టాప్ సీడ్ ఉన్నతిపై గెలుపుతో సెమీస్‌లోకి
సాక్షి, విజయవాడ: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తమరి సూర్య చరిష్మా సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సూర్య చరిష్మా 21–12, 21–15తో టాప్ సీడ్, ప్రపంచ 23వ ర్యాంకర్ ఉన్నతి హుడా (హరియాణా)ను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆమె తొలి గేమ్‌లో ఒకసారి వరుసగా నాలుగు పాయింట్లు, మరోసారి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
రెండో గేమ్‌లో స్కోరు 10–8 వద్ద సూర్య చరిష్మా ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు సాధించి 15–8తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న ఆంధ్ర షట్లర్ విజయాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్ చేరే క్రమంలో సూర్య చరిష్మా తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో రక్షిత శ్రీ (తమిళనాడు)తో ఆమె ఆడుతుంది.
ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో రక్షిత శ్రీ 16–21, 21–14, 21–18తో తన్వీ శర్మ (పంజాబ్)పై, తన్వీ పత్రి (ఒడిశా) 21–16, 12–21, 22–20తో ఆకర్షి కశ్యప్ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)పై, శ్రుతి ముందాడ (మహారాష్ట్ర) 22–20, 21–12తో రెండో సీడ్ అనుపమ (ఢిల్లీ)పై గెలిచారు.
తరుణ్ జోరు
పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్, రెండో సీడ్ తరుణ్ మన్నేపల్లి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మన్‌రాజ్ సింగ్ (హరియాణా)తో 42 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 43వ ర్యాంకర్ తరుణ్ 21–13, 22–20తో గెలుపొందాడు. నేడు జరిగే సెమీఫైనల్లో భరత్ రాఘవ్ (హరియాణా)తో తరుణ్ ఆడతాడు.
ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ కిరణ్ జార్జి (కేరళ) 21–18, 21–18తో రౌనక్ చౌహాన్ (ఛత్తీస్‌గఢ్)పై, రితి్వక్ సంజీవి (తమిళనాడు) 21–13, 22–20తో సతీశ్ కుమార్ కరుణాకరన్ (తమిళనాడు)పై, భరత్ రాఘవ్ 21–17, 21–13తో జిన్‌పాల్ సోనా (ఢిల్లీ)పై గెలిచారు. మహిళల డబుల్స్‌లో కలగోట్ల వెన్నెల (తెలంగాణ)–రేíÙక (తమిళనాడు) జోడీ... మిక్స్‌డ్ డబుల్స్‌లో సాతి్వక్ రెడ్డి (తెలంగాణ)–రాధిక శర్మ (పంజాబ్) జంట సెమీఫైనల్లోకి ప్రవేశించాయి.


