బెంగాల్‌లో ఈడీ సోదాలు.. మమతకు కొత్త టెన్షన్‌? | CM Mamata Banerjee React On ED Raids At IPAC Office In Kolkata, Watch News Video Inside To Know Details | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో ఈడీ సోదాలు.. మమతకు కొత్త టెన్షన్‌?

Jan 8 2026 4:25 PM | Updated on Jan 8 2026 5:04 PM

CM Mamata Banerjee React On ED raids at IPAC office in Kolkata

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎంట్రీతో రాజకీయగా ఒక్కసారిగా వేడెక్కింది. బెంగాల్‌లో రాజకీయ కన్సల్టెన్సీ ఐప్యాక్‌పై ఈడీ దాడులు చేపట్టింది. ఆ సంస్థ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ నివాసం సహా ఐప్యాక్‌కు సంబంధించిన పలు ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేపట్టినట్టు ఈడీ తెలిపింది. మరోవైపు.. ఈడీ దాడులపై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బెంగాల్‌లో ఈడీ దాడులపై తాజాగా మమతా బెనర్జీ స్పందిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ దయచేసి క్షమించండి. మీ హోంమంత్రి అమిత్‌ షాను నియంత్రించండి. రాజకీయంగా మీరు మాతో(టీఎంసీ) పోరాడండి. అలా పోరాడలేకపోతే బెంగాల్‌కు ఎందుకు వస్తున్నారు?. ప్రజాస్వామ్య పద్ధతిలో మమ్మల్ని ఓడించండి. మీరు మా పత్రాలను, మా వ్యూహాన్ని, మా ఓటర్లను, మా డేటాను, మా బెంగాల్‌ను దోచుకోవడానికి ఏజెన్సీలను వాడుకుంటున్నారు. ఇవన్నీ చేయడం వల్ల, మీకు వచ్చే సీట్ల సంఖ్య సున్నాకు తగ్గిపోతుంది. దాడులతో మీరు చేసేది ఏమీ లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

మరోవైపు.. ఈడీ అధికారులు ఐప్యాక్‌ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ నివాసంలో తనిఖీలు చేస్తుండగా మమతా బెనర్జీ, కోల్‌కతా పోలీసు కమిషనర్‌ మనోజ్‌ వర్మ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ఈ సోదాలు రాజ్యాంగవిరుద్ధమని మండిపడ్డారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘మా పార్టీ రాజకీయ వ్యూహం, అభ్యర్థుల జాబితా, రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకే ఈడీతో ఈ దాడులు చేయిస్తున్నారు. టీఎంసీ పార్టీ హార్డ్‌డిస్క్‌ను తీసుకునేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు’’ అని బెంగాల్‌ సీఎం ఆరోపించారు.

అలాగే, ఈడీ ఫోరెన్సిక్ బృందం మాకు సంబంధించిన కొంత డేటాను బదిలీ చేశారని నేను విన్నాను. వారు మా హార్డ్ డిస్క్, మా ఫైనాన్షియల్‌ పత్రాలు, రాజకీయ పత్రాలు తీసుకున్నారు. బీజేపీకి లక్షల కోట్ల ఆస్తి ఉంది. కానీ, సీబీఐ, ఈడీ వారిని ఎవరినీ పట్టుకోలేదు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 

కాగా, ఈడీ సోదాలు మనీలాండరింగ్ కేసు సంబంధించనట్టు అధికారులు చెబుతున్నారు. నేరానికి సంబంధించిన డబ్బు.. ఐ-ప్యాక్‌కు చేరినట్లు గుర్తించారని ఈడీ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. ఇదిలా ఉండగా.. మమత వద్ద కనిపించిన ఫైల్స్‌లో ఏమున్నాయో పెద్దగా తెలియకపోయినప్పటికీ ఫొటోలలో ఒక ఫైల్‌పై ‘ఫిబ్రవరి 2022’ అని గుర్తించి ఉంది. మరొక ఫైల్‌లో తృణమూల్ నాయకుల ప్రయాణ రికార్డులను వివరించే పత్రాల కట్ట ఉంది. అటువంటి ఒక పత్రంలో "మహువా మోయిత్రా x 1", ఫిబ్రవరి 2, 2022 ప్రయాణ తేదీ ప్రస్తావించబడింది. మోయిత్రా కృష్ణానగర్ ఎంపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇక, ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడైన ప్రతీక్‌ జైన్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఐటీ విభాగానికి హెడ్‌గానూ వ్యవహరిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచి టీఎంసీతో కలిసి ఐప్యాక్‌ పనిచేస్తోంది. అయితే, మరికొన్ని నెలల్లో బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement