ఎప్‌స్టీన్‌ను గొంతు నులిపి చంపేశారు : ఫోరెన్సిక్ నిపుణుడు సంచలన వ్యాఖ్యలు | Jeffrey Epstein strangled says doctor who observed his autopsy for family | Sakshi
Sakshi News home page

ఎప్‌స్టీన్‌ను గొంతు నులిపి చంపేశారు : ఫోరెన్సిక్ నిపుణుడు సంచలన వ్యాఖ్యలు

Feb 14 2026 3:19 PM | Updated on Feb 14 2026 3:50 PM

 Jeffrey Epstein strangled says doctor who observed his autopsy for family

లైంగిక కుంభకోణంతో ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు అమెరికా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌. మైనర్‌ బాలికల అక్రమరవాణా, తన పలుకుబడి పెంచుకోడానికి ప్రముఖుల లైంగిక వాంఛలను తీర్చడానికి వారిని వాడుకున్నాడన్న ఆరోపణలు  సంచలనం సృష్టించాయి. దీంతో 2005లో మైనర్‌ బాలికపై లైంగిక వెధింపుల కేసు నమోదు కావడంతో ఎప్‌స్టీన్‌ బాగోతం బహిర్గతమైంది. అయితే 2008లో దోషిగా తేలినా మామూలు శిక్షతో బయటకు రావడం వివాదాస్పదమైంది. ఆ తరువాత 2019లో మళ్లీ అరెస్ట్‌ అయిన కొద్ది రోజులకే న్యూయార్క్‌ జైల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.  

దీన్ని అధికారికంగా ఆత్మహత్యగా ప్రకటించినా, జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. బడా బాబుల పేర్లు బయటకు రాకూడదనే కారణంతోనే  విచారణకుముందు ఎప్‌స్టీన్‌ను గుట్టుగా మట్టుబెట్టారనే ఆరోపణలు గుప్పుమన్నాయి.  తాజాగా జెఫ్రీ ఎప్‌స్టీన్ మరణంపై అతని కుటుంబం కోసం  పోస్ట్‌మార్టం నివేదిక పరిశీంచిన ఫోరెన్సీక్‌ నిపుణుడు డాక్టర్ మైఖేల్ బాడెన్ వ్యాఖ్యలు ఈ అనుమానాలను  మరింత ఆజ్యం పోశాయి.

జెఫ్రీ ఎప్‌స్టన్‌ కన్నమూసి  7 ఏళ్లు గడుస్తున్నా అతని మరణం చుట్టూ ఉన్న మిస్టరీ ఇంకా వీడలేదు. అతని ఆత్మహత్యగా నిర్ధారిస్తూ గతంలో వచ్చిన నివేదికలను ప్రముఖ ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ మైఖేల్ బాడెన్ మరోసారి సవాలు చేశారు. ఆ రోజు ఏం జరిగిందనే దానిపై సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. జెఫ్రీది  ఆత్మహత్య కాదు, గొంతు నులిమి చంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

డాక్టర్ బాడెన్ కీలక సాక్ష్యాలు-వాదనలు
ఎప్‌స్టీన్‌ కుటుంబం తరపున పోస్ట్‌మార్టం ప్రక్రియను పరిశీలించిన డాక్టర్ బాడెన్, తన పరిశీలనలో  ​కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తారు. ఎప్‌స్టీన్ మెడలోని మూడు చోట్ల ఎముకలు విరిగి (ఒకటి హ్యోయిడ్ ఎముక, రెండు థైరాయిడ్ కార్టిలేజ్) ఉండటం ఇందులో ప్రధానమైన అంశంగా మారింది. బాడెన్ తన 50 ఏళ్ల కెరీర్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న వారిలో ఇలా మూడు ఎముకలు విరగడం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. గొంతు నులిమి హత్య చేసిననప్పుడు (Strangulation) మాత్రమే ఇది సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ డాక్టర్ బార్బరా సాంప్సన్ స్వయంగా పోస్ట్‌మార్టం సమయంలో లేకపోయినప్పటికీ, దీనిని ఆత్మహత్యగా ప్రకటించారని బాడెన్ ఆరోపించారు. ఎప్స్టీన్ ఉన్న మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్‌లో భద్రతా నిబంధనల లోపాన్ని ఎత్తి చూపారు. అలాగే జైలు రికార్డులు తారుమారు చేయబడ్డాయని అమెరికా న్యాయశాఖ (DOJ) నివేదిక కూడా ధృవీకరించింది.

ఆ రాత్రి ఏం జరిగింది? – అనుమానాస్పద అంశాలు
ఎప్‌స్టీన్ మరణానికి ఒకరోజు ముందు, అతని సెల్‌మేట్‌ను వేరే చోటికి మార్చారు. ఆ రాత్రిఅతడిని గదిలో ఒంటరిగానే  ఉంచారు. నిబంధనల ప్రకారం ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఖైదీని పర్యవేక్షించాల్సి ఉండగా, రాత్రి 10:40 తర్వాత ఎటువంటి తనిఖీలు జరగలేదు. పైగా సిబ్బంది తనిఖీలు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించారు.

ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపు

సీసీటీవీ ఫుటేజీలో రాత్రి 10:39 గంటల సమయంలో ఎప్స్టీన్ ఉన్న విభాగం వైపు ఎవరో వెళ్లినట్లు నారింజ రంగు నీడ  (Orange Flash)  కనిపించింది. అది నారింజ రంగు జైలు దుస్తులు ధరించిన మరో ఖైదీ అయి ఉండవచ్చని స్వతంత్ర విశ్లేషణలు చెబుతున్నాయి అంతేకాదు అతని  సెల్‌లో అవసరానికి మించి దుప్పట్లు, బట్టలు ఉన్నాయి. వాటినే తాళ్లుగా మార్చినట్లు గుర్తించారు.

అధికారిక నివేదికలు దీనిని ఆత్మహత్యగా  చెబుతున్నప్పటికీ, జైలు సిబ్బంది నిర్లక్ష్యం, తప్పుడు రికార్డులు, మెడపై ఉన్న గాయాలతో పలు అనుమానాలకు తావిచ్చాయి. దీనికితోడు డాక్టర్ బాడెన్ చేస్తున్న  తాజా వ్యాఖ్యలు ఈ కేసును మళ్ళీ తెరపైకి తెచ్చాయి. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ పేరుతో యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఇటీవల లక్షల పేజీలు, వేలాది ఫోటోలను విడుదల చేసిన తరువాత ఇది మరో  కీలక పరిణామం.

ఇదీ చదవండి: పోలీస్ వేషం, వీడియో కాల్ : నమ్మితే మునిగినట్టే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement