నేడు హైకోర్టులో విచారణ..
కేబినెట్ భేటీలో చర్చ
ఇప్పటికే ఎస్‌ఈసీకి 31 జిల్లాల రిజర్వేషన్ల గెజిట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ మంగళ, బుధవారాల్లో విడుదలయ్యే అవకాశం కనిస్తోంది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ, కేబినెట్ భేటీలో చర్చ కూడా జరగనుండడంతో 25వ తేదీనే షెడ్యూల్ జారీ అయినా అవ్వొచ్చని అధికార వర్గాలంటున్నాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమ్మతిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ)కు ప్రభుత్వం తరఫున పీఆర్‌ఆర్‌డీ తెలియజేసింది. రాబోయే మూడు, నాలుగు వారాల్లోగా (వచ్చే నెల 25వ తేదీలోగా) ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
మొత్తం 31 జిల్లాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్ కాపీలను సీఎస్‌కు అందజేసింది. మరోవైపు సోమవారం హైకోర్టులో పంచాయతీ ఎన్నికలపై విచారణ జరగాల్సి ఉండగా చీఫ్ జస్టిస్ సెలవు పెట్టడంతో వాయిదా పడింది. మంగళవారం దీనిపై విచారణ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ విచారణ సందర్భంగా తాము పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని, కోర్టు సూచనలకు అనుగుణంగా 50 శాతం లోపు రిజర్వేషన్లతో ముందుకు వెళుతున్నామని ప్రభుత్వ పక్షాన పీఆర్‌ఆర్‌డీ కోర్టుకు తెలియజేయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఎస్‌ఈసీ సై తం ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని సన్నాహాలు చే శామని కోర్టుకు నివేదించనున్నట్టు తెలిసింది. ఇంకోవైపు మంగళవారం జరగనున్న కేబినెట్ భేటీలో ఎన్నికల నిర్వహణ, తేదీలపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళ లేదా బుధవారాల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు అంటున్నారు.
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి పొరబాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పరిశీలకులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని ఆదేశించారు. హైకోర్టు నుంచి స్పష్టతరాగానే వెంటనే ఎన్నికలు జరిగే అవకాశాలున్నందున అందుకు అన్నివిధాలుగా సమాయత్తం అయ్యి ఉండాలని సూచించారు. ఎన్నికలపై సోమవారం ఆమె సమీక్ష నిర్వహించారు.


