నిందితుల హక్కుల పరిరక్షణపై ‘సుప్రీం’ కీలక ఆదేశాలు | Supreme Court issued crucial orders regarding the protection of the rights of the accused | Sakshi
Sakshi News home page

నిందితుల హక్కుల పరిరక్షణపై ‘సుప్రీం’ కీలక ఆదేశాలు

Feb 8 2026 3:49 AM | Updated on Feb 8 2026 3:49 AM

Supreme Court issued crucial orders regarding the protection of the rights of the accused

న్యాయవాదిని పెట్టుకునే స్థోమత లేనివారు ఉచిత న్యాయ సహాయం పొందొచ్చు

సాక్షి, అమరావతి: నిందితుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ నిమిత్తం క్రిమినల్‌ కేసులను విచారించే దిగువ కోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సొంతగా న్యాయవాదిని నియమించుకునే స్థోమత లేని నిందితులకు లీగల్‌ ఎయిడ్‌ కింద ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని నిందితులకు తప్పనిసరిగా తెలియజేయాలని దిగువ కోర్టులను ఆదేశించింది. సాక్షుల విచారణ ప్రారంభం కావడానికి ముందే నిందితులకు న్యాయ సహా­యం గురించి చెప్పాలంది. 

ఇందుకు నిందితులు ఏం చెప్పారు? న్యాయ సహాయానికి అంగీకరించారా?, న్యాయ సహాయం పొందేందుకు అంగీకరిస్తే అందుకు తీసుకున్న చర్యలు ఏమిటనే విషయాలను రికార్డ్‌ చేయాలని స్పష్టం చేసింది. అలా రికార్డ్‌ చేసిన వివరాలను సాక్షుల విచారణ మొద­లు కావడానికి ముందే కోర్టు ఉత్తర్వుల్లో పొందుపరచాలని స్పష్టం చేసింది. 

ఈ ఆదేశాలను అన్ని కింది కోర్టులు కచ్చితంగా పాటించేందుకు తగిన చ­ర్యలు తీసుకోవాలని దేశంలోని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూ­ర్తులకు స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పీవీ సంజయ్‌ కు­మా­ర్, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.  

ఉత్తర్వుల నేపథ్యం ఇదీ.. 
మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులో నిందితురాలిగా ఉన్న రెజీనామేరీ చెల్లమణి­కి మద్రాస్‌ హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది. తన తర­ఫున వాదించేందుకు న్యాయవాది లేకపోవడంతో విచారణ ప్రారంభ దశలో సాక్షులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయలేకపోయిన విషయాన్ని నిందితురాలు గుర్తించింది. దీంతో ఆ మహిళ సుప్రీ­ంకోర్టు­ను ఆశ్రయించింది. 

సాక్షులను తిరిగి విచారించా­ల­ని పెట్టుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు అనుమతించిన తర్వాతే.. ఆమెకు సాక్షులను ప్రశ్నించే అవకా­శం లభించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీల­క నిర్ణయం తీసుకుంది. సొంతగా న్యాయ­వాదులను నియమించుకునే స్థోమత లేని నిందితులకు, తమ తరఫున వాదించుకోవడానికి న్యా­య­వాదిని పెట్టు­కు­నే హక్కు ఉందన్న విషయాన్ని వా­రి­కి కింది కోర్టు­లు తప్పనిసరిగా తెలియజేయా­ల­ని ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement