గ్రామాలు, పట్టణాల్లో వార్డులు, డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాల తయారీకి నోటిఫికేషన్ జారీ
వచ్చేనెల 9 కల్లా ఓటర్ల జాబితాలు సిద్దం చేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు
గడవులోగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) శరవేగంగా కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు వీలుగా గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా.. మున్సిపాలిటీలు, నగరాల్లోనూ వార్డులు, డివిజన్ల వారీగా కొత్త ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని శుక్రవారం మూడు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు.
2026 జనవరి 1వ తేదీకి 18ఏళ్లు నిండిన వారికీ ఓటు హక్కు కల్పించేలా కొత్త ఫొటో ఓటర్ల జాబితాలను మార్చి 9 నాటికి ప్రచురించాలని కలెక్టర్లకు, డీపీఓలు, మున్సిపల్, నగర కార్పొరేషన్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో 17 నగర కార్పొరేషన్లు ఉండగా, అందులో 13 కార్పొరేషన్లలో పాలకవర్గాలు కొనసాగుతుండగా, వాటిలో 11 చోట్ల పదవీ కాలం మార్చి 17తో ముగుస్తుంది. 106 మున్సిపాలిటీలు ఉండగా, అందులో ప్రస్తుతం 87 మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు కొనసాగుతుండగా.. 75 మున్సిపాలిటీల్లో వాటి పదవీ కాలం మార్చి 17తోనే ముగియనుంది.
మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, నగర కార్పొరేషన్ అన్నీ కలిపి 123 ఉండగా.. అందులో ప్రస్తుతం 100 మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు కొనసాగుతుండగా, మిగిలినచోట్ల వివిధ రకాల కోర్టు కేసులు తదితర కారణాలతో ఎన్నికలు జరగని విషయం తెలిసిందే. ప్రస్తుతం పాలకవర్గాలు ఉన్న మరో 13 మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లలో ఈ ఏడాది నవంబర్ నాటికి పదవీకాలం ముగియనుంది. వీటికి తోడు 2021లో ఎన్నికలు జరిగిన పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది.
ముందస్తు ప్రణాళికతో ముందుకు..
స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగియనున్నందున గడువులోపే ఎన్నికలు జరిపేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని గత ఏడాది సెపె్టంబరు 3నే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు సంబంధించి వివిధ సందర్భాల్లో ఆమె మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులతోనూ భేటీ అయ్యారు.
తాజాగా శుక్రవారం మరో విడత అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మున్సిపాలిటీలో వార్డుల పునర్ వర్గీకరణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్త పంచాయతీల ఏర్పాటు వంటి ప్రక్రియ అమలుపై వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఈ సమావేశం తర్వాత మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాల రూపకల్పనపై ఎస్‌ఈసీ నోటిఫికేషన్ జారీ చేసినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.
చలనం లేని సర్కారు
ఇదిలా ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఈ ఏడాది దాదాపు అసాధ్యమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నిర్ణీత గడువులోగా మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేపడుతున్న చర్యలకు ప్రభుత్వ పరంగా తగిన సహకారం లేకపోవడం గమనార్హం.
రిజర్వేషన్ల ఖరారులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక రూపకల్పననూ పూర్తి చేయకపోవడంతో స్థానిక ఎన్నికలు ఈ ఏడాది అనుమానమేనని సమాచారం. అయితే, నిర్ణీత గడువులోగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన వంతుగా కసరత్తు చేపడుతోంది. దీనిలోభాగంగానే ఓటర్ల జాబితా తయారీకి ఎస్‌ఈసీ నోటిఫికేషన్ జారీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు.


