బాబు, లోకేష్‌ కోసం పవన్‌ జాకీలు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Satirical Comments On CBN And Lokesh And Pawan Kalyan | Sakshi
Sakshi News home page

బాబు, లోకేష్‌ కోసం పవన్‌ జాకీలు: వైఎస్‌ జగన్‌

Mar 11 2026 12:30 PM | Updated on Mar 11 2026 12:58 PM

YS Jagan Satirical Comments On CBN And Lokesh And Pawan Kalyan

సాక్షి, తాడేపల్లి: అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్ప్‌ డబ్బాలేనని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ విమర్శించారు. ఒకరిని మరొకరు జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అసెంబ్లీ ప్రస్తావన ఏదీ అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం.. ఇటు విద్యార్థులను, అటు రైతులను మోసం చేస్తోందన్నారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది సున్నా. అసెంబ్లీ సమావేశాల్లో తప్పులు లెక్కలు, సెల్ప్‌ డబ్బాలే. చంద్రబాబు తన కుమారుడికి జాకీలు వేసుకోవడమే సరిపోయింది. లోకేష్‌.. చంద్రబాబు కోసం జాకీలు వేశారు. చంద్రబాబు, లోకేష్‌ కోసం పవన్‌ కల్యాణ్‌ జాకీలు లేపే ప్రయత్నం చేశారు. అంతేకానీ, ప్రజలకు చేసిందేమీ లేదు. మీరు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రస్తావనే లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతీ నిరుద్యోగికి రూ.1.08 లక్షలు బకాయి పడ్డారు. నిరుద్యోగ భృతి అడుగుతుంటే సమాధానం లేదు. 18 ఏళ్లు నిండిన 60 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు 4000 పెన్షన్‌ ఇస్తామన్నారు.. హామీ అమలు చేశారా?.

ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?
60 ఏళ్ల లోపు మహిళలకు మా ప్రభుత్వ హయాంలో 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాం. కూటమి ప్రభుత్వంలో 2026 ఫిబ్రవరి నాటికి 60,96,108 మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. ఒక్క నెలలోనే 25వేల పెన్షన్లు కట్‌ చేశారు. కొత్తగా ఒక్క పెన్షన్‌ కూడా ఇవ్వలేదు. పెన్షన్ల కింద బడ్జెట్‌లో పెట్టాల్సింది రూ.31,554 కోట్లు అయితే బడ్జెట్‌ కేటాయించింది రూ.27,719 కోట్లు మాత్రమే. భవిష్యత్‌లో ఇంకా పెన్షన్లు కట్‌ చేసే అవకాశం ఉంది. పెన్షన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మా ప్రభుత్వంలో యూడీఐఎస్‌సీ ప్రకారం 87,41,885 మందికి అమ్మఒడి ఇచ్చాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తల్లికి వందనం పేరుతో 20 లక్షల మంది పిల్లలను తొలగించారు. తల్లికి వందనం కింద ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు?. ఏ ఒక్కరికి రూ.15000 ఇవ్వలేదు.

అన్నదాత సుఖీభవ పేరుతో మోసం.. 
ఉచిత బస్సు హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేకపోయారు. షరతులు పెట్టారు. ప్రతీ మహిళకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. తొలి ఏడాది ఒక సిలిండర్‌ ఇచ్చి.. మిగతా రెండు ఎగ్గొట్టారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను మోసం చేశారు. రెండేళ్లలో ప్రతీ రైతుకు రూ.40వేలకు గాను పదివేలే ఇచ్చారు. అన్నదాత సుఖీభవ నుంచి 7 లక్షల మంది రైతులను తొలగించారు. కౌలు రైతుల ప్రస్తావనే లేదు. ఉచిత పంటల బీమాను చంద్రబాబు రద్దు చేశారు. 

మోంథా తుపాను కారణంగా నష్టపోయిన లక్షల మంది రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా రైతులకు చెల్లించలేదు. ఎప్పుడు ఇస్తారో వ్యవసాయశాఖ మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా చెప్పారా?. ధ‌ర‌ల స్థిరీకరణ నిధి కోసం రూ.300 కోట్లే కేటాయించ‌డం ఏంట‌ని శాస‌న‌మండ‌లిలో మా స‌భ్యులు అడిగితే మంత్రులు ఎదురుదాడి చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఏయే పంట‌లు ఎంత ఖర్చుచేసి కొన్నామో సమగ్రమైన వివరాలను ప్రభుత్వానికి మా సభ్యులు చైర్మన్‌ ద్వారా ఇచ్చారు. ధరల స్థిరీకరణ నిధికి కేటాయింపులు పెంచి రైతులను ఆదుకోవాలన్న స్పృహ వారికి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటలకు ధరలు పడిపోయాయి. నెలరోజుల క్రితం రూ.26వేలు ఉన్న క్వింటా మిర్చి ధర, ఇప్పుడు రూ.18వేలకు తగ్గింది.

ఆదుకోకుండా.. ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం.. 
శ‌న‌గ ఎంఎస్‌పీ రూ.5,875 అయితే రైతులు రూ.5000లోపే అమ్ముకుంటున్నారు. మొక్కజొన్న MSP రూ.2,400 అయితే రైతుల‌కు రూ.1400 నుంచి రూ. 1,500 కూడా దక్కని పరిస్థితి. ఒక్క మొక్కజొన్న విషయంలోనే రైతులు రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు. అర‌టి మళ్లీ టన్ను రూ.5వేలకు పడిపోయింది. మా హయాంలో అరటి టన్ను రూ.30వేలకు అమ్ముకున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో దళారులకు వణుకు పుట్టించేవాళ్లం. రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు, రైతు కూలీల కుటుంబాలకు ఎప్పుడు పరిహారం ఇస్తారో చెప్పలేదు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడ్డం మచ్చుకైనా మాట్లాడలేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement