సాక్షి, తాడేపల్లి: కూటమి నేతలు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని.. అందుకే పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రాయవరం సభలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పబ్లిసిటీ పీక్, విషయం వీక్ అన్నట్టుగా చంద్రబాబు వైఖరి ఉంది. ఒక్క పాసు పుస్తకం ఇవ్వటానికి ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లారు. రాయవరంలో పాస్ పుస్తకాల పంపిణీ పేరిట చంద్రబాబు హంగామా చేశారు. కానీ, చివరకు ఏమైంది.. పరాభవం ఎదురైంది. పాస్ బుక్‌లు ఇవ్వలేదని స్వయంగా సీఎంకే రైతులు చెప్పారు. అయినా కూడా వైఎస్ జగన్‌పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. రామకోటిలాగే జగన్ కోటి రాయనిదే వాళ్లకు నిద్ర పట్టదు. చంద్రబాబు, లోకేష్, పవన్‌లు జగన్ కోటి రాస్తూ.. పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అందుకే వాళ్లను ప్రజలు నమ్మడం లేదు.
చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నారు. రైతులను జగన్ ఏం ఇబ్బంది పెట్టారు?. 2018లో చంద్రబాబు కొత్త నిబంధనలు తెచ్చారు. 22(A)లో భూముల్ని పెట్టి రైతులని ఇబ్బంది పెట్టారు. చుక్కల భూమిని సైతం 22Aలో చంద్రబాబు పెట్టారు. ఆయన హయాంలోనే రైతులకు ఇబ్బందుల ఎదురయ్యాయి. జగన్ ఒక్కరి భూమిని కూడా అలా పెట్టలేదు. ఈ విషయంలో చంద్రబాబుతో చర్చకు సిద్ధం అని పేర్ని నాని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతులంతా చంద్రబాబు వలన ఇబ్బందులు పడుతున్నారు. వాటిని జగన్ పరిష్కరిస్తే ఆయనపైనే విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబును ఏం అనాలో తెలుగులో పదాలు దొరకటం లేదని అన్నారాయన.
జగన్ వచ్చాక జేసీతో పనిలేకుండా త్వరగా సమస్యలు పరిష్కారం అయ్యేలా చేశారు. చంద్రబాబు హయాంలోనే భూ రికార్డుల్లో చాలా అక్రమాలు జరిగాయి. ఆయన చెప్పే మాటలకు ఆయనకే నమ్మకం ఉండదు. బంధువులతో గొడవలు పెట్టుకో వద్దని చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఎన్టీఆర్ దగ్గర్నుంచి జూ.ఎన్టీఆర్ వరకు అందరితో గొడవలు పెట్టుకున్నదే చంద్రబాబు. కుటుంబ సభ్యులతో ఆయనకే తగాదాలు ఉన్నాయి. ఎన్డీఆర్ ఆస్తుల్ని లాక్కున్నది ఎవరు?. నిమ్మకూరులో ఎన్టీఆర్ భూములు తీసుకున్నది ఎవరో చెప్పాలి?. ఎన్టీఆర్ ట్రస్టు భవన్, ఆయన ఇల్లు, బ్యాంకు అకౌంటను లాగేసుకున్నది ఎవరు?. క్యాన్సర్ ఆస్పత్రి ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది?.. అంటూ పేర్ని నాని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో వైఎస్ జగన్ చేపట్టిన భూసర్వే ఒక చరిత్ర. కొలతలతో సహా పొలం మ్యాప్‌ను కూడా జగనే తెచ్చారు. జగన్ చేపట్టిన భూ సర్వేనే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. పాస్ బుక్కులపై క్యూఆర్ కోడ్ సిస్టమ్ తీసుకొచ్చిందే వైఎస్ జగన్. దానిని కూడా కూటమి కొనసాగిస్తోంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక.. భూ సర్వేలు, పాస్ బుక్కుల విషయంలో ఏం మార్పులు చేశారో చెప్పాలి. ఈ విషయంలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. పాసు పుస్తకాల ప్రింటింగ్‌లో కూడా కూటమి నేతలు కక్కుర్తి పడి కమీషన్లు తీసుకుంటున్నారు. పాస్ పుస్తకం మీద ఫోటో వేసుకుంటే నేరమా?. పాస్ పుస్తకం మీద జగన్ బొమ్మ తొలగించటం తప్ప చంద్రబాబు ఏం చేశారు?. అనేక ప్రభుత్వ సర్టిఫికెట్లపై చంద్రబాబు ఫొటోలు పెట్టారు కదా.
చంద్రబాబు ఆరు అడుగుల గురివింద గింజ. 18 నెలలకే రూ.2 లక్షల కోట్లు అప్పు చేశారు. రేపు వేసవి కాలానికే మా వైఎస్సార్‌సీపీ హయాంనాటి అప్పుల్ని దాటి పోతారు. త్రిబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రానికి ఏం ఒరిగిందో చెప్పాలి?. పూర్తి కాని పోలవరం దగ్గర జయం జయం చంద్రన్నా అంటూ ఎందుకు భజన చేయించారు?. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో తట్టెడు మట్టి, చెంబెడు నీళ్లు మిగిలాయి. కూటమి నేతలు రికార్డు స్థాయిలో అప్పులు చేశామని సంబురాలు చేసుకోవచ్చు అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు.
👉నాగార్జున సాగర్ నుండి ప్రకాశం బ్యారేజి కి నీళ్లు రాకపోతే కృష్ణాడెల్టా ఏం కావాలి?. మా హక్కులను కాలరాయటానికి చంద్రబాబు ఎవరు?. తన స్వార్ధానికి పొరుగు రాష్ట్రానికి మా హక్కులు కాలరాస్తారా?. ముచ్చుమర్రిలో 0.33tmc ల నీటితో కుప్పం వరకు నీళ్లు ఎలా వెళ్తాయి?. రాయలసీమకు లిఫ్టు అవసరం లేదంటూ చంద్రబాబు పాపం మూట కట్టుకుంటున్నారు. రాయలసీమ మీద చంద్రబాబుకు విద్వేషం
👉2018 నాటికే పోలవరం పూర్తి చేస్తానన అసెంబ్లీలో చెప్పిన వ్యక్తి ఇప్పుడు కనిపించటం లేదు. పోలవరం పూర్తి చేయలేని వారు నల్లమల సాగర్ ఎలా పూర్తి చేస్తారు?. ఈ ప్రాజెక్టు చేయటానికి లక్ష కోట్లు కావాలి. అమరావతి నిర్మాణానికి రెండు లక్షల కోట్లు కావాలి. ఈ సొమ్మంతా ఎక్కడినుండి తెస్తారు?. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్ వెళ్తే చంద్రబాబు రచ్చ చేశారు. అలా ఎలా వెళ్తారనీ.. తెలంగాణతో గొడవ పడాలని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అదే చంద్రబాబు నీతులు ఎలా చెప్తారు?. రాజధానిలో వెయ్యి కోట్లతో లిఫ్టులు కడతారా?. ఆ ఖర్చు చేస్తే రాయలసీమ ఎత్తిపోతల పూర్తవుతుంది కదా

రాజధానిలో మొదటి విడత భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలి. ఆ తర్వాత రెండో విడత గురించి మాట్లాడాలి. సీఎంగా ఉన్న చంద్రబాబుకు వారం వారం హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు?. రాజధానిలో రైతుల సమస్యలు పరిష్కరించమని జగన్ కోరారు. అమరావతి మీద జగన్ కు మమకారం లేకపోతే ఇల్లు కట్టుకుని ఎందుకు ఉంటారు?. చంద్రబాబుకు ఇప్పటికీ అమరావతిలో ఇల్లు లేదు. లింగమనేని రమేష్ ఇంటిలో ఎందుకు ఉంటున్నారు?
ఏపీలో కులం, మతాలను రెచ్చగొట్టేదే పవన్ కళ్యాణ్. ఆయన్ని జనం కాపు కాయాలంట. ఈయనేమో చంద్రబాబును కాపు కాస్తాడంట. మరి పిఠాపురంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ఎవరు కాపు కాయాలి?. దళితులను వెలి వేస్తుంటే ఎవరు కాపు కాయాలి? అని పేర్ని నాని ఫైర్ అయ్యారు.


