ఈక్విటీ పెట్టుబడిదారులపై సెబీ చీఫ్ గురి
ముంబై: రానున్న మూడు నుంచి ఐదేళ్లలో ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడిదారుల సంఖ్య రెట్టింపునకు పెంచే లక్ష్యంతో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలియజేశారు. ఇటీవల సెబీ చేపట్టిన సర్వే పలు అంశాలు వెల్లడైనట్లు పాండే పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో ఐదోవంతు వివిధ మార్గాల ద్వారా సెక్యూరిటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిని ప్రదర్శించినట్లు వెల్లడించారు.
2025 అక్టోబర్‌కల్లా దేశీయంగా మొత్తం ఇన్వెస్టర్ల సంఖ్య 12.2 కోట్లకు చేరింది. 2020లో కోవిడ్ మహ మ్మారి బయటపడ్డాక ఈ సంఖ్య వేగంగా పెరిగింది. కాగా.. ఇన్వెస్టర్ల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పాండే తెలియజేశారు. తద్వారా 10 కోట్లమందిని జత చేసుకోగలిగితే పలు దేశాల ప్రజలను మించి దేశీ ఇన్వెస్టర్ల సంఖ్య బలపడనున్నట్లు సీఐఐ ఫైనాన్సింగ్ సదస్సులో ప్రస్తావించారు.
సెబీతోపాటు..
నియంత్రణ సంస్థ సెబీసహా.. కార్పొరేట్లు నాణ్యమైన సెక్యూరిటీల జారీకి కట్టుబడటం ద్వారా క్యాపిటల్ మార్కెట్ల ఎకోసిస్టమ్ బలపడుతుందని పాండే పేర్కొన్నారు. దీంతో పెట్టుబడిదారులను ఆకట్టుకోవచ్చని తెలియజేశారు. యూఎస్ మార్కెట్లలో కరెక్షన్ వచి్చనప్పటికీ దేశీయంగా ఇన్వెస్టర్ల భారీ పెట్టుబడుల కారణంగా దేశీ మార్కెట్లు నిలదొక్కుకుంటాయని అభిప్రాయపడ్డారు.
దేశీ మార్కెట్లలో గాలిబుడగల(బబుల్) పరిస్థితిలేదని, అత్యుత్తమ ఆర్థిక వృద్ధి, ప్రభుత్వ పెట్టుబడులు, సంస్కరణలు, సులభతర వ్యాపార నిర్వహణకు వీలు వంటి అంశాలపట్ల ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపడుతున్నట్లు వివరించారు. కొత్త నియంత్రణలకు తెరతీయడం సెబీ అజెండాకాదని, అర్ధంచేసుకోగలిగే సరళతర, ఆవిష్కరణలకు మద్దతిచ్చే తెలివైన నిబంధనలను రూపొందించనున్నట్లు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో ఈక్విటీ క్యాపిటల్ రూ. 2.5 లక్షల కోట్లను అధిగమించగా.. 7 నెలల్లో కార్పొరేట్ బాండ్ల పెట్టుబడులు రూ. 5.5 లక్షల కోట్లను తాకినట్లు వెల్లడించారు.


