పూర్తిగా డిజిటల్ శకంలో పెరుగుతున్న జెన్ జెడ్ తొలి తరం ఇన్వెస్టర్లు.. డబ్బు, లైఫ్‌స్టయిల్, విశ్వసనీయతకు సంబంధించిన అభిప్రాయాలను తిరగరాస్తున్నారు. వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నారు. ఎంచుకునే ప్రతి దాన్నుంచి గరిష్ట విలువను పొందడంపై దృష్టి పెడుతున్నారు. తాము ఉపయోగించే ప్రతి ప్రొడక్టు, సర్వీసు సరళంగా, వేగవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. దీనితో వారికి అనుగుణమైన ప్రోడక్టులను అందించే విషయంలో ఈ పరిణామం, బీమా సంస్థలకు ఒక పెద్ద డైలమాగా మారింది. వారి వాస్తవ అవసరాలు, అందుబాటులో ఉన్న సాధనాల మధ్య అంతరాలను భర్తీ చేసేలా కొత్త సొల్యూషన్స్‌ని కనుగొనాల్సిన పరిస్థితి నెలకొంది.
జెన్ జెడ్ తరం వారు ఆర్థిక ప్రణాళికలపై ఆసక్తిగానే ఉన్నప్పటికీ బీమాను ఇంకా పూర్తి స్థాయిలో పరిశీలించడం లేదు. ఇటీవలి హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో నివేదిక ప్రకారం 61 శాతం యువత హెల్త్ ఇన్సూరెన్స్‌పై ఆసక్తి చూపగా, 37 శాతం మంది క్యాష్‌లెస్ హాస్పిటల్ నెట్‌వర్క్ లభ్యతకు ప్రాధాన్యమిచ్చారు. బీమాకు ప్రాధాన్యమిస్తున్నప్పటికీ కేవలం సంప్రదాయ ఫీచర్లకే పరిమితం కాకుండా సౌకర్యం, తమకు ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటుందనే కోణాల్లో కూడా ఇన్సూరెన్స్‌ని చూస్తున్నారని దీని ద్వారా తెలుస్తోంది.
జెన్ జెడ్ తరం టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ లాంటి అంశాలపై గణనీయంగా ఖర్చు చేస్తోంది. తమ లైఫ్‌స్టయిల్‌కి అనుగుణంగా, పారదర్శకమైన, సరళమైన ట్రావెల్, హెల్త్ పాలసీలను, గ్యాడ్జెట్స్‌ను కొనుగోలు చేసేందుకు వారు సిద్ధంగా ఉంటున్నారు. దానికి తగ్గట్లుగా వారికి అర్థమయ్యే రీతిలో బీమాను వివరించి, తగు పాలసీలను అందచేయగలిగితే ఇన్సూరెన్స్ ప్రయోజనాలను జెన్ జడ్ తరంవారికి మరింతగా చేరువ చేసేందుకు వీలవుతుంది.
ఏం కోరుకుంటున్నారు..
సరళత్వం: అర్థం కాని సంక్లిష్టమైన పదాలు, సుదీర్ఘంగా ఉండే పాలసీ డాక్యుమెంట్లను వారు ఇష్టపడటం లేదు. సాదా సీదాగా అర్థమయ్యే భాషను, డిజిటల్ సాధనాలను, స్పష్టతను కోరుకుంటున్నారు.
పర్సనలైజేషన్: వారు సంప్రదాయ పద్ధతుల్లో గిరిగీసుకుని ఉండటం లేదు. ఫ్రీల్యాన్స్ కెరియర్లు మొదలుకుని ఇతరత్రా పార్ట్‌టైమ్ పనులు కూడా చేస్తున్నారు. కాబట్టి పే–యాజ్–యు–డ్రైవ్ కార్ ఇన్సూ రెన్స్, అవసరాలకు తగ్గట్లు యాడ్–ఆన్‌లను చేర్చేందుకు వీలుండే హెల్త్ పాలసీలు, స్వల్పకాలిక కవరేజీల్లాంటి ప్రోడక్టులను వారు ఇష్టపడుతున్నారు.
డిజిటల్ ఫస్ట్: ఫోన్‌తో చెల్లింపులు జరిపినట్లు లేదా ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఆర్డరు పెట్టినట్లు పాలసీ కొనుగోలు అనుభూతి కూడా సులభతరమైన విధంగా, వేగవంతంగా, మొబైల్ – ఫస్ట్ తరహాలో ఉండాలనుకుంటున్నారు.
పారదర్శకత: నైతిక విలువలు, పారదర్శక విధానాలను పాటించే బ్రాండ్స్ వైపు జెన్ జెడ్ తరం మొగ్గు చూపుతున్నారు. సమాజం, పర్యావరణంపట్ల బాధ్యతాయుతంగా ఉండే సొల్యూషన్స్.. వారి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జెన్ జడ్ తరం అవసరాలకి తగ్గ పాలసీలను అందించే దిశగా పరిశ్రమలో ఇప్పటికే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టెలీమ్యాటిక్స్ ఆధారిత వాహన బీమా యువ డ్రైవర్లకు దన్నుగా ఉంటోంది. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఆరోగ్య బీమా సంస్థలు తమ పాలసీల్లో వెల్‌నెస్ ప్రోగ్రాంలు, నగదురహిత డిజిటల్ సర్వీసులు మొదలైనవి అందిస్తున్నాయి. ప్రయాణాలు కావచ్చు ఇతరత్రా కొనుగోళ్లు కావచ్చు అన్నింటి అంతర్గతంగా బీమా ప్రయోజనాన్ని అందించే విధానం క్రమంగా ఊపందుకుంటోంది.
జెన్ జడ్ తరం వారు బీమాను భారంగా కాకుండా సాధికారతగా చూస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా కలలను సాకారం చేసుకునేందుకు తోడ్పడే భద్రత సాధనాలను వారు కోరుకుంటున్నారు. వృద్ధిలోకి వచ్చేందుకు ఇన్వెస్ట్ చేయదల్చుకుంటున్నారు. కాబట్టి బీమా అనేది డిజిటల్–ఫస్ట్‌గా, సరళంగా, పారదర్శకంగా ఉంటే కేవలం బ్యాకప్ వ్యూహంగా మాత్రమే కాకుండా వారు కోరుకునే జీవితాన్ని గడిపేందుకు సహాయపడే సాధనంగా ఉంటుంది.
వారి ఆకాంక్షలకు తగ్గట్లు పరిశ్రమ కూడా తనను తాను మల్చుకోగలిగితే జెన్ జడ్ తరానికి చేరువ కావడంతో పాటు బీమా రంగ భవిష్యత్తును సరికొత్తగా తీర్చిదిద్దుకోవడానికి ఆస్కారం ఉంటుంది. జెన్ జడ్ తరం అంటే ఏదో అల్లాటప్పా కస్టమర్ సెగ్మెంట్ కాదు, బీమా రంగం భవిష్యత్తుకు దిక్సూచిలాంటిది. కొత ఆవిష్కరణలను కనుగొనడం, పాలసీలను మరింత సరళం చేయడం, చక్కగా అర్థమయ్యేలా వివరించడంలాంటి అంశాల్లో పరిశ్రమ పురోగమనాన్ని ఇది మరింత వేగవంతం చేయనుంది.


