నైరోబీ: కెన్యాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కాష్మీర్ సయ్యద్‌కు విమాన ప్రయాణంలో ఘోర అవమానం ఎదురైంది. ‘కెన్యా ఎయిర్‌వేస్’లో తాను ముందుగా బుక్ చేసుకున్న బిజినెస్ క్లాస్ సీటును తనకు కేటాయించకుండా, ఎకానమీ క్లాస్‌కు మార్చడంపై ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ అంశం అంతర్జాతీయంగా మారింది.
కాష్మీర్ సయ్యద్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె గత వారంలో తన ప్రయాణం కోసం బిజినెస్ క్లాస్ టికెట్‌ను బుక్ చేసుకుని, నిర్ణీత సమయంలోనే చెక్-ఇన్ కూడా పూర్తి చేశారు. అయితే విమానం ఎక్కే సమయంలో సిబ్బంది ఆమెను ఎకానమీ క్లాస్‌కు వెళ్లాలని సూచించారు. వెంటనే ఆమె ప్రశ్నించగా, విమాన సిబ్బంది సరైన సమాధానం చెప్పకుండా, ముప్పై నిమిషాల పాటు వేచి ఉండేలా చేశారని ఆమె ఆరోపించారు. స్థానిక కెన్యా పౌరురాలైన తనను కాదని, తన సీటునుఘెందుకు తెల్లజాతీయులకు కేటాయించారని ఆమె విమాన సిబ్బందిని నిలదీశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో కాష్మీర్ సయ్యద్ సిబ్బందితో విమాన వాదించడం కనిపిస్తుంది. ‘ఈ సీటు కోసం నేను డబ్బు చెల్లించాను. చెక్-ఇన్ చేశాను.. మరి నా సీటులో ఎవరు కూర్చుంటారు?’ అని ఆమె విమాన సిబ్బందిని నిలదీశారు. దీంతో విమాన సంస్థ ప్రతినిధులు ఆమెకు రీఫండ్ ఇస్తామని లేదా తదుపరి విమానంలో పంపిస్తామని ఆఫర్ చేసినప్పటికీ, ఆమె వాటిని తిరస్కరించారు. ఇది కేవలం సాంకేతిక లోపం కాదని, స్పష్టమైన జాత్యహంకార వివక్ష అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎయిర్‌లైన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదం ముదిరిన నేపధ్యంలో కెన్యా ఎయిర్‌వేస్ స్పందించింది. తమపై వస్తున్న జాత్యహంకార ఆరోపణలను సంస్థ ఖండించింది. విమాన ప్రయాణ సమయంలో చివరి నిమిషంలో విమానం మారడం వల్ల బిజినెస్ క్లాస్ సీట్ల సంఖ్య తగ్గిందని, అందుకే కొందరు ప్రయాణికులను ఎకానమీకి మార్చాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. ఈ విధమైన ఎంపిక ప్రక్రియ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆటోమేటిక్‌గా జరుగుతుందని, ఇందులో జాతి వివక్షకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బాధిత ప్రయాణికురాలికి జరిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ సంస్థ ఆమెను క్షమాపణలు కోరింది.
ఇది కూడా చదవండి: Denmark: ఉత్తరాలపై డెన్మార్క్ కీలక నిర్ణయం.. కాల గర్భంలోకి 400 ఏళ్ల చరిత్ర!


