ప్రముఖ బాలీవుడ్ నటి కామిని కౌశల్ (Kamini Kaushal ) (98) కన్నుమూశారు. దీంతో బాలీవుడ్‌లో ఒక శకం ముగిసింది అంటూ బాలీవుడ్ పెద్దలు ఆమె మరణంపై సంతాపం వెలిబుచ్చారు. బాలీవుడ్ స్వర్ణయుగం నాటి మిగిలిన చివరితారల్లో కామిని కౌశల్ ఒకరంటూ గుర్తు చేసుకున్నారు. ఈ కష్టసమయంలో తమ గోప్యతను గౌరవించాలని కామిని కౌశల్ కుటుంబం విజ్ఞప్తి చేసింది.
కామిని కౌశల్ 1927, ఫిబ్రవరి 24న జన్మించారు. 1946లో 'నీచా నగర్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. ఈ మూవీ మొదటి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్ర అవార్డును గెలుచుకుంది. పామ్ డి'ఓర్‌ను గెలుచుకున్న ఏకైక భారతీయ చిత్రంగా మిగిలిపోయింది. అంతేకాదు ఇదే చిత్రానికి కామిని కౌశల్ మాంట్రియల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును గెలుచుకున్నారు.

చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకుని, పాపులర్ నటిగా ఎదిగారు. 1946 -1963 వరకు అనేక చిత్రాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నారు. దో భాయ్ (1947), షహీద్ (1948), నదియా కే పార్ (1948), జిద్ది (1948), షబ్నం (1949), పరాస్ (1949), నమూన (1949), అర్జూ (1950), ఝంజర్ (1953), ఆబ్రూ (1956), బడే సర్కార్ (1957), జైలర్ (1958), గోదాన్ (1963) మొదలైనవి ఆమెకు పేరు తెచ్చిన గొప్ప చిత్రాలు. కొత్తవారితో పాటు, స్టార్ హీరోలైన రాజ్ కపూర్, దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్, అశోక్ కుమార్, కిషోర్ సాహు, సజ్జన్, శేఖర్, అభి భట్టాచార్య, సోహ్రాబ్ మోడీ, అజిత్, మురాద్ , రాజ్ కుమార్ వంటి వారందరితోనూ నటించారు. 70ల వరకు కూడా ఆమె నటనను కొనసాగించారు. దో రాస్తే (1969), ప్రేమ్ నగర్ (1974), మహా చోర్ (1976 అన్హోనీ (1973) చిత్రాలలో నటించి, యువ నటులు కూడా అసూయ పడేలా తన నైపుణ్యాన్ని చాటుకున్నారు. చివరిసారిగా 2022లో లాల్ సింగ్ చద్దా సినిమాలో కనిపించారు. కామిని కౌశల్.
పిల్లల కోసం కామిని కౌశల్
సినిమాలతో పాటు, కామిని కౌశల్ పిల్లల పత్రిక పరాగ్ కోసం అనేక కథలు రాశారు. 70ల చివరలో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీకి అధ్యక్షురాలిగా పనిచేశారు. ఖేల్ ఖిలోన్ సహా దూరదర్శన్‌లో పిల్లల కోసం అనేక టీవీ సీరియల్స్ కూడా చేశారు. తన బ్యానర్ గుడియా ఘర్ ప్రొడక్షన్స్ (1989 - 1991 వరకు) కింద చాంద్ సితారే, చాట్ పానీ , చందమామ వంటి తోలుబొమ్మ ఆధారిత టీవీ కార్యక్రమాలను నిర్వహించారు. ఆమె స్వయంగా తోలుబొమ్మలను తయారు చేసి, విభిన్న పాత్రలకు అనుగుణంగా తన గొంతుతో ప్రాణం పోశారు. ఒక నటిగా ఆమె సినిమా రంగం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోవడం మాత్రమే కాదు బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి డిజిటల్ యుగానికి భారతీయ సినిమా పరుగులు తీసిన పరిణాక్రమం నుంచి కూడా నిష్క్రమించడం. అయితే భారతీయ సినిమాలో ఆమె పేరు ఎప్పటికీ శాశ్వతమే అంటూ పలువురు కామిని కౌశల్ అస్తమయంపై నివాళులర్పించారు.


