ప్రభాస్- మారుతి కాంబినేషన్ సినిమా 'రాజాసాబ్' జనవరి 9న విడుదలైంది. అయితే, తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ అధికారుల తీరును తప్పబట్టింది. న్యాయస్థానం చెప్పినా సరే పట్టించుకోరా అంటూ ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. కొద్దిరోజుల క్రితం టికెట్ ధరలు పెంచబోమని మంత్రి చెప్పినా కూడా మళ్లీ ఎందుకు పెంచారంటూ కోర్టు ప్రశ్నించింది.
టికెట్ ధరల పెంపు కోసం ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, ప్రబాస్ ‘ది రాజాసాబ్’ సినిమాల నిర్మాతలు కొద్దిరోజుల క్రితం సింగిల్ బెంచ్ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ వారికి భారీ ఊరట లభించింది. టికెట్ రేట్లను పెంచాలంటూ సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు టికెట్ ధరల పెంపు విషయంలో హైకోర్టు కీలకవ్యాఖ్యలు చేయడంతో చర్చనీయాశంగా మారింది.
తెలంగాణలో ‘ది రాజాసాబ్’ సినిమా టికెట్ ధరలను గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెంచారు. జనవరి 9 నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.105, మల్టీప్లెక్స్‌ల్లో రూ.132 పెంపునకు ప్రభుత్వం అనుమతి కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే, 12 నుంచి 18వ తేదీ వరకు ఆ ధరలను సడలించింది. సింగిల్ స్క్రీన్‌లలో రూ.62, మల్టీప్లెక్స్‌ల్లో రూ.89 పెంచుకోవచ్చని అవకాశం కల్పించింది. టికెట్ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్‌కు అందించాల్సి ఉంటుందని ఉత్తర్వులలో తెలిపింది.


