ఉవ్వెత్తున.. | Kilauea volcano erupts in Hawaii | Sakshi
Sakshi News home page

ఉవ్వెత్తున..

Feb 18 2026 5:17 AM | Updated on Feb 18 2026 5:17 AM

Kilauea volcano erupts in Hawaii

హవాయీలో బద్దలైన అగ్నిపర్వతం

1,300 అడుగులకు పైగా ఎగసిపడ్డ లావా 

ఆకట్టుకుంటున్న కళ్లు చెదిరే రాత్రి దృశ్యాలు

అత్యంత భారీ పరిమాణంలో నిప్పు రవ్వలు వేలాది అడుగుల ఎత్తుకు ఎగసిపడుతుంటే ఎలా ఉంటుంది? ఇదుగో, అచ్చం ఇలాగే ఉంటుంది! హవాయీ దీవుల్లో కిలవెయా అగ్నిపర్వతం బద్దలైంది. అందులోంచి లావా ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతోంది. దాని తాలూకు రెండు పాయలు సోమవారం రాత్రి ఫౌంటేన్‌ మాదిరిగా పైపైకి ఎగజిమ్మాయి. 

ఒకటి 1,300 అడుగులు, మరొకటి 1,000 అడుగుల చొప్పున పైకి ఎగశాయి. ఆకాశంలో ఎర్రని కాంతులతో చూపరులను కట్టిపడేశాయి. వాటి తాలూకు బూడిదైతే ఏకంగా 35 వేల అడుగుల ఎత్తు దాకా చేరింది! ఈ దృశ్యాలను లక్షలాది మంది ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించారు. హవాయీ నేషనల్‌ పార్కులోని కిలవెయా ప్రపంచంలో అత్యంత చురుగ్గా ఉన్న అగ్నిపర్వతాల్లో ఒకటి. దాని అడుగున భారీ పగుళ్లున్న కారణంగా మాగ్మా ప్రవాహాలు తరచూ తేలిగ్గా పైకి ఎగదన్నుతూ ఉంటాయి. దాంతో అది పదేపదే బద్దలవుతూ, భారీగా లావాను వెదజల్లుతూ వీక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది.

ముఖ్యంగా గత డిసెంబర్‌ 23 నుంచీ ఇప్పటిదాకా కిలవెయా పదేపదే బద్దవుతూ, కొన్ని గంటల వ్యవధిలోనే శాంతిస్తూ వస్తోంది. ఈసారి అది 1.5 కోట్ల క్యూబిక్‌ అడుగుల మేరకు లావాను వెదజల్లి ఉంటుందని అంచనా! అది ఏకంగా 11 వేల ఒలింపిక్‌ సైజు స్విమ్మింగ్‌పూల్స్‌ను నింపేందుకు సరిపోతుందట!! ఎప్పట్లాగే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ప్రాణ, ఆస్తినష్టం వంటివేవీ సంభవించలేదు. మూడు వారాల తర్వాత కిలవెయా మరోసారి బద్దలవుతుందని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement