అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రభావం నుంచి భారతదేశ ఎగుమతి రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.25,060 కోట్ల వ్యయంతో కూడిన ఐదేళ్ల ఎగుమతి ప్రమోషన్ మిషన్ (EPM)కు ఆమోదం తెలిపింది. పెరుగుతున్న అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితుల మధ్య భారతీయ ఎగుమతులకు ఊతం ఇచ్చేలా ప్రయత్నిస్తుంది.
అదనంగా రూ.20,000 కోట్ల క్రెడిట్ గ్యారెంటీ
చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (MSME) ఉపశమనం ఇస్తూ ఎగుమతిదారుల కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని కింద నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (NCGTC) MSMEలతో కలిసి అర్హత కలిగిన ఎగుమతిదారులకు అదనపు రుణాల రూపంలో బ్యాంకులకు రూ.20,000 కోట్ల వరకు క్రెడిట్ గ్యారెంటీ కవరేజీని విస్తరించనుంది.
టారిఫ్‌లను ఎదుర్కోవడానికి..
ఇటీవల యూఎస్ సుంకాల పెరుగుదల వల్ల ఎక్కువగా ప్రభావితమైన వస్త్రాలు, తోలు, రత్నాలు, ఆభరణాలు, ఇంజినీరింగ్ వస్తువులు, సముద్ర ఉత్పత్తులతో సహా కీలక రంగాలకు ఎగుమతి ప్రమోషన్ మిషన్ ప్రాధాన్యత ఇస్తుంది. ఎగుమతి ఆర్డర్లను కొనసాగించడానికి, ఉద్యోగాలను రక్షించడానికి కొత్త ప్రాంతాల్లో మార్కెట్ విస్తరణ ఎంతో తోడ్పడుతుందని ప్రభుత్వం పేర్కొంది.
ఎగుమతి ప్రమోషన్ మిషన్ ద్వారా వడ్డీ రాయితీ, కొలేటరల్ గ్యారెంటీలు, ఈ-కామర్స్ ఎగుమతిదారుల కోసం క్రెడిట్ కార్డులు, మార్కెట్ వైవిధ్యం కోసం క్రెడిట్ మెరుగుదల యంత్రాంగాలను అందిస్తారు. ఇది అంతర్జాతీయ బ్రాండింగ్, ప్యాకేజింగ్, ట్రేడ్ ఫెయిర్లలో పాల్గొనడానికి ఎగుమతిదారులకు మద్దతు ఇస్తుంది.
ఇదీ చదవండి: మార్జిన్ ట్రేడింగ్‌పై పెరుగుతున్న ఆసక్తి


