చేతిలో కుమారుని చిత్రపటంతో రోదిస్తున్న ఇనా మాకెన్
ఢిల్లీలో టీనేజర్ నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌తో చనిపోయిన 23 ఏళ్ల సాహిల్
రీల్స్ చేస్తూ కారు నడిపిన టీనేజర్
వెలుగులోకి ఫిబ్రవరి 3 నాటి వీడియో
న్యూఢిల్లీ: ఫిబ్రవరి మూడో తేదీన 17 ఏళ్ల టీనేజర్ నిర్లక్షపూరితంగా కారు నడిపిన ఉదంతంలో 23 ఏళ్ల యువకుడు సాహిల్ ధనేశ్ర ప్రాణాలు కోల్పోయిన ఘటనలో తాజాగా ‘రీల్స్’కోణం బహిర్గతమైంది. టీనేజర్ వాహనం నడిపేటప్పుడు పక్కనే అతని సోదరి కూర్చుని స్మార్ట్‌ఫోన్‌లో రీల్స్ చిత్రీకరించింది. సంబంధిత వీడియో తాజాగా బహిర్గతమైంది. సంపన్నుల పిల్లలు సరదాగా చేసే ‘రీల్స్’కు తన ఒక్కగానొక్క కుమారుడు బలయ్యాడని మృతుని తల్లి ఇనా మాకెన్ కన్నీటిపర్యంతయ్యారు. ‘‘కనీసం డ్రైవింగ్ లైసెన్స్‌లోని 17 ఏళ్ల బాలుడు ఎస్‌యూవీ నడుపుతూ రీల్స్ చేస్తూ మా అబ్బాయిని ఢీకొట్టాడు.
కారుతో ఢీకొట్టాక కనీసం బ్రేకులు కూడా వేయలేదు’’అని ఆమె అన్నారు. ‘‘మాకున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు మా అబ్బాయి ఎంతో కష్టపడుతుంటాడు. చిన్న చిన్న పనులు కూడా చేస్తుంటాడు. స్పోర్ట్స్‌లో ఎన్నో మెడల్స్ తెచ్చుకున్నాడు. నైనిటాల్‌లో సెయింట్ జోసెఫ్ కాలేజీలో బీబీఏ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నాడు. మాంచెస్టర్‌లో లగ్జరీ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేసేందుకు త్వరలో బ్రిటన్‌కు వెళ్లాల్సినవాడు ఇలా ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు’’అని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. టీనేజర్‌కు పదో తరగతి బోర్డ్ పరీక్షలు రాయల్సి ఉన్నందున అతనికి జువెనైల్ జస్టిస్ బోర్డ్ మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది.
ఇప్పటికే ఒంటరిగా జీవిస్తున్న తల్లి జీవితం కుమారుడి మరణంతో ఏకాకిగా మారిందని పొరుగింటి వాళ్లు చెప్పారు. మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి కాలేజ్ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో సమీపంలో కారును పార్క్‌చేసిన డ్రైవర్ అజిత్ సింగ్ జీవితం సైతం కష్టాల కడలిలో పడింది. టీనేజర్ ఆ యువకుడి బైక్‌ను ఢీకొట్టాక నేరుగా వచ్చి అజిత్‌కు చెందిన క్యాబ్‌నూ ఢీకొట్టాడు. దీంతో అజిత్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిపాలయ్యాడు. ‘‘కాళ్లు, చేతులు, తల, వెన్నుపూసకు గాయాలయ్యాయి. మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలి వైద్యులు సూచించారు.
తర్వాత ఏమాత్రం పనిచేయగలనో నాకే అర్థంకావట్లేదు. నెలకు పాతిక వేలరూపాయల్లోపే సంపాదిస్తా. ద్వారకా సెక్టార్ 19 సమీప గ్రామంలో నివసిస్తున్నా. నా ఇంట్లో సంపాదించేది నేనొక్కడినే. డ్రైవింగ్ జీవనోపాధి పోయక ఇకపై ఎలా బతకాలి?. ధనికులకు ఇలాంటి ప్రమాదంతో పోయేదేం ఉండదు. కానీ నాలాంటి పేదల పరిస్థితి ఏంటి?’’అని అజిత్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాడు.


