హాంగ్జౌ: వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గురువారం జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–11, 16–21, 21–11తో ఫజర్ అల్ఫియాన్–షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) జంటను ఓడించింది.
గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన భారత జోడీ రెండో గేమ్‌లో తడబడింది. నిర్ణాయక మూడో గేమ్‌లో మళ్లీ లయలోకి వచ్చి విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్‌లో లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) జంట 21–14, 21–18తో ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జోడీపై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో ఆరోన్ చియా–సో వుయ్ యిక్‌లతో సాత్విక్–చిరాగ్; లియాంగ్–వాంగ్ చాంగ్ (చైనా)లతో అల్ఫియాన్–ఫిక్రి తలపడతారు.


