సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుభరోసా ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లగలరా?. కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కొండన్నపల్లి వద్ద ఎండిపోయిన పంటలను శనివారం పరిశీలించారు. అనంతరం, హరీష్ మీడియాతో మాట్లాడుతూ..‘మూడు పంటలకు రైతుభరోసా ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి.. మూడు పంటలకూ డబ్బులు ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతుల దగ్గరకు పోతారు?. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లగలరా?. కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా?.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పంటలు పండుతున్నాయి. హైదరాబాద్‌కు తాగు నీరు కాళేశ్వరం నీల్లే వెళ్తున్నాయి. రేవంత్ రెడ్డి.. ముందు చిల్లర వ్యాఖ్యలు బంద్ చేయండి. కాళేశ్వరం కూలిపోయింది అంటూ ఎన్నికల్లో అడ్డగోలు ఆరోపణలు చేస్తారా?. ప్రాజెక్ట్‌ను ఎండబెట్టాలని చూస్తున్నారా?. ఇప్పటికైనా మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్ చేయించండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేళ్లలో కనీసం పది వేల ఎకరాలకు నీరు ఇచ్చిందా అని ప్రశ్నించారు.


