వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో సెమీస్ చేరిక
అజేయంగా, గ్రూప్ టాపర్‌గా... నాకౌట్‌కు
ఈ ఘనతకెక్కిన తొలి భారత ద్వయం
కొన్నేళ్లపాటు భారత బ్యాడ్మింటన్‌లో సింగిల్స్‌లో షట్లర్లు దేశ ప్రతిష్ట పెంచారు. ‘చైనా’ గోడకు ఎదురునిలిచి సంచలన విజయాలు, ఒలింపిక్ పతకాలు, ప్రపంచ చాంపియన్‌షిప్ విజయాలు, ప్రపంచనంబర్‌వన్ ర్యాంకింగ్స్‌తో షట్లర్లు ఘనతకెక్కారు. అయితే డబుల్స్‌లో మాత్రం ఆ స్థాయికి చేరలేదనే బెంగ ఉండేది. కానీ ఇప్పుడది గతం! వర్తమానంలో సాత్విక్–చిరాగ్ జోడీ చెలరేగిపోతోంది. డబుల్స్ భవిష్యత్తును బంగారం చేయబోతోంది.
హాంగ్జౌ: భారత డబుల్స్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు కొత్త చరిత్ర లిఖించారు. ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. తద్వారా ఈ మెగా టోర్నీలో సెమీస్ చేరిన తొలి భారత పురుషుల ద్వయంగా సాత్విక్–చిరాగ్ ఘనతకెక్కింది. ఈ టోర్నీలో ఈ జోడీ ఎదురేలేకుండా దూసుకెళుతోంది. ప్రపంచ అత్యుత్తమ, టాప్–8 జంటలే బరిలోకి దిగే ఈ మేటి టోర్నీలో గ్రూప్ ‘బి’లో ఉన్న సాత్విక్–చిరాగ్ జోడీ అజేయంగా నాకౌట్ దశకు అర్హత సంపాదించింది.
చైనా గడ్డపై ప్రత్యర్థి జంటలను గడగడలాడిస్తోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ వరుసగా గెలిచి ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. శుక్రవారం జరిగిన ఈ గ్రూపులోని ఆఖరి మూడో మ్యాచ్‌లో మూడో సీడ్ సాత్విక్–చిరాగ్ జోడీ 17–21, 21–18, 21–15తో మలేసియాకు చెందిన రెండో సీడ్ అరోన్ చియా–సో వుయ్ యిక్‌లపై చెమటోడ్చి నెగ్గింది. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేతలైన చియా– సో వుయ్‌లకు అసాధారణ పోరాటంతో చెక్‌పెట్టింది.
ముఖాముఖీ పోటీల్లో 5–11తో వెనుకబడి వున్నప్పటికీ శుక్రవారం మాత్రం భారత జోడీ ప్రదర్శన మరో స్థాయిలో నిలిపింది. మింగుడు పడని ప్రత్యర్థి ద్వయం చేతిలో తొలి గేమ్‌ను కోల్పోయిన భారత జోడీ ఏమాత్రం నిరాశపడకుండా తదుపరి గేముల్లో పట్టుదల కనబరిచింది.
పాయింట్ పాయింట్‌కు చెమటోడ్చి రెండో గేమ్‌ను వశం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. ఇక నిర్ణాయక మూడో గేమ్‌లో అయిన చిరాగ్–సాత్విక్‌ల ఆటతీరుకు మలేసియన్ జోడీ తలొగ్గకతప్పలేదు. నేడు జరిగే సెమీఫైనల్లో భారత ద్వయం చైనాకు చెందిన లియాంగ్ వి కెంగ్–వాంగ్ చంగ్ జంటను ఢీకొట్టనుంది.


