Mark Rutte
-
Video: 14 ఏళ్లు ప్రధానిగా సేవలు.. ఓటమి తర్వాత సైకిల్‌పై ఇంటికి!
జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎంత ఆస్తి సంపాదించినా, ఎన్ని మంచి పనులు చేసినా.. గర్వం, అహంకారం దరిచేరకుండా నిరాడంబరంగా ఉండాలనేది దీని సారంశం. కొందరికి డబ్బు, అధికారం అందగానే గొప్పగా జీవిస్తుంటారు.. కానీ మరికొందరు తాము ఎంత పెద్ద స్థాయిలో ఉన్న సింపుల్‌గానే జీవిస్తుంటారు. అందుకు నిదర్శనంగా నిలిచారు. డచ్ ప్రధాని మార్క్ రుట్టే..ఇటీవల జరిగిన నెదర్లాండ్స్ ప్రధానమంత్రిగా 14 ఏళ్లు సేవలందించిన మార్క్ రుట్టే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే కొత్త పీఎంగా ఎన్నికైన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ డిక్ షూఫ్‌కు అధికారికంగా బాధ్యతలు అప్పగించి రుట్టే సాధారణ పౌరుడిగా సైకిల్ తొక్కుంటూ వెళ్లిపోయారు.రుట్టే సైకిల్‌పై వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆయన సైకిల్‌పై అధ్యక్ష భవనం నుంచి బయటకు వస్తున్న సమయంలో కొంతమంది రుట్టేను చప్పట్లు కొట్టి ప్రశంసించడం వీడియోలో చూడొచ్చు. అయితే, రూట్టేకు ‘సైకిల్ రైడ్’ చేయడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా సభలకు సైకిల్‌పై వచ్చి తన నిరాడంబరతను, అంకితభావాన్ని చాటారాయన.అయితే డచ్ పద్ధతిలో ఇలా చేయడం ఆ దేశ ఆచారమని అంటున్నారు. ఎలాగైతే ఖాళీ చేతులతో ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి వచ్చారో, అలాగే వెళ్లిపోవడం అక్కడ జరుగుతుందట. ఇక ఇక 14 ఏళ్లు నెదర్లాండ్స్ ప్రధానిగా సేవలు అందించిన మార్క్ రుట్టే.. వచ్చే ఏడాది 'నాటో' కొత్త సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.After 14 years in power, this is how former Dutch Prime Minister Mark Rutte left the Prime Minister's Office after completing the ceremony of officially handing over power to his successor, Dick Schoof.#netherlands pic.twitter.com/exux8saX0D— Kiran Bedi (@thekiranbedi) July 6, 2024 -
ప్రభుత్వాన్నే ముంచేసిన.. వలసల వరద..
నెదర్లాండ్స్‌లో నాలుగు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికైన ఏడాదిన్నరకే పేకమేడలా కుప్పకూలింది. యూరప్‌లో చాలా దేశాలు ఎదుర్కొంటున్న వలసల ఉధృతే ఇందుకు ప్రధాన కారణం కావడం అక్కడ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.. నెదర్లాండ్స్‌లోకి వలసలను కట్టడి చేసేందుకు ప్రధాని మార్క్ రుట్టె ప్రతిపాదించిన కఠినతరమైన వలసల విధానం చివరికి ఆయన ప్రభుత్వానికే ఎసరు తెచి్చంది. పాలక సంకీర్ణంలోని మిగతా మూడు భాగస్వామ్య పార్టీలూ ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో రుట్టె రాజీనామా చేశారు. అయితే, భాగస్వాముల మాటకు తలొగ్గి రాజీ పడేకంటే దీర్ఘకాలిక స్వీయ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్న దూరదృష్టి ఆయన నిర్ణయంలో ప్రతిఫలించిందని పరిశీలకులు భావిస్తున్నారు. అంతేగాక యూరప్‌లో వలసల సమస్య నానాటికీ ఎంత తీవ్రతరంగా మారుతోందో, అక్కడి రాజకీయాలను ఎంతగా ప్రభావితం చేస్తోందో, దీన్ని రైట్ వింగ్ పార్టీలు సొమ్ము చేసుకోకుండా ఆపడం ప్రధాన పార్టీలకు ఎంత కష్టతరంగా పరిణమిస్తోందో ఈ ఉదంతం మరోసారి తేటతెల్లం చేసిందని చెబుతున్నారు. ► యూరప్‌లోని అత్యంత ధనిక దేశాల్లో నెదర్లాండ్స్‌ది నాలుగో స్థానం ► నెదర్లాండ్స్‌లోకి వలసల సంఖ్య గతేడాది ఏకంగా మూడో వంతు పెరిగి 47 వేలు దాటేసింది! దాంతో ప్రధాని రుట్టె కట్టడి చర్యలను ప్రతిపాదించాల్సి వచి్చంది. ► ఈసారి దేశంలోకి శరణార్థుల సంఖ్య ఏకంగా 70 వేలు దాటొచ్చని అంచనా. ► వలసదారుల దెబ్బకు చాలా యూరప్ దేశాల్లో మాదిరిగానే నెదర్లాండ్స్‌లో కూడా ఇళ్ల ధరలు, అద్దెలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ► ఇదేగాక పెరుగుతున్న వలసల వల్ల అనేకానేక సమస్యలతో నెదర్లాండ్స్ సతమతమవుతోంది. ► నవంబర్‌లో జరుగుతాయని భావిస్తున్న ఎన్నికల్లో అన్ని పార్టీలకూ ఇది అది పెద్ద ప్రచారాంశంగా మారినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ► ఇప్పుడిక నెదర్లాండ్స్ రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏమిటీ ప్రతిపాదిత విధానం... ప్రధానంగా, నెదర్లాండ్స్‌లో నివసిస్తున్న వలసదారుల పిల్లలకు వలసదారులుగా గుర్తింపు ఇచ్చేందుకు కనీసం రెండేళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉండాలని ప్రధాని రుట్టె ప్రతిపాదించారు. దీన్ని సంకీర్ణ భాగస్వాములు తీవ్రంగా వ్యతిరేకించారు. యూరప్‌కు పెనుభారంగా వలసలు... ► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితర కారణాలతో యూరప్ దేశాలకు కొన్నేళ్లుగా వలసలు భారీగా పెరుగుతున్నాయి. ► 2015లో సిరియా నుంచి శరణార్థులు వెల్లువెత్తిన నాటి నుంచీ ఈ ధోరణి నానాటికీ పెరుగుతూనే ఉంది. ► కానీ ద్రవ్యోల్బణం తదితరాలతో అసలే ధరాభారం, జీవన వ్యయం నానాటికీ పెరిగిపోతున్న సమయంలో ఈ వలసలు క్రమంగా యూరప్ దేశాలకు తలకు మించిన భారంగా మారుతున్నాయి. ► దీన్ని అవకాశంగా మలచుకుంటూ పలు యూరప్ దేశాల్లో రైట్ వింగ్ పార్టీలు శరణార్థుల పక్షం వహిస్తుండటంతో యూరప్ రాజకీయాలే కీలకమైన, అనూహ్యమైన మలుపు తిరుగుతున్నాయి. చాలా దేశాల్లో ఇప్పటికే రాజకీయాలను నిర్దేశించే స్థాయికి చేరుకున్నాయి కూడా. ► ఏళ్లుగా పాతుకుపోయిన సంప్రదాయ పార్టీలకు ఈ రైట్ వింగ్ పార్టీల ఎదుగుదల పెను సవాలుగా మారుతోంది. ► జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, హంగరీ మొదలుకుని చిన్నా పెద్దా యూరప్ దేశాలన్నింట్లోనూ ఇదే పరిస్థితి! ► దాంతో రైట్ వింగ్ పార్టీలకు ముకుతాడు వేసేందుకు సంప్రదాయ పార్టీలన్నీ చేతులు కలుపుతున్న కొత్త ధోరణి కూడా కొన్ని దేశాల్లో ఇప్పటికే మొదలైంది. రుట్టె కేంద్రంగా... ► నెదర్లాండ్స్‌లో వలసలపై నెలకొన్న తాజా సంక్షోభం ప్రధాని రు ట్టె సంప్రదాయ వైఖరి కారణంగానే ముదురు పాకాన పడింది. ► 13 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న రుట్టె, దీన్ని కూడా అందివచి్చన అవకాశంగానే మలచుకుని వెంటనే రాజీనామా చేశారు. ► ఇటీవల బలం పుంజుకుంటున్న రైట్‌వింగ్ పార్టీల దూకుడుకు అడ్డుకట్ట వేయడంతో పాటు దేశ ప్రయోజనాలు కాపాడేందుకు అధికారాన్ని కూడా తృణప్రాయంగా వదులుకున్నారన్న ఇమేజీ సాధించి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టే లక్ష్యంతోనే ఆయన రాజీనామా చేసినట్టు కనిపిస్తోంది. ► రైట్ వింగ్ పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టడం ద్వారా రుట్టె తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. ► అంతేగాక రాజీనామా ద్వారా యూరప్ యవనికపై వలసల కట్ట డి కోసం గళమెత్తుతున్న బలమైన నేతగా రుట్టె ఆవిర్భవించారు. ► యూరప్‌లోకి వలసల కట్టడికి సంయుక్త ఈయూ బోర్డర్ ఏజెన్సీ వంటివాటి ఏర్పాటును కూడా కొంతకాలంగా ఆయన ప్రతిపాదిస్తున్నారు. అయితే రాజీనామా ద్వారా దేశ ప్రయోజనాల కంటే స్వీయ రాజకీయ ప్రయోజనాలకే ఆయన పెద్దపీట వేసుకున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి! ‘కేవలం ప్రతిపాదిత వలస విధానంపై విభేదాల వల్ల ఏకంగా పాలక సంకీర్ణమే కుప్పకూలడం నమ్మశక్యం కాని నిజం! ఏదేమైనా రాజీనామా నిర్ణయం ప్రధాని రుట్టె రాజకీయ చతురతకు అద్దం పట్టింది’ – మార్సెల్ హనెగ్రాఫ్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్డామ్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
Dutch Crisis: డచ్ సర్కార్ ఎందుకు కుప్పకూలినట్లు?
పద్దెనిమిది నెలల పాలన తర్వాత అనూహ్య పరిణామాలతో.. సంకీర్ణ ప్రభుత్వం చీలిపోయి నెదర్లాండ్స్ ప్రభుత్వం కుప్పకూలింది. డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే(56) తన రాజీనామాను స్వయంగా ప్రకటించారు. కీలకమైన విషయంలో కూటమి ప్రభుత్వంలోని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సి వస్తోందని ప్రకటించారాయన. ఇంతకీ ఆ కీలకమైన అంశం ఏంటంటే.. నెదర్లాండ్స్ ప్రభుత్వం పడిపోవడానికి కారణం.. వలసల సమస్య. ఇమ్మిగ్రేషన్ పాలసీపై ప్రభుత్వ ప్రతిపాదనకు అనుగుణంగా ఒక ఒప్పందానికి కూటమి పార్టీలు ముందుకు రాకపోవడంతో గందరగోళనం నెలకొని.. రాజకీయ సంక్షోభానికి తెర తీసింది. నెదర్లాండ్స్‌లో దాదాపు రెండేళ్ల తర్వాత ప్రధాని రుట్టే కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. వార్ జోన్ల నుంచి వచ్చే శరణార్థుల సంఖ్యను 200 మందికి మాత్రమే పరిమితం చేసేందుకు మొగ్గు చూపించారాయన. ఈ ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం(రుట్టేIV)లోని D66, క్రిస్టియన్ యూనియన్ పార్టీలు అంగీకరించలేదు. ఇవి చిన్న పార్టీలే అయినా.. ప్రజల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది. అయితే రుట్టే సొంత పార్టీ పీపుల్స్ పార్టీ ఫర్ ఫ్రీడమ్ అండ్ డెమొక్రసీ మాత్రం శరణార్థుల సంఖ్యను పరిమితం చేసేందుకే మొగ్గుచూపించింది. అధిక వలసలతో దేశంపై ఆర్థిక భారం పడుతోందని.. కట్టడి కోసం యత్నించాలని సూచిస్తూ వచ్చింది. మిత్ర పక్షాలు మాత్రం శరణార్థులను కట్టడి చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలపబోమని స్పష్టం చేశాయి. ఈ భేదాభిప్రాయాలు కాస్త తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీయడంతో ప్రభుత్వం కుప్పకూలింది. తక్షణ ఎన్నికలు జరపాల్సిందే! ప్రధాని రుట్టే.. శుక్రవారం తన రాజీనామా ప్రకటించారు. తన రాజీనామాను కింగ్ విల్లెమ్ అలెగ్జాండర్‌కు సమర్పించారు. డచ్ ఎన్నికల సంఘం.. నవంబర్ మధ్యలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రకటన చేసింది. దీంతో అప్పటిదాకా రుట్టే ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ, ప్రతిపక్షాలు మాత్రం తక్షణ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే కూటమి ప్రభుత్వం ద్వారా తాము అధికారంలో కూర్చుంటామని చెబుతున్నాయి. మార్క్ రుట్టే.. 2002లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. నెదర్లాండ్స్‌కు సుదీర్ఘంగా ప్రధాన మంత్రిగా కొనసాగిన వ్యక్తాయన. 2010 నుంచి ఆయన ప్రధాని పదవిలో ఉన్నారు. 2012, 2017, 2021.. ఎన్నికల్లోనూ ఆయన ప్రధానిగా ప్రమాణం చేశారు. 2021లో 150 సీట్లకుగానూ 34 సీట్లు గెల్చుకుని.. డీ66, సీయూ, సీడీఏ పార్టీల సహకారంతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. -
ఒలికిపోయిన కాఫీ.. క్లీన్ చేసిన ప్రధాని!
ఎడిన్బర్గ్: రాజకీయ నేతలంటేనే ఆర్భాటాలు, హంగులు, సేవలు చేయించుకోడానికి సిబ్బంది, సైగలతోనే శాసనాలు.. అబ్బో ఆ హంగామానే వేరు. అలాంటిది ఆయనో ప్రధాని. ఆ స్థాయి వ్యక్తి నుంచి అంత కంటే ఎక్కువ బిల్డప్పే ఆశించటం సహజం. కానీ, ఊహించని ఘటనతో డచ్(నెదర్లాండ్స్) ప్రధాని ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేశారు. కాఫీ కప్పు ఒలకబోసిన ఆయన.. తానే స్వయంగా అక్కడ శుభ్రం చేసి నెటిజన్ల మన్ననలు అందుకుంటున్నారు. నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే ఓ చేతిలో ఫైళ్లతో.. మరో చేతిలో కాఫీ కప్పుతో పార్లమెంట్‌లోకి వెళ్తున్నారు. ఇంతలో సెక్యూరిటీ వద్ద ఉన్న మెషీన్ తగిలి ఆ కప్పు ఒలికిపోయింది. ఆ స్థానంలో వేరే వారు ఉంటే సిబ్బందితో శుభ్రపరిచేవారేమో. కానీ, రుట్టే మాత్రం మహిళా సిబ్బంది చేతిలోని తుడిచే కర్రను లాక్కుని సరదాగా ఆయనే శుభ్రం చేశారు. ఇంతలో అక్కడికి వచ్చిన క్లీనింగ్ స్టాఫ్ ఆయన నిలువరించే యత్నం చేసినప్పటికీ ఆయన వారి మాట వినలేదు. తాను చేసిన పొరపాటుకు.. తాను శుభ్రం చేయటం సరైందని ఆయన వారితో చెప్పటం విశేషం. దీంతో వారంతా ఆయన చుట్టూ చేరి పాట పాడుతూ ఆయన్ని ప్రొత్సహించారు. ఇక ఈ వీడియో వైరల్ అవ్వటం, లైకులు, షేర్లతో దూసుకుపోతుండగా.. కామెంట్లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. స్వచ్ఛ నెదర్లాండ్స్ అని, ఆ స్థానంలో మన నేతలు ఉంటే ఏం చేసేవారో అని ఒకరు... ఇప్పటి నుంచి భారతీయ నేతలు కూడా క్యూ కడతారేమోనని మరోకరు.. మార్క్ రుట్టేని చూసి మన నేతలు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఇంకొకరు... ఇలా అభిప్రాయపడుతున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియోను మీరూ చూడండి... -
ఓ చేతిలో ఫైళ్లతో.. మరో చేతిలో కాఫీ కప్పుతో ప్రధాని
-
సమష్టి పోరుతోనే ఉగ్ర నిర్మూలన
న్యూఢిల్లీ: ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా పోరాడాలని భారత్, నెదర్లాండ్స్ పిలుపునిచ్చాయి. ఉగ్రవాదుల ప్రాబల్యం, ఆర్థిక వనరులను దెబ్బతీయడానికి, సీమాంతర ఉగ్రవాద నియంత్రణకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. భారత పర్యటనకు వచ్చిన నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్ గురువారం ప్రధాని మోదీతో చర్చలు జరిపారు మతం, జాతి, తెగ, వర్గాలతో ఉగ్రవాదాన్ని ముడిపెట్టొద్దని ఇరువురు నేతలు ఉద్ఘాటించారు. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలు దక్షిణాసియాలో శాంతికి ముప్పుగా పరిణమించాయని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. అణు సరఫరా బృందం(ఎన్ఎస్జీ)లో భారత్ సభ్యత్వానికి నెదర్లాండ్స్ మద్దతిస్తుందని రూట్ తెలిపారు. మన బంధం మరింత బలపడాలి.. వాణిజ్యం, వ్యవసాయం, ఇంధన వనరులు తదితర రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, నెదర్లాండ్స్ నిర్ణయించాయి. ఇండియా–డచ్ సీఈవోల రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నాక మోదీ, రూట్ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ‘అంతర్జాతీయ సౌర కూటమిలో చేరాలని నెదర్లాండ్స్‌ను గతంలోనే ఆహ్వానించాను. గురువారం వారు అందులో సభ్య దేశంగా చేరారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను’ అని మోదీ అన్నారు. భారత్‌లో అత్యధికంగా విదేశీ పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో నెదర్లాండ్స్ మూడో స్థానానికి చేరిందని వెల్లడించారు. భారత్‌లో కల్పిస్తున్న కొత్త అవకాశాల పట్ల డచ్ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని నరేంద్ర మోదీ అన్నారు. రూట్ మాట్లాడుతూ..వాణిజ్యం, వ్యవసాయం, స్మార్ట్ సిటీస్, ఇంధన వనరుల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మెరుగైన అవకాశాలున్నాయని అన్నారు. ద్వైపాక్షిక భేటీ తరువాత విడుదలైన ఉమ్మడి ప్రకటనలో..పెట్టుబడులు, వాణిజ్య సంబంధాల అభివృద్ధిలో ప్రైవేట్ రంగ పాత్ర కీలకంగా మారిందని మోదీ, రూట్ పేర్కొన్నారు. ‘క్లీన్ గంగా’ ప్రాజెక్టుకు రూట్ కితాబు.. పవిత్ర గంగా నది ప్రక్షాళనకు ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమామీ గంగే పథకాన్ని రూట్ ప్రశంసించారు. నీటిని ఆర్థిక వనరుగానే పరిగణించకుండా, సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ పరంగానూ విలువ ఇవ్వాలని పేర్కొన్నారు. గంగా నది శుద్ధి కార్యక్రమంలో ఈ అంశా లన్నీ ఇమిడి ఉన్నాయని కితాబు ఇచ్చారు. కాగా, గురువారం రాత్రే రూట్ స్వదేశం బయల్దేరారు. 29 నుంచి మోదీ విదేశీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 29 నుంచి ఐదు రోజుల పాటు ఇండోనేసియా, సింగపూర్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరుదేశాలతో రక్షణ, భద్రతరంగానికి సంబంధించి పలు ఒప్పందాలు చేసుకుంటారు. మే 29 నుంచి 31 వరకూ మోదీ ఇండోనేసియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఇండోనేసియాతో రక్షణరంగంలో సహకారం కోసం ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు. అనంతరం జూన్ 1న సింగపూర్‌కు వెళ్లనున్న మోదీ ఆ దేశ ప్రధాని లీసెయిన్ లూంగ్‌తో పలు అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. అనంతరం 28 ఆసియా–పసిఫిక్ దేశాల రక్షణ మంత్రులు, ఆర్మీ చీఫ్‌లు పాల్గొనే షాంగ్రీ లా సదస్సులో మాట్లాడతారు. ఈ సదస్సులో ప్రసంగించనున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం గమనార్హం. ‘గ్రామస్వరాజ్’ సక్సెస్ ప్రధాని మోదీ ఉద్ఘాటన న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ‘గ్రామస్వరాజ్ అభియాన్’ కార్యక్రమం విజయవంతమైందని.. ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 14 (అంబేడ్కర్ జయంతి) మొదలుకుని మే 5 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించాం’ అని ఆయన ట్వీట్ చేశారు. పేదలకోసం ఉద్దేశించిన ఏడు ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ పథకాలను వివిధ బృందాలు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు వివరించాయన్నారు. ‘ఈ 21 రోజుల్లో 7.53 లక్షల మందికి ఉజ్వల కనెక్షన్లు, 5లక్షల ఇళ్లకు సౌభాగ్య పథకం ద్వారా విద్యుత్ వెలుగులం దించాం. 16,682 గ్రామాల్లో 25 లక్షల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేశాం. 1.65 లక్షల మంది∙చిన్నారులు, 42,762 మంది గర్భిణులకు మిషన్ ఇంద్ర ధనుష్‌లో భాగంగా టీకాలు వేశాం’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, స్థానిక సంస్థల భాగస్వామ్యం మరువలేనిదన్నారు. అందరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. -
‘మా బంధం ఇప్పటిది కాదు.. వందేళ్లపైనే..’
ఆమ్స్టర్డ్యామ్: దేశ ఆర్థికాభివృద్ధిలో నెదర్లాండ్ తమకు సహజమైన భాగస్వామి అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. నెదర్లాండ్ తమకు అతిపెద్ద వ్యాపార భాగస్వామి అని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఇప్పటికే చేసుకున్న ఒప్పందాల ప్రకారం వ్యాపారాన్ని ఇరు దేశాల మధ్య మరింత వేగంగా పరుగెత్తిస్తామని చెప్పారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇప్పటికే పోర్చుగల్, అమెరికా దేశాల్లో పర్యటించిన మోదీ అనంతరం నెదర్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ మోదీకి ఘనస్వాగతం లభించింది. నెదర్లాండ్ ప్రధాని మార్క్ రట్టే మోదీని సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్న తర్వాత సామాజిక భద్రత, వాటర్ కోపరేషన్, సంస్కృతి సహకారంవంటి అంశాలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం జరిగిన ఉమ్మడి మీడియా సమావేశంలో వాతవరణంలో మార్పు అంశంలో గతంలో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని ఇరువురు స్పష్టం చేశారు. పునర్వినియోగ శక్తులను అభివృద్ధి చేసుకునేందుకు పరస్పరం సహకారం చేసుకుంటామని అన్నారు. మిసైల్ టెక్నాలజీకి కంట్రోల్ రెజిమ్(ఎంటీసీఆర్)లో సభ్యత్వం కోరిన భారత్‌కు మద్దతిచ్చినందుకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ‘మీ మద్దతుతోనే ఎంటీసీఆర్‌లో సభ్యత్వం పొందాము. అందుకు ధన్యవాదాలు’అని మోదీ అన్నారు. గత ఏడాదే భారత్ ఎంటీసీఆర్‌లో పూర్తిస్థాయి సభ్యత్వాన్ని పొందిన విషయం తెలిసిందే. భారత్, నెదర్లాండ్ దేశాల మధ్య సంబంధాలు ఇప్పటివి కావని, ఎంతోకాలం నుంచి ఉన్నవని, చాలా బలమైనవని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం నెదర్లాండ్ ప్రధాని రట్టే మాట్లాడుతూ ‘భారత్ ప్రపంచశక్తిగా అవతరిస్తోంది. అటు రాజకీయంగా ఆర్థికంగా ఎదగడాన్ని స్వాగతిస్తున్నాం. సమన్యాయపాలనను, భద్రతను మేం కలిసి పంచుకుంటాం’ అని చెప్పారు. మోదీ ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన క్లీన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాను కొనియాడారు. భారత్ తన లక్ష్యాలు చేరుకునేందుకు తమ దేశం అన్ని రకాలుగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. -
ఊరటనిచ్చిన నెదర్లాండ్స్
ఎటుచూసినా మితవాదుల, జాతీయవాదుల జైత్రయాత్ర సాగుతున్న సమయంలో చిన్నదే కావొచ్చుగానీ... నెదర్లాండ్స్ పార్లమెంటుకు బుధవారం జరిగిన ఎన్నికల్లో ప్రధాని మార్క్ రుట్ నాయకత్వంలోని వీవీడీ పార్టీ సాధించిన విజయం యూరప్‌ను ఊపిరి పీల్చుకునేలా చేసింది. యూరప్‌లోని వాయువ్య భాగాన ఉన్న నెదర్లాండ్స్ జనాభా కోటీ 70 లక్షలు. యూరప్‌లో ఇప్పుడు చాలా దేశాల్లో వెల్లు వెత్తుతున్న అవాంఛనీయ ధోరణులన్నీ నెదర్లాండ్స్‌ను సైతం చుట్టుముట్టాయి. గత కొన్నేళ్లుగా అక్కడ ముస్లింలకు, వలసొచ్చినవారికి వ్యతిరేకంగా కార్యక్రమాలు ఉధృతమయ్యాయి. ఖురాన్‌ను నిషేధించాలని, మసీదులను మూసేయాలని అక్క డక్కడా ఆందోళనలు సాగాయి. వీటన్నిటి వెనకా గీర్ట్ వైల్డర్స్ నేతృత్వంలోని పీవీవీ పార్టీ ఉంది. వలసల వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ కుంగిపోతున్నదని, దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ముప్పు కలుగుతున్నదని ఆ పార్టీ నేత వైల్డర్స్ ఆరోపించారు. ఆయన ఉపన్యాస ధోరణి, సమస్యలకు ఆయన ప్రతిపాదించే పరిష్కారాలూ గమనిస్తున్నవారు వైల్డర్స్‌ను ‘నెదర్లాండ్స్ ట్రంప్’గా అభివర్ణించారు. జాత్యహంకార ధోరణులను రెచ్చగొట్టే ఆ ప్రసంగాలు సమాజంలో భయాందోళనలు కలిగిం చాయి. ముస్లింలు, శ్వేతేతర జాతీయులు తమ భద్రతపై కలవరపడ్డారు. నెద ర్లాండ్స్ యూరప్ యూనియన్(ఈయూ) నుంచి బయటకు రావాలని వైల్డర్స్ ఇచ్చిన పిలుపునకు స్పందన కూడా అధికంగానే ఉంది. ఈ ఎన్నికకు ముందు జరిపిన వివిధ సర్వేల్లో వైల్డర్స్ చాలా ముందంజలో ఉండటాన్ని గమనించి ప్రధాని మార్క్ రుట్ పార్టీ కూడా కంగారుపడింది. నిరుడు జూన్‌లో బ్రిటన్‌లో జరిగిన రిఫరెండంలో ఈయూ నుంచి తప్పుకోవాలన్న బ్రెగ్జిట్ వాదమే విజయం సాధించ డం... నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని డోనాల్డ్ ట్రంప్ గెల్చుకోవడంలాంటి పరిణామాలను చూసి నెదర్లాండ్స్ సైతం ఆ బాటలోనే పయనిస్తున్నదన్న భయాం దోళనలు అందరిలో వ్యాపించాయి. త్వరలో ఎన్నికలు జరగబోయే ఫ్రాన్స్, జర్మనీ ల్లోనూ ఈ మాదిరి భయాలే అలుముకున్నాయి. ప్రపంచాన్ని 2008లో చుట్టుముట్టిన ఆర్ధిక మాంద్యం నెదర్లాండ్స్‌ను కూడా తాకింది. ఉత్పత్తి మందగించి, ఉపాధి అవకాశాలు అంతంతమాత్రమై, వేతనాలు పడిపోయి, పింఛన్లు ఆగిపోయి అక్కడి పౌరులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితి క్రమేపీ సర్దుకోవడం ప్రారంభమైంది. వాస్తవానికి గత రెండేళ్లుగా అక్కడ ఆర్ధిక వ్యవస్థ కుదుటపడింది. నిరుద్యోగం 5.3 శాతానికి పడిపోయింది. వృద్ధి రేటు కూడా ఆశావహంగా ఉంది. ఈసారి మిగులు బడ్జెట్ కూడా రాబోతున్నదంటు న్నారు. ఆర్ధిక రంగంలో అది జర్మనీని దాటి ముందుకెళ్తున్నదని ఆర్ధిక నిపుణుల అంచనా. పరిస్థితి ఇంత అనుకూలంగా, ఆశావహంగా ఉన్నప్పుడు వైల్డర్స్లాంటి నాయకుడికి ఇంత జనాకర్షణ ఎక్కడినుంచి వచ్చింది? సర్వేల్లో ఆయన పార్టీయే ముందంజలో ఎలా ఉంది? ఈ అనుకూల వాతావరణం వెనక ప్రభుత్వం తీసు కున్న కఠిన చర్యలున్నాయి. పరిశ్రమల్లో రోబోల వాడకాన్ని క్రమేపీ పెంచే యోచన చేయడం, రిటైర్మెంట్ వయసును 67 సంవత్సరాలకు పెంచబోతుండటం, ప్రజా రోగ్య రక్షణ విధానాన్ని సవరించడం వంటివి పౌరుల్లో అనుమానాలను రేకెత్తించాయి. ఆర్ధిక మాంద్యం వల్ల కలిగిన క్లేశాలను ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్న తమపై మరోసారి సంక్షోభం విరుచుకుపడబోతున్నదన్న భయం వారికి ఏర్పడింది. రిటైర్మెంట్ వయసు పెంచితే ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయన్న బెంగ యువతను ఆవహించింది. కార్మికులు సైతం తమ పనుల్లో రోబోల ప్రవేశం ఖాయమని ఆందో ళనచెందారు. ఒకపక్క బ్రిటన్ ఈయూ నుంచి తప్పుకోవడం, అమెరికా ప్రపంచీ కరణ విధానాలను విడనాడే దిశగా అడుగులేస్తుండటం, తన పరిశ్రమలనూ, ఉత్ప త్తులనూ కాపాడుకునే చర్యలు ప్రారంభించడంవంటివి తమపై తీవ్ర ప్రభావం చూపుతాయని నెదర్లాండ్స్ పౌరులు విశ్వసించారు. ఈయూలో కొనసాగటం వల్ల కీడే తప్ప మేలు జరగదన్న అభిప్రాయం ఏర్పడింది. బ్రిటన్ దిగుమతుల్లో సింహ భాగం నెదర్లాండ్స్‌దే. అటు అమెరికాకు కూడా నెదర్లాండ్స్ నుంచి ఎగుమతులు విస్తారంగా ఉన్నాయి. ఆ రెండు దేశాలతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే స్థితి ఏర్పడటం వల్ల మరోసారి ఇబ్బందులు తప్పవన్నది భిన్న వర్గాల అభిప్రాయం. వీటన్నిటినీ వైల్డర్స్ బాగా సొమ్ము చేసుకోగలిగాడు. వలస విధానాలను కఠినం చేస్తే, ముస్లింల రాకను అడ్డుకుంటే ఈ పరిణామాల వల్ల కలిగే ప్రమాదాలను నివా రించవచ్చునని ఆయన ప్రచారం చేశాడు. తమ పార్టీకి అధికారం అప్పగిస్తే ఈయూ నుంచి బయటికొచ్చి, దేశానికి మేలు కలిగేలా స్వతంత్ర విధానాలను రూపొంది స్తామని ఆయన హామీ ఇచ్చాడు. నెదర్లాండ్స్ ఎన్నికల రంగంలో 28 పార్టీలున్నాయి. అసలు బ్యాలెట్ పత్రమే ఎంతో అయోమయం కలిగించేదిగా మారింది. అది కూడా వైల్డర్స్‌కు కలిసొచ్చే అవకాశం ఉన్నదని అందరూ భావించారు. పైగా ప్రధాని మార్క్ రుట్ వరసగా రెండు దఫాలనుంచి ప్రభుత్వానికి సారధ్యంవహిస్తున్నారు. పాలకపక్ష వ్యతిరేకత ఆయన్ను దెబ్బతీయవచ్చునని లెక్కలేశారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో 81 శాతం పోలింగ్ జరగటంతో అది ఎవరికి అనుకూలమో విశ్లేషకులు అంచనా వేయలేకపోయారు. చివరకు సీట్లు తగ్గినా వీవీడీయే పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఎప్పటిలా అది కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పదు. వైల్డర్స్ విజేత కాకపోవచ్చుగానీ ఆయన పార్టీ 2012 ఎన్నికలతో పోలిస్తే మెరుగుపడింది. వచ్చే మే నెలలో ఫ్రాన్స్ ఎన్నికలు, సెప్టెంబర్‌లో జర్మనీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ రెండుచోట్లా వలసలను, ముస్లింలను తీవ్రంగా వ్యతిరేకించే జాతీయవాదుల ప్రాబల్యం విస్తరిస్తోంది. ఈయూ నుంచి బయటకు రావాలన్న డిమాండు పెరుగుతోంది. నెదర్లాండ్స్ తాజా పరిణామాలు ఆ దేశాల్లోని మధ్యే వాద, ఉదారవాద పక్షాలకు పోరాట చేవనిచ్చాయి. అయితే వైల్డర్స్ నాటిన జాత్య హంకార జాడ్యం ఉదారవాద నెదర్లాండ్స్ సమాజాన్ని నిలువునా చీల్చింది. పర స్పర అవిశ్వాసాన్ని పెంచింది. దాన్ని చక్కదిద్దడానికి చాలా కాలం పడుతుంది.