ప్రభాస్ 'రాజాసాబ్' థియేటర్లలోకి వచ్చింది. మిశ్రమ స్పందన వస్తోంది. మరోవైపు టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు, నిర్మాతలకు షాకిచ్చింది. టికెట్ల రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత రేట్లకే టికెట్ రేట్లు వసూలు చేయాలని బుక్ మై షోని ఆదేశించింది. ఇక మీదట ఎలాంటి మెమోలు ఇవ్వద్దని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఒకవేళ టికెట్ రేట్ పెంచాలనుకుంటే జీవో నం.120 ప్రకారం 350లోపే సినిమా టికెట్ ఉండాలని సింగిల్ బెంచ్ పేర్కొంది.
అలానే పదే పదే టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని, అలానే అధికారుల తీరుపైనా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివిగా మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారని అడిగింది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా అని మండిపడింది. కొద్దిరోజుల క్రితం టికెట్ ధరలు పెంచబోమని స్వయంగా మంత్రి చెప్పినా మళ్లీ ఎందుకు పెంచారంటూ కోర్టు, అధికారుల్ని ప్రశ్నించింది.
టికెట్ ధరల పెంపు కోసం మనశంకర్ వరప్రసాద్ గారు, రాజాసాబ్ నిర్మాతలు కొద్దిరోజుల క్రితం సింగిల్ బెంచ్ కోర్టుకు వెళ్లారు. అక్కడ వారికి భారీ ఊరట లభించింది. టికెట్ రేట్లను పెంచాలని సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని కోర్టు ఆదేశించింది. కానీ ఇప్పుడు టికెట్ ధరల పెంపు విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయిపోయింది.


