కోపెన్‌హాగన్: ఆధునిక డిజిటల్ యుగం ప్రపంచంలోని అన్నింటినీ సమూలంగా మార్చివేస్తోంది. ఈ ప్రభావం పోస్టల్ విభాగంపై తీవ్రంగా పడింది. సుమారు నాలుగు శతాబ్దాల కాలంగా ప్రజల మధ్య వారధిగా నిలిచిన డెన్మార్క్ పోస్టల్ సర్వీస్ తాజాగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలో భౌతిక రూపంలో ఉండే ఉత్తరాల పంపిణీని అధికారికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
దాదాపు 400 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ వ్యవస్థ, మారుతున్న కాలానికి అనుగుణంగా తన సేవలను సమూలంగా మార్చుకుంటోంది. ఉత్తరాల పంపిణీ కోసం దశాబ్దాలుగా కొనసాగిన సార్వత్రిక సేవా బాధ్యత (Universal Service Obligation) ఒప్పందం ముగియడంతో డెన్మార్క్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఉత్తరాలు రాయడం తగ్గించడమే దీనికి ప్రధాన కారణం. గడచిన 20 ఏళ్లలో డెన్మార్క్‌లో ఉత్తరాల సంఖ్య ఏకంగా 90శాతానికి పడిపోయింది. స్మార్ట్‌ఫోన్లు, ఇమెయిల్స్, ఇతర డిజిటల్ సమాచార వ్యవస్థలు అందుబాటులోకి రావడంతో ప్రజలు కాగితంపై రాసే ఉత్తరాలకు దూరమయ్యారు.
ఒకప్పుడు వేల సంఖ్యలో పోస్ట్‌మెన్‌లు వీధివీధిన తిరిగిన రోజులు ఉండేవి. ప్రస్తుతం ఉత్తరాలు మోయడం అనేది పోస్టల్ విభాగానికి ఆర్థికంగా భారంగా మారింది. దీంతో ప్రభుత్వం పోస్టల్ సేవలను కేవలం పార్సిల్స్, వ్యాపార సరుకుల పంపిణీకే పరిమితం చేయాలని నిర్ణయించింది. మరోవైపు డిజిటల్ విప్లవంలో డెన్మార్క్ అగ్రగామిగా ఉంది. ఈ నిర్ణయంతో డెన్మార్క్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా డిజిటలైజ్ అవుతున్న దేశంగా మరోసారి నిరూపితమయ్యింది. ఇప్పటికే డెన్మార్క్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ప్రజల మధ్య కమ్యూనికేషన్ అనేది దాదాపు 100శాతం మేరకు డిజిటల్ వేదికల ద్వారానే సాగుతోంది.
అయితే డెన్మార్క్ పోస్టల్ విభాగం తీసుకున్న నిర్ణయం వృద్ధులకు, సాంకేతికతపై అవగాహన లేని వారికి కొంతమేరకు ఇబ్బంది కలిగించేది ఉందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా పోస్టల్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభావం పడనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే సంప్రదాయ రీతిలో ఉత్తరాల పంపిణీ ఆగిపోయినప్పటికీ, పార్సిల్, డెలివరీ రంగంలో తమ సేవలను మరింతగా మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే డెన్మార్క్ పోస్టల్ విభాగం వృద్ధుల కోసం ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసి, వారికి డిజిటల్ వ్యవస్థపై అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నది.
ఇది కూడా చదవండి: దిక్కుతోచని ప్రయాణికులు.. విమానాల నుంచే ‘విషెస్’!


