న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని ఒకవైపు భారీ పొగమంచు కమ్మేయగా, మరోవైపు వణికించే చలి అందరినీ విలవిలలాడేలా చేస్తోంది. ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున నగరం మొత్తం దట్టమైన పొగమంచు ఆవరించింది. ఫలితంగా జనజీవనం తీవ్రంగా అతలాకుతలమవుతోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలకు శీతల గాలుల హెచ్చరికను జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు.
#WATCH | Delhi | Visibility in the national capital is affected as a layer of dense fog engulfs the city.
(Visuals from Dwarka Expressway) pic.twitter.com/EzuKlWW0wK— ANI (@ANI) December 30, 2025
ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత (Visibility) భారీగా పడిపోయింది. దీంతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)లో సుమారు 130కి పైగా విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే శాఖ కూడా సుమారు 100కి పైగా రైళ్లు పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని పాలం, సఫ్దర్‌జంగ్ తదితర ప్రాంతాల్లో దృశ్యమానత కేవలం 50 మీటర్లకు పడిపోయింది.
ఒకవైపు ప్రమాదకర స్థాయికి చేరుకున్న కాలుష్యం, మరోవైపు విపరీతమైన చలి, ఇంకోవైపు దట్టమైన పొగమంచుతో ఢిల్లీలో వాయు నాణ్యత (ఏక్యూఐ) తీవ్రస్థాయికి చేరింది. పొగమంచు కారణంగా వాహనదారులు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వృద్ధులు, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నవారు బయటకు రావద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ప్రయాణికులు విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్‌కు బయలుదేరే ముందు తమ ప్రయాణ సమయాల అప్‌డేట్‌లను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఐఎమ్‌డి అంచనా ప్రకారం రానున్న రెండు మూడు రోజుల పాటు ఈ పొగమంచు ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. వాహనదారులు ఫాగ్ లైట్లను ఉపయోగించాలని, అతివేగాన్ని తగ్గించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bangladesh: మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత


