ఐశ్వర్య ప్రతాప్ సింగ్ ఖాతాలోనూ రజతం
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల జోరు
కైరో (ఈజిప్ట్): ఏకాగ్రత కోల్పోకుండా లక్ష్యంపైనే గురి పెడుతూ... ప్రపంచ రైఫిల్, పిస్టల్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు తమ పతకాల వేట కొనసాగిస్తున్నారు. పోటీల నాలుగో రోజు భారత్ ఖాతాలో రెండు రజత పతకాలు చేరాయి. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ రజతం నెగ్గగా... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఇషా సింగ్–సామ్రాట్ రాణా జోడీ రజతం సొంతం చేసుకుంది.
62 జోడీలు పోటీపడ్డ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫయింగ్‌లో ఇషా సింగ్ (తెలంగాణ)–సామ్రాట్ రాణా (హరియాణా) ద్వయం 586 పాయింట్లు... కియాన్‌జున్ యావో–హు కాయ్ (చైనా) జంట 583 పాయింట్లు స్కోరు చేసి టాప్–2లో నిలిచి ఫైనల్లోకి చేరుకున్నాయి.
ఫైనల్లో ఇషా–సామ్రాట్ జోడీ 10–16 స్కోరుతో కియాన్ జున్–హు కాయ్ ద్వయం చేతిలో ఓడిపోయి రజత పతకంతో సంతృప్తి పడింది. ఈ మెగా ఈవెంట్‌లో సామ్రాట్‌కిది మూడో పతకం కావడం విశేషం. సోమవారం సామ్రాట్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించాడు.
చివరి షాట్‌లో తడబడి...
గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన ఐశ్వర్య ప్రతాప్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం మెరిశాడు. 66 మంది పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో ప్రతాప్ 600 పాయింట్లకుగాను 597 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డును సమం చేశాడు. అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందాడు. భారత్‌కే చెందిన మరో షూటర్ నీరజ్ కుమార్ 592 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు.
ఫైనల్లో ప్రతాప్ 466.9 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెల్చుకున్నాడు. చివరి షాట్ వరకు ఐశ్వర్య త్రాప్ 457.1 పాయింట్లతో తొలి స్థానంలో, లియు యుకున్ (చైనా) 457 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆఖరి షాట్‌లో ప్రతాప్ 9.8 పాయింట్లు సాధించగా ... లియు యుకున్ 10.1 పాయింట్లు స్కోరు చేసి ఓవరాల్‌గా 467.1 స్కోరుతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
నీరజ్ కుమార్ 432.6 పాయింట్లతో ఐదో స్థానంలో నిలువగా... రొమైన్ (ఫ్రాన్స్; 454.8 పాయింట్లు) కాంస్యాన్ని సాధించాడు. నాలుగో రోజు పోటీలు ముగిశాక భారత్ 3 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి 11 పతకాలతో రెండో స్థానంలో ఉంది. చైనా 15 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి 15 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.


