గంటల తరబడి వాదనలకు పుల్‌స్టాప్
కోర్టు సమయం ఆదా, వేగవంతమైన న్యాయమే లక్ష్యం
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదేశాలతో సర్క్యులర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. కోర్టుల్లో కేసుల విచారణ సమయంలో న్యాయవాదులు గంటల తరబడి వాదనలు వినిపించే సంప్రదాయానికి స్వస్తి పలకనుంది. కోర్టు విలువైన సమయాన్ని ఆదా చేయడంతో పాటు, సామాన్యుడికి సత్వర న్యాయం అందించే దిశగా సుప్రీంకోర్టు సరికొత్త విధానాన్ని (ఎస్‌ఓపీ) అమల్లోకి తెచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదేశాల మేరకు కీలక సర్క్యులర్ జారీ అయింది. దీని ప్రకారం.. ఇకపై న్యాయవాదులు తమ వాదనలను నిర్ణీత సమయంలోపే ముగించాల్సి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక వల్ల రోజుకు ఎక్కువ కేసులను విచారించే వీలుంటుందని, తద్వారా పెండింగ్ భారం తగ్గి సత్వర న్యాయం సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు భావిస్తోంది. కొత్త నిబంధనలు ఇవే..
1. ముందుగానే టైం చెప్పాలి:
కేసు విచారణకు హాజరయ్యే సీనియర్ న్యాయవాదులు తాము వాదనలు వినిపించడానికి ఎంత సమయం తీసుకుంటారో ముందే స్పష్టం చేయాలి. విచారణ తేదీకి కనీసం ఒక రోజు ముందుగా సుప్రీంకోర్టు ఆన్‌లైన్ అప్పియరెన్స్ పోర్టల్ ద్వారా ఈ వివరాలను నమోదు చేయాలి.
2. ఐదు పేజీల నోట్స్ తప్పనిసరి:
కేవలం మౌఖిక వాదనలే కాకుండా.. విచారణకు మూడు రోజుల ముందే న్యాయవాదులు తమ వాదనలకు సంబంధించిన సంక్షిప్త లిఖితపూర్వక నోట్స్ సమర్పించాలి. ఇది ఐదు పేజీలకు మించకూడదు. అడ్వకేట్ ఆన్ రికార్డ్ ద్వారా గానీ, నోడల్ కౌన్సిల్ ద్వారా గానీ వీటిని ఫైల్ చేయాలి. అలాగే ప్రతివాదులకు కూడా ఈ కాపీని అందజేయాలి.
3. గడువులోపే ముగించాలి:
తాము ముందుగా నిర్ణయించుకున్న లేదా కోర్టు కేటాయించిన సమయంలోపే లాయర్లు తమ వాదనలను కచి్చతంగా ముగించాలి. అనవసర సాగదీతకు తావివ్వకుండా చూడాలి.


