ఐఎస్‌ఎస్‌ఎఫ్ ‘టాప్–5’లో భారత షూటర్ ఘనత
న్యూఢిల్లీ: భారత షూటర్ సామ్రాట్ రాణా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కనబరిచిన స్వర్ణ పతక ప్రదర్శనకు అరుదైన గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) విడుదల చేసిన ఈ ఏడాది మేటి ఐదు ప్రదర్శనల్లో మన షూటర్ ఘనత కూడా నిలిచింది. హరియాణాకు చెందిన 20 ఏళ్ల యువ షూటర్ సామ్రాట్ గత నెల కైరోలో జరిగిన ఈవెంట్‌లో బంగారు పతకం సాధించాడు.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో అసాధారణ గురితో ‘స్వర్ణ’ధరికి చేరాడు. తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం, సొంత వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన చిన్నపాటి షూటింగ్ కేంద్రమే సామ్రాట్‌ను ప్రపంచ చాంపియన్‌గా మలిచింది. ఈ సందర్భంగా ఐఎస్‌ఎస్‌ఎఫ్ సామ్రాట్ పసిడి పతక ప్రదర్శనను ఆకాశానికెత్తింది. అద్భుతమని కితాబిచ్చి ంది.
అక్కడ అతనేం చేశాడంటే...
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్‌కు సామ్రాట్ అర్హత సాధించాడు. కానీ అక్కడ ప్రపంచ నంబర్‌వన్ హు కై (చైనా) ఉన్నాడు. పైగా ఈ ఏడాది అతను ఎవరి చేతిలోనూ ఓడలేదు. అలాంటి అజేయ షూటర్ స్వర్ణం లక్ష్యంగా బుల్లెట్‌లను ఫైర్ చేశాడు. ఇంకో నాలుగైదు షాట్లే మిగిలున్నాయి.
చైనా షూటర్ స్పష్టమైన అధిక్యంలో ఉన్నాడు. ఇలాంటి దశలో ఒత్తిడి లేకుండా సామ్రాట్ తన కంటికి లక్ష్యబిందువు తప్ప ఇంకేది కనపడనీయలేదు. ట్రిగ్గర్ నొక్కి కచ్చి తత్వంతో కూడిన రెండు వరుస షాట్లు (10.2 పాయింట్లు, 10.6 పాయింట్లు) హరియాణా షూటర్‌కు అసాధారణ విజయాన్ని కట్టబెట్టాయి.


