
అత్యంత ఓర్పు నేర్పులతో మానసిక, శారీరక సామర్థ్యాలను ఉక్కు సంకల్పంతో పరిరక్షించుకుంటూ ఏదైనా సాధించగలం అని నిరూపిస్తోంది బొమ్మినేని సంజనారెడ్డి. ఐరన్ మ్యాన్ ప్రపంచ ఛాంపియన్ షిప్‌కు అర్హత సాధించిన ఈ హైదరాబాద్ వాసి ‘సంకల్పం గట్టిదైతే ఏదైనా సాధ్యమే!’ అంటున్నారు.
ఈ ఏడాది అక్టోబర్‌లో హవాయిలోని కోనాలో జరగనున్న ప్రతిష్టాత్మక ఐరన్‌మ్యాన్ ప్రపంచ ఛాంపియన్ షిప్‌కు అర్హత సాధించారు బొమ్మినేని సంజనారెడ్డి. 18–24 ఏళ్ల విభాగంలో ఆమె ఈ స్థానాన్ని సాధించారు. గత జూన్‌లో ఆస్ట్రేలియాలో జరిగిన అల్ట్రా–ఎండ్యూరెన్స్ ట్రయాథ్లాన్‌ను 15 గంటల 22 నిమిషాల 13 సెకన్లలో పూర్తి చేశారు.
లండన్‌లో అర్బన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్‌లో ఎంఎసీ చేస్తున్న సంజన ప్రస్తుతం హైదరాబాద్‌లోనే శిక్షణ తీసుకుంటున్నారు. ఐరన్‌మ్యాన్‌లో తన అడుగు ఎలా మొదలయ్యిందో వివరించారు.
కఠినమైన శిక్షణ
‘‘స్కూల్ టైమ్‌లో నేనూ మా చెల్లెలు స్విమ్మింగ్ క్లాసులకు వెళ్లేవాళ్లం. స్విమ్మింగ్‌లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. డిగ్రీ చేయడానికి యూకే వెళ్లాను. థర్డ్ ఇయర్‌లో ఐరన్‌మ్యాన్ గురించి తెలిసి, శిక్షణ తీసుకున్నాను. మాస్టర్స్ కూడా యుకెలోనే. శిక్షణ తీసుకుంటూ గత జూన్‌లో ఆస్ట్రేలియాలోని కైర్న్స్‌లో జరిగిన ఐరన్‌మ్యాన్‌లో పాల్గొన్నాను. సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ ఈ మూడూ నిర్ణీత టైమ్‌లో పూర్తి చేయాలి.
వరల్డ్ ఐరన్ మ్యాన్ 1978లో ఆరంభం అయింది. అయితే, ఇప్పటివరకు మన దేశం నుంచి నా ఏజ్ క్యాటగిరీలో ఎంపిక అయిన వారిలో నేనే మొదటి స్థానంలో ఉన్నాను. మొదట వారానికి 20 గంటలు, రోజూ 3–4 గంటలు ట్రైనింగ్ ఉంటుంది. రేస్ టైమ్ దగ్గర అవుతున్న కొద్దీ ట్రైనింగ్ సమయం పెరుగుతుంది. యూకేకి చెందిన కోచ్ ద్వారా ఆన్‌లైన్‌లో సూచనలు తీసుకుంటూ రోజుకు ఐదు నుండి ఆరు గంటలు శిక్షణ తీసుకుంటున్నాను.
తప్పుకోవాలనుకున్న క్షణాలూ తప్పలేదు!
మొదట్లో కఠిన సాధన వల్ల రేసు నుండి తప్పుకోవాలనిపించిన క్షణాలు చాలా ఉన్నాయి. కానీ లక్ష్యం ఐరన్ మ్యాన్ ను పూర్తి చేయడం మాత్రమే కాదు, ప్రారంభించిన దాన్ని ఎలాగైనా పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకే అడుగు వేశాను. ఈ అడుగు మరికొందరికి ప్రేరణగా మారాలి అనుకున్నాను. సౌకర్యమైన జీవనంలో ఉంటే మన సామర్థ్యాలు ఏవీ తెలియవు. ఈ రోజుల్లో దాదాపు అందరం చాలా సౌకర్యాలకు అలవాటుపడిపోతున్నాం. అది ఓవర్ అవుతుంది కూడా.
దీనివల్ల మన మీద మనకే కాదు, ఎదుటివారి మీద కూడా గౌరవం రాదు. మనలో ఎంతటి శక్తి ఉందో గుర్తించాలి. ఆ శక్తిని వెలికి తీయడానికి నిరంతరం ప్రయత్నించాలి. అప్పుడే మనమేంటి.. అన్నది తెలుస్తుంది. ఒకసారి మనమా శక్తిని గ్రహించగలిగామంటే మనపై మనకే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. మహిళగా అది చాలా ముఖ్యం. నేనేం సాధించాలో తెలుసుకునే బ్రేకింగ్ పాయింట్‌కు చేరుకోవాలనుకున్నాను. చాలావరకు మన చుట్టూ ఉన్నవారే తొక్కేయడానికే చూస్తుంటారు. వాటిని అడ్డుకుంటూనే నాలో ఆత్మవిశ్వాసం, సాధికారతను గుర్తించాను.
వ్యాపారంలోనూ రాణించాలని..
మహిళగా ఈ రేస్‌లో పాల్గొనడానికి పీరియడ్స్ టైమ్ అసౌకర్యంగా ఉంటుంది. కొంతమందికి చాలా నొప్పి, క్రాంప్స్ వస్తాయని విన్నాను. నాకు అలా ఏమీ కాలేదు. ఆస్ట్రేలియాలో జరిగిన రేస్‌లో పీరియడ్స్ టైమ్‌లోనే పాల్గొన్నాను. ఏమీ ఇబ్బంది అనిపించలేదు. మానసిక, శారీరక ప్రయోజనాలు క్రీడల్లోనే సాధించగలమని తెలుసుకున్నాను. స్పోర్ట్స్‌లో మనం రొటీన్ ఫుడ్ తీసుకుంటే ఇబ్బంది పడతాం.
ఎనర్జీ బేస్డ్ సప్లిమెంట్స్ తప్పనిసరి అవసరం. దీంతో ఇండియాలో స్పోర్ట్స్ సప్లిమెంట్ బిజినెస్ రంగంలో రాణించాలని ఆలోచన కలిగింది. అమ్మానాన్నలు వెంకట్‌రెడ్డి, స్వప్న ఇద్దరూ వ్యాపార రంగంలోనే ఉన్నారు. కూతుళ్లమైనా మా ఆలోచనలను పాజిటివ్‌గా తీసుకుంటారు. నా చిన్నప్పటి నుంచి స్కేటింగ్, టెన్నిస్, తైక్వాండ్, భరతనాట్యం... సాధన చేస్తూ ఉన్నాను. వీటితో పాటు చేసిన స్విమ్మింగ్ ఐరన్‌మ్యాన్ వరకు తీసుకెళ్లింది. ఈ విషయంలో అమ్మ నన్ను చాలా ఫుష్ చేశారు.
ఈ రేసులో పాల్గొనే అమ్మాయిలు 20 శాతం వరకే ఉన్నారు. ఇండియాలో ఆరేడేళ్లుగా హాఫ్ ఐరన్‌మ్యాన్ జరుగుతోంది. గోవాలో జరిగే ఈ ఈవెంట్‌లో పాల్గొనేవారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. మన దేశంలో ఫుల్ ఐరన్‌మ్యాన్ వస్తే చాలా మంది అమ్మాయిలు ఈ రేసులో పాల్గొని తమని తాము నిరూపించుకునే అవకాశం ఉంది’’ అని తెలిపారు సంజన.
– నిర్మలారెడ్డి