనవరి నాటికి వరుసగా మూడు ఈఎంఐలు చెల్లించలేకపోయారు. దీంతో బ్యాంకు సర్ఫాసి యాక్ట్‌ (SARFAESI Act) కింద రికవరీ చర్యలు ప్రారంభించింది.

సర్ఫాసి చట్టం ప్రకారం బ్యాంకులు.. కోర్టు జోక్యం లేకుండానే బకాయిలను వసూలు చేసుకునే అధికారం కలిగి ఉంటాయి. నోటీసు జారీ చేసిన 60 రోజుల్లోపే ఆస్తిని రూ.95 లక్షలకు వేలం వేశారు. ఆ మొత్తంలో రూ.80 లక్షలు బకాయిలకు సర్దుబాటు కాగా, ఎనిమిదేళ్ల పాటు ఈఎంఐలు చెల్లించిన రుణగ్రహీత చేతికి కేవలం రూ.15 లక్షలు మాత్రమే మిగిలాయి.

తుది ఈఎంఐ పూర్తయ్యే వరకు తనఖా పెట్టిన ఆస్తిపై పూర్తి హక్కులు రుణగ్రహీతకు ఉండవని గోయెల్ హెచ్చరించారు. ఆకస్మికంగా ఆదాయం ఆగిపోతే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ముందుగానే బ్యాంకును సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బలమైన క్రెడిట్ చరిత్ర ఉన్నవారికి రుణ పునర్వ్యవస్థీకరణ, కాలపరిమితి పొడిగింపు వంటి అవకాశాలు లభించవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ నష్టం లేదా వైద్య అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.

ఫైనాన్షియల్ ప్లానర్లు సాధారణంగా నెలవారీ ఈఎంఐలు ఆదాయంలో 40 శాతం మించకూడదని సూచిస్తున్నారు. అదనంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రావిడెంట్ ఫండ్ నిధులను వినియోగించుకోవడం వంటి ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement