ప్రతి వాహనదారుడికి గ్రేడ్ పాయింట్లు
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పాయింట్లలో కోత
పాయింట్లు సున్నాకు చేరితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
న్యూఢిల్లీ: దేశంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి, బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహించడానికి కఠిన నిబంధనలతో కూడిన గ్రేడ్ పాయింట్ల ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొన్నిరకాల ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసే అంశాన్ని ఇందులో చేర్చబోతున్నారు.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల కారణంగా దేశంలో ప్రతిఏటా 5 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి. 1.8 లక్షల మంది మరణిస్తున్నారు. ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడపడం, ఓవర్ స్పీడ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని కేంద్ర రహదారి, రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.
ప్రజల ప్రాణాల పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రహదారి భద్రత కోసం పలు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రోడ్ సేఫ్టీపై సీఐఐ నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు జరిమానాలు ఇప్పటికే పెంచామని గుర్తుచేశారు. ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడమే అసలు సమస్య అని వ్యాఖ్యానించారు. చట్టం అంటే ప్రజల్లో భయం గానీ, గౌరవం గానీ ఉండడం లేదని ఆక్షేపించారు.
పదేపదే ఉల్లంఘిస్తే శాశ్వతంగా రద్దు
డ్రైవింగ్ లెసెన్స్‌ల జారీలో గ్రేడ్ పాయింట్ వ్యవస్థను తీసుకురాబోతున్నామని నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు. ఇందులో ప్రతి వాహనదారుడికి కొన్ని గ్రేడ్ పాయింట్లు ముందే కేటాయిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడల్లా కొన్ని పాయింట్లు తగ్గిస్తారు. అలా మొత్తం పాయింట్లు సున్నాకు చేరినప్పుడు అతడి లైసెన్స్‌ను ఆరు నెలలపాటు రద్దు చేస్తారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే శాశ్వతంగా రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ వ్యవస్థను త్వరలో తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించారు.


