3 వారాల్లో తేల్చాల్సిందే! | decide remaining disqualification petitions in three weeks or face contempt | Sakshi
Sakshi News home page

3 వారాల్లో తేల్చాల్సిందే!

Feb 7 2026 6:04 AM | Updated on Feb 7 2026 6:04 AM

decide remaining disqualification petitions in three weeks or face contempt

లేకపోతే మేమే జోక్యం చేసుకుని చర్యలు చేపడతాం 

ఫిరాయింపులపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ 

తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మె ల్యేల అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు మరో సారి డెడ్‌ లైన్‌ విధించింది. అనర్హతలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న కాలయాపనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మూడు వారాల్లోగా ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది. ఒకవేళ నిర్ణయం వెలువడకపోతే తామే నేరుగా జోక్యం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీద్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసును విచారించింది. 

మున్సిపల్‌ ఎన్నికలతో ఆలస్యం: సింఘ్వీ 
తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ తన వాదనలు వినిపించారు. ‘అనర్హత పిటిషన్లపై విచారణ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. పెండింగ్‌లో ఉన్న మొత్తం పిటిషన్లలో ఒకదానిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. మిగిలిన రెండు పిటిషన్లు కూడా విచారణలో ఉన్నాయి. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల హడావుడి ఉండటం వల్ల స్పీకర్‌ కొంత సమయం కోరాల్సి వచ్చింది. మార్చి మధ్యలోగా లేదా అంతకంటే ముందే ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది..’ అని చెప్పారు. 

16 నెలలుగా ఏం చేస్తున్నారు?: మోహిత్‌ రావ్‌ 
సింఘ్వీ వాదనలను పిటిషనర్లు పాడి కౌశిక్‌ రెడ్డి, కేటీఆర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది మోహిత్‌రావ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ’గత 16 నెలలుగా ఈ వ్యవహారాన్ని స్పీకర్‌ కార్యాలయం తొక్కిపెడుతోంది. స్పీకర్‌ స్వయంగా నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని గతంలో కోర్టుకు హామీ ఇచ్చి, ఇప్పటివరకు కేవలం ఒక్కసారి మాత్రమే విచారణ జరిపారు. ఒక ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్‌ టికెట్‌పై ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆయన ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?..’ అని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం..తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. 

కోర్టులను రీల్స్‌ కోసం వాడుకోవద్దు 
విచారణ సందర్భంగాన్యాయవాద వృత్తిలోని నైతికతపై జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు గదుల్లో జరిగే వాదనలను రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో ’రీల్స్‌’ రూపంలో పోస్ట్‌ చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ’న్యాయస్థానాలను రీల్స్‌ కోసం వాడుకోవద్దు. ఇది ఇప్పుడు ఒక కొత్త పరిశ్రమగా మారింది. బాధ్యతాయుతమైన ఆఫీసర్లుగా ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు..’ అని హితవు పలికారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement