అమెరికా ఆరోపణలకు భారత్‌ కౌంటర్‌ | India Respond On USA Allegations Over Modi Phone Call To Trump | Sakshi
Sakshi News home page

అమెరికా ఆరోపణలకు భారత్‌ కౌంటర్‌

Jan 9 2026 5:33 PM | Updated on Jan 9 2026 5:48 PM

India Respond On USA Allegations Over Modi Phone Call To Trump

ఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా, భారత్‌ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. భారత్‌-అమెరికా వాణిజ్య చర్చల వేళ అగ్రరాజ్య వాణిజ్య మంత్రి హొవార్డ్‌ లుట్నిక్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ స్పందించింది. ప్రధాని మోదీ గతేదాడి.. అధ్యక్షుడు ట్రంప్‌నకు ఎనిమిది సార్లు ఫోన్లు చేశారని గుర్తు చేశారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ 500 శాతం టారిఫ్‌ల బిల్లుపై భారత్‌ స్పందించింది. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ..‘ప్రతిపాదిత బిల్లు గురించి మా దృష్టికి వచ్చింది. బిల్లుకు సంబంధించిన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. దేశీయ ఇంధన అవసరాలకు అనుగుణంగా భారత ఆయిల్‌ కొనుగోళ్లు ఉంటాయి. ఈ బిల్లు విషయమై ప్రధాని మోదీ.. ఇప్పటికే ట్రంప్‌తో ఎనిమిది సార్లు ఫోన్‌లో మాట్లాడారు. గతేడాది ఫిబ్రవరి 13 నాటికే భారత్‌, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపడానికి కట్టుబడి ఉన్నాయి. ఇప్పటికే పరస్పరం ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందానికి రావడానికి ఇరుపక్షాలు అనేక రౌండ్ల చర్చలు జరిపాయి. చాలా సందర్భాలలో మేము ఒక ఒప్పందానికి దగ్గరగా వచ్చాము’ అని తెలిపారు.

ఇదిలా ఉండగా.. అంతకుముందు అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్‌ లుట్నిక్.. భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా-భారత్‌ మధ్య వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చకపోవడానికి విధానపరమైన అడ్డంకులు కారణం కాదన్నారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా మాట్లాడేందుకు నిరాకరించడమే కారణమని వెల్లడించారు. ఇది ఆయన (ట్రంప్) ఒప్పందం.  దానికి ముగింపు రావాలంటే.. ట్రంప్‌నకు మోదీ కాల్‌ చేయాల్సి ఉంది. అయితే ఇది భారత ప్రభుత్వానికి రుచించలేదు. మోదీ చివరకు ఫోన్ చేయలేదు.

మేము ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌, వియత్నాంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం. భారత్‌తో వాటికంటే ముందే ఒప్పందం జరుగుతుందని ఊహించాం. అలా జరగకపోవడంతో ఇంతకుముందు అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా వెనక్కి తీసుకుంది. దానిపై ఇప్పుడు మేం ఆలోచించడం లేదు. బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పంద చర్చలు కొలిక్కి వస్తోన్న సమయంలో ఆ దేశ ప్రధాని కీర్‌స్టార్మర్ ట్రంప్‌నకు కాల్ చేశారు (Donald Trump). ఆ రోజే డీల్ ముగింపునకు వచ్చింది. తర్వాతి రోజు మీడియా సమావేశంలో దాని గురించి ఇరువురు నేతలు ప్రకటించారు’’ అంటూ భారత్, బ్రిటన్‌ మధ్య పోలిక తెచ్చారు. మోదీ ఫోన్‌ చేయడానికి నిరాకరించినప్పటికీ.. ఇంకా ఫోన్ చేయడానికి అవకాశం ఉందని లుట్నిక్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అయితే, ఒకవైపు ట్రేడ్‌ డీల్ చర్చలు జరుపుతూనే.. భారత్‌పై అమెరికా సుంకాలు విధించింది. తాజాగా అలాంటి బెదిరింపులకే పాల్పడింది. రష్యా నుంచి చమురు కొనే దేశాలపై మరింత కక్ష సాధించేలా 500 శాతం సుంకాలు విధించే బిల్లును తేవడానికి ట్రంప్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందితే భారత్, చైనా, బ్రెజిల్‌ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement