గ్రీన్‌లాండ్ విషయంలో డెన్మార్క్ ప్రధాని వ్యాఖ్య
కోపెన్‌హాగెన్: తమ దేశ సార్వభౌమత్వ అంశాన్ని ఇతరులతో చర్చించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని డెన్మార్క్ మహిళా ప్రధాని మెటె ఫ్రెడరిక్సన్ తెగేసి చెప్పారు. పాక్షికంగా డెన్మార్క్ ఏలుబడిలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా చేజిక్కించుకుంటామని, ఆర్కిటిక్ ప్రాంతంలో భద్రతపై నాటో కూటమి ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టేతో సంప్రతింపులు జరిపామని ట్రంప్ ప్రకటించిన వేళ ఫ్రెడరిక్సన్ ఘాటుగా స్పందించారు.
‘‘ ఆర్కిటిక్ ప్రాంతంలో భద్రత అనేది నాటో సభ్యదేశాలన్నీ కూర్చుని మాట్లాడుకోవాల్సిన అంశం. నాటో చీఫ్ హోదాలో రుట్టేతో ట్రంప్ మాట్లాడినా ఇబ్బందేంలేదు. కానీ గ్రీన్‌లాండ్ వంటి మాకు సంబంధించిన సార్వ భౌమత్వ అంశాలపై ఎవరు మాట్లాడినా ఊరుకోబోం. మా సార్వభౌమత్వ అంశాన్ని ఇంకెవరితోనో చర్చించాల్సిన అగత్యం మాకు లేదు. దావోస్‌లో ట్రంప్, రుట్టే మాట్లాడుకున్నారు. అంతకుముందు, తర్వాత సైతం రుట్టేతో మాట్లాడా. అది కేవలం మర్యాదపూర్వక భేటీ. అందులో గ్రీన్‌లాండ్ అంశం చర్చకు రాలేదు’’ అని ఫ్రెడరిక్సన్ స్పష్టంచేశారు.


