
డెన్మార్క్ ఓపెన్ బరిలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ
ఈ సీజన్‌లో భారత ద్వయం ఖాతాలో చేరని టైటిల్
ఒడెన్స్: ఈ ఏడాది అందని ద్రాక్షగా ఊరిస్తున్న డబుల్స్ టైటిల్ కోసం భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో ప్రయత్నం చేయనుంది. నేడు మొదలయ్యే డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం బరిలోకి దిగనుంది. ఆరో సీడ్‌గా పోటీపడుతున్న సాత్విక్–చిరాగ్ జోడీ తొలి రౌండ్‌లో క్రిస్టోఫర్ గ్రిమ్లే–మాథ్యూ గ్రిమ్లే (స్కాట్లాండ్) ద్వయంతో తలపడుతుంది.
పురుషుల డబుల్స్‌లో భారత్ నుంచి మరో జంట పృథ్వీ కృష్ణమూర్తి రాయ్–సాయిప్రతీక్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇటీవల సాత్విక్–చిరాగ్ ద్వయం వరుసగా చైనా ఓపెన్, హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీల్లో ఫైనల్ చేరి రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో, సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో, ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో, మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సాత్విక్–చిరాగ్ సెమీఫైనల్లో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సాత్విక్–చిరాగ్ జోడీ డెన్మార్క్ ఓపెన్‌లోనూ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది.
పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి బరిలో ఉన్నారు. ప్రపంచ 28వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి తొలి రౌండ్‌లో టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో... ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ తొలి రౌండ్‌లో ఎన్‌హట్ నుగుయెన్ (ఐర్లాండ్)తో ఆడతారు. మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి కేవలం అన్‌మోల్ ఖరబ్ మాత్రమే పోటీపడుతోంది.
గతవారం ఆర్క్‌టిక్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన అన్‌మోల్ తొలి రౌండ్‌లో ఏడో సీడ్ పుత్రి కుసుమ వర్దాని (ఇండోనేసియా)తో తలపడనుంది. మహిళల డబుల్స్‌లో రుతపర్ణ–శ్వేతాపర్ణ పాండా... సెల్వం కవిప్రియ–సిమ్రన్... మిక్స్‌డ్ డబుల్స్‌లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల... లక్షిత–మోహిత్ జగ్లాన్ జోడీలు పోటీపడతాయి.
3 డెన్మార్క్ ఓపెన్ టోర్నీ చరిత్రలో భారత్ నుంచి ముగ్గురు క్రీడాకారులు టైటిల్స్ సాధించారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రకాశ్ పడుకోన్ (1980లో), కిడాంబి శ్రీకాంత్ (2017లో)... మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వల్ (2012లో) చాంపియన్స్‌గా నిలిచారు.