బిచ్చగాళ్లు, వారి సంపద గురించి చాలానే విన్నాం. బిచ్చగాళ్లుగా కొనసాగుతున్నప్పటికీ, ఖరీదైన ఇళ్లలో జీవించే వారి గురించి గతంలో అనేక కథనాలు చూశాం. కానీ ఇదొక బిచ్చగాని విషాద గాథ. కేరళలోని అలప్పు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 50 ఏళ్ళ బెగ్గర్ వద్ద లభించిన నోట్ల కట్టలు చూసి అంతా అయ్యో అనుకున్నారు. ప్రస్తుతం ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది.
ఆహారం కోసం కేరళలోని అలెప్పూ వీధుల్లో అడుక్కునే బిచ్చగాడి వద్ద విదేశీ కరెన్సీతో సహా ఏకంగా రూ.4.5 లక్షలకు పైగా నగదు లభ్యం కావడంతో స్థానికులు, అధికారులు ఆశ్చర్య పోయారు. ఈ నగదులో రద్దైన రూ.2,000 నోట్లు కూడా ఉండటం దిగ్భ్రాంతికి గురిచేసింది.
చారుమూట్ , సమీప ప్రాంతాలలో ఇతను అందరికీ సుపరిచితుడే. సోమవారం సాయంత్రం స్కూటర్‌పై వెళ్తుండగా ఒక వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. స్థానికులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రికార్డుల ప్రకారం అతను తనను తాను అనిల్ కిషోర్‌గా పరిచయం చేసుకుని, స్థానిక చిరునామా ఒకటి ఇచ్చాడు. తలకి తీవ్రమైన గాయాలయ్యాయని ప్రత్యేక చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. కానీ వారి మాటల్ని అతను పట్టించుకోలేదు. మంగళవారం ఉదయానికి, అతని మృతదేహం కడతిన్నల్ ప్రాంతంలోని ఒక దుకాణం వెలుపల కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపి, అతని సమీపంలో దొరికిన వస్తువులను పరిశీలించగా డబ్బుల విషయం వెలుగు చేసింది.
డబ్బు కట్టలు
అతని దగ్గర ఉన్న డబ్బాను స్థానిక పంచాయతీ సభ్యుడి సమక్షంలో పోలీస్ స్టేషన్‌లో తెరిచి, అధికారులే ఆశ్చర్యపోయారు. దాని లోపల ప్లాస్టిక్ డబ్బాలలో నిల్వ చేసి, టేప్‌తో చుట్టబడిన డబ్బు కట్టలు ఉన్నాయి. మొత్తం నగదు రూ.4.5 లక్షలకు పైగా ఉంది. ఆ నోట్లలో రద్దు చేయబడిన రూ.2,000 నోట్లు ,సౌదీ రియాలు కూడా ఉన్నాయి.
ఇదీ చదవండి: మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, వీడియో వైరల్
అతను భిక్షాటనపైనే జీవించేవాడని, తరచుగా ఆహారం కొనడానికి చిన్న మొత్తంలో డబ్బు అడిగేవాడని స్థానికులు చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు, అదీ విదేశీ కరెన్సీ ఉంటుందని ఎవరూ ఊహించలేదన్నారు. ఏమీ లేని వ్యక్తిగా జీవించే వ్యక్తి దగ్గర ఇంత మొత్తం ఉండటం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసిందని ఒక పంచాయతీ సభ్యుడుపేర్కొన్నాడు.
కాగా అతడు తమ బంధువు అనిచెప్పి, మృతదేహం లేదా డబ్బు కోసం ఇంతవరకూ ఎవరూరాలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో చట్ట ప్రకారం నగదును కోర్టుకు అప్పగిస్తారు. దర్యాప్తు అధికారులు ఇప్పుడు కిషోర్ నేపథ్యాన్ని ఆ డబ్బు అతనికి ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చదవండి: పెద్ద కళ్ల తోటి.. ఎక్కడ చూసినా ఆమే.. ఎవరీమె?


