మార్జిన్‌ ట్రేడింగ్‌పై పెరుగుతున్న ఆసక్తి | Kotak Securities Margin Trading Facility allows investors to buy stocks | Sakshi
Sakshi News home page

మార్జిన్‌ ట్రేడింగ్‌పై పెరుగుతున్న ఆసక్తి

Nov 13 2025 8:30 AM | Updated on Nov 13 2025 8:30 AM

Kotak Securities Margin Trading Facility allows investors to buy stocks

రూ.1 లక్ష కోట్లకు ఎంటీఎఫ్‌ రుణాలు

మరింతగా పెరిగేందుకు అవకాశాలు

కోటక్‌ సెక్యూరిటీస్‌ సీడీబీవో ఆశీష్‌ నందా 

మార్కెట్లపై ఆశావహ ధోరణి నెలకొన్న నేపథ్యంలో మార్జిన్‌ ట్రేడింగ్‌ ఫెసిలిటీ (ఎంటీఎఫ్‌)పై ఇన్వెస్టర్లలో గణనీయంగా ఆసక్తి పెరుగుతోందని కోటక్‌ సెక్యూరిటీస్‌ చీఫ్‌ డిజిటల్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ ఆశీష్‌ నందా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పరిశ్రమవ్యాప్తంగా సగటున రూ.77,180 కోట్లుగా ఉన్న ఎంఎటీఎఫ్‌ రుణాలు ఆగస్టులో రూ.1 లక్ష కోట్ల స్థాయికి చేరడం ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో రూ.85,000 కోట్లుగా ఉన్న రుణాలు, ఈ ఏడాది తొలినాళ్లలో మార్కెట్‌ కరెక్షన్‌కి లోనైనప్పుడు రూ. 71,000 కోట్లకు తగ్గినప్పటికీ, ఆ తర్వాత మార్కెట్లతో పాటు చాలా వేగంగా పుంజుకున్నట్లు నందా వివరించారు.

అయితే, చూడటానికి భారీగా అనిపిస్తున్నా, దేశీయంగా ఎంటీఎఫ్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో దీని వాటా కేవలం 0.1 శాతమేనని నందా వివరించారు. అదే అంతర్జాతీయంగా చూస్తే అమెరికాలో ఇది 1.6 శాతంగా, చైనాలో 2.7 శాతంగా ఉన్నట్లు చెప్పారు. దేశీయంగా ఈ మార్కెట్‌ విస్తరణకు మరింతగా అవకాశాలు ఉండటాన్ని ఇది సూచిస్తోందని పేర్కొన్నారు. ఎంటీఎఫ్‌ విధానంలో షేర్లు కొనుగోలు చేసేటప్పుడు ఇన్వెస్టర్లు స్వల్ప మొత్తాన్ని మార్జిన్‌గా కడితే, బ్రోకరేజీ సంస్థలు దానికి తగ్గ నిష్పత్తిలో మిగతా మొత్తాన్ని రుణంగా సమకూరుస్తాయి. దానిపై వడ్డీ వసూలు చేస్తాయి.  మరిన్ని ముఖ్యాంశాలు ఆశీష్‌ నందా మాటల్లోనే ..

తక్కువ రిస్క్‌లు..

రిటైల్‌ ఇన్వెస్టర్లకు డిస్కౌంట్‌ బ్రోకర్లు ఎంటీఎఫ్‌ను మరింత అందుబాటులోకి తేవడంతో దీనికి మరింత ప్రాచుర్యం పెరిగింది. అలాగే, వడ్డీ రేట్ల విషయంలోనూ పోటీ పెరిగింది. కొన్ని బ్రోకింగ్‌ సంస్థలు అత్యంత తక్కువగా 9.5 శాతం–9.75 శాతం శ్రేణిలో కూడా వడ్డీ రేటుకు దీన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. డెరివేటివ్స్‌లో లభించే మార్జిన్‌ ఫెసిలిటీతో పోలిస్తే స్టాక్స్‌కి సంబంధించిన ఎంటీఎఫ్‌లో రిస్క్‌లు కాస్త తక్కువ ఉంటాయి. ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌లో ఇది 5–50 రెట్ల వరకు లభిస్తే, స్టాక్స్‌ విషయంలో లీవరేజీ 2–4 రెట్లు మాత్రమే ఉంటుంది. పైగా స్ట్రయిక్‌ ప్రైస్, ఎక్స్‌పైరీ డేట్‌తో ముగిసిపోయే సంక్లిష్టమైన ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులతో పోలిస్తే షేర్లు మన చేతిలో ఉండటం కాస్త భరోసానిచ్చే విషయంగా ఉంటుంది.

1,200 స్టాక్స్‌కి మాత్రమే అందుబాటులో..

సుమారు 6,500 పైగా లిస్టెడ్‌ స్టాక్స్‌ ఉన్నప్పటికీ 1,200 షేర్లకు మాత్రమే ఎంటీఎఫ్‌ వెసులుబాటు ఉంది. తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే చాలా మటుకు స్టాక్స్‌కి ఈ సదుపాయం ఉండదు. షేరు రేట్లను బట్టి మార్జిన్‌ అవసరాలనేవి మారిపోతుంటాయి. రిస్కు చేసి ఎక్కువ మార్జిన్‌ తీసుకుందామనుకున్నా, నియంత్రణ సంస్థ నిర్దిష్ట పరిమితులు విధించడం వల్ల బ్రోకర్లు కూడా ఒక స్థాయికి మించి రుణం ఇవ్వడానికి కుదరదు. టీసీఎస్, టాటా మోటర్స్, రిలయన్స్, జియోలాంటి కొన్ని స్టాక్స్‌లో తప్ప టాప్‌ స్టాక్స్‌లో కూడా లీవరేజీ తక్కువగానే ఉంటోంది కాబట్టి ప్రస్తుతానికైతే దీనివల్ల వ్యవస్థాగతమైన రిసు్కలేమీ లేవు. ఈ నేపథ్యంలో ఎంటీఎఫ్‌కి దేశీయంగా క్యాపిటల్‌ మార్కెట్‌ వ్యవస్థకు మూలస్తంభంగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్టర్లు దీన్ని గురించి కూలంకషంగా తెలుసుకుని, రిసు్కల గురించి స్పష్టంగా అర్థం చేసుకుని, క్రమశిక్షణతో ఉపయోగించుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇదీ చదవండి: పేలుడు ఘటనల్లో సత్య శోధన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement