వాళ్లూ.. పూర్తి స్థాయి ఉపాధ్యాయులే | Supreme Court historic verdict on contract teachers | Sakshi
Sakshi News home page

వాళ్లూ.. పూర్తి స్థాయి ఉపాధ్యాయులే

Feb 7 2026 5:42 AM | Updated on Feb 7 2026 5:42 AM

Supreme Court historic verdict on contract teachers

సర్వ శిక్షా అభియాన్‌ పార్ట్‌టైం, కాంట్రాక్ట్‌ టీచర్లు, ఇన్‌స్ట్రక్టర్లపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు  

ఉపాధ్యాయులతో తక్కువ వేతనానికి పని చేయించుకోవడం అంటే వెట్టి చాకిరీనే 

సర్వ శిక్షా అభియాన్‌ ఉపాధ్యాయులను కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా పరిగణించరాదు 

వారిని పార్ట్‌టైం టీచర్లని పిలవడం మోసపూరితమే అవుతుంది 

వారు ఇతర పనులు చేసుకోకుండా ప్రభుత్వం నిషేధం విధించింది 

అందువల్ల వారు పూర్తిస్థాయి ఉపాధ్యాయులే అవుతారు 

అనుభవం ఉన్న వారిని తీసేసి కొత్త వారిని నియమించడానికి వీల్లేదు 

తాత్కాలిక నియామకాలు కాకుండా రెగ్యులర్‌ నియామకాలు చేపట్టాలి 

సర్వశిక్షా అభియాన్‌ కింద గౌరవ వేతన చెల్లింపు బాధ్యత రాష్ట్రాలదే 

గౌరవ వేతనం ఎప్పుడూ ఒకేలా ఉండకూడదు

‘‘యువత ఈ దేశ భవిష్యత్తు. వారికి సరైన దిశానిర్దేశం చేసి నిర్మాణాత్మక శక్తిగా మార్చేది ఉపాధ్యాయులే. ఒక బలమైన దేశానికి పునాది ఆ దేశ పౌరుల వ్యక్తిత్వం, విలువలలో ఉంటుంది. పునాదే బలహీనంగా ఉంటే దేశం కూలిపోక తప్పదు. మన భారత భాగ్య విధాతలను గొప్పవారిగా మలచడంలో ఉపాధ్యాయులది అత్యంత కీలక పాత్ర. భారతీయ సంస్కృతిలో ‘గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః’ అని అంటారు. 

ఉపాధ్యాయుడిని దైవంతో సమానంగా చూస్తాం. కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయుడు దైవం కంటే కూడా గొప్పవాడు. దేశ పునాదిని నిర్మించే ప్రాథమిక ఉపాధ్యాయులకు ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ఇవ్వాలి. వారి సేవలకు తగిన విధంగా గౌరవ వేతనం, ప్రతిఫలాన్ని అందించాలి. నిజానికి వారు చేసే సేవలకు ఏ గౌరవ వేతనమూ సరితూగదు’’    – సుప్రీంకోర్టు ధర్మాసనం

సాక్షి, అమరావతి: ‘సర్వ శిక్షా అభియాన్‌’ పథకం కింద నియమితులైన పార్ట్‌టైం టీచర్లు / కాంట్రాక్ట్‌ ఇన్‌స్ట్రక్టర్లు / కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయుల విషయంలో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. నియామక కాలం పూర్తయిన తరువాత కూడా కొనసాగుతున్న ఉపాధ్యాయులను ఇకపై ’కాంట్రాక్ట్‌’ ఉద్యోగులుగా పరిగణించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. వారు ఇతర పనులు చేయకుండా ప్రభుత్వం నిషేధించినందున పూర్తిస్థాయి ఉపాధ్యాయులే అవుతారని స్పష్టం చేసింది. ఈ పథకం కింద ఉపాధ్యాయులకు వేతనం చెల్లించాల్సిన బాధ్యత ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపింది. 

కేంద్రం తన వాటా నిధులు ఇవ్వకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉపాధ్యాయులకు ముందుగా చెల్లించి, ఆ తర్వాత కేంద్రం నుండి ఆ మొత్తాలను వసూలు చేసుకోవాలని పేర్కొంది. పార్ట్‌టైం టీచర్లు / కాంట్రాక్ట్‌ ఇన్‌స్ట్రక్టర్లు / కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులకు చెల్లించే గౌరవ వేతనం ఎప్పుడూ ఒకేలా ఉండకూడదని, కనీసం ప్రతి మూడేళ్లకు ఒకసారి సవరించాలని పేర్కొంది. 2013లో ఖరారు చేసిన రూ.7 వేలనే ఇప్పటికీ గౌరవ వేతనంగా చెల్లిస్తుండటం ‘వెట్టిచాకిరి’ కిందకే వస్తుందని తేల్చి చెప్పింది. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదంది. 

10 ఏళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తున్న నేపథ్యంలో వీరి పోస్టులు శాశ్వతమైనవిగా పరిగణించాలంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్, జస్టిస్‌ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించింది. సర్వ శిక్షా అభియాన్‌ పథకం కింద ఉత్తరప్రదేశ్‌లో నియమితులైన ఉపాధ్యాయులకు గౌరవ వేతనాన్ని రూ.7 వేలుగా మాత్రమే చెల్లిస్తుండటంపై దాఖలైన వ్యాజ్యాల్లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈమేరకు కీలక తీర్పు వెలువరించింది. 

2017–18 సంవత్సరానికి మాత్రమే రూ.17 వేలను కనీస వేతనంగా చెల్లించాలన్న హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పార్ట్‌టైం ఉపాధ్యాయులు, ఇన్‌స్ట్రక్టర్ల సంఘం సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేసింది. మరోవైపు రూ.17 వేలను కనీస వేతనంగా నిర్ణయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. టీచర్ల సంఘం దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతిస్తూ, ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది.

వారి ఆర్థిక భద్రత బాధ్యత రాష్ట్రాలదే...
‘ఈ ఉపాధ్యాయుల సేవలు విద్యా వ్యవస్థకు నిరంతరం అవసరం కాబట్టి సర్వ శిక్షా అభియాన్‌ పథకం కొనసాగినంత కాలం వారికి తగిన ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. వేతనం విషయంలో జాప్యం, కోతలు, అస్పష్టత ఉపాధ్యాయులను ఆర్థికంగా బలహీనులను చేస్తుంది. ఇది విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఉపాధ్యాయులకు గౌరవ వేతనాన్ని సమయానికి, నిరంతరాయంగా చెల్లించాలి. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు (వేతనం తగ్గించడం, ఆలస్యం చేయడం) అన్యాయమైనవే కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.  

ఉపాధ్యాయుల సేవలను దృష్టిలో ఉంచుకొని వారికి గౌరవప్రదమైన జీవనానికి సరిపడే వేతనం ఇవ్వాల్సిందే. ప్రస్తుత కేసులో.. సర్వశిక్షా అభియాన్‌ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.7 వేలు మాత్రమే ఇస్తోంది. ఇది మామూలు కార్మికులకు ఇచ్చే కనీస వేతనం కంటే తక్కువ. ఈ ఉపాధ్యాయులకు నెలకు రూ.17 వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించాలి. కనీసం ప్రతి మూడేళ్లకొకసారి వేతనాన్ని సవరించాలి’ అని ధర్మాసనం తన తీర్పులో తేల్చి చెప్పింది.

పార్ట్‌టైం టీచర్లని పిలవడం మోసపూరితం..
‘ప్రాథమిక పాఠశాలల్లో నియమితులైన పార్ట్‌టైం, కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులు ఎన్‌సీటీఈ (నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌) నిర్దేశించిన ప్రాథమిక విద్యార్హతలు కలిగి ఉంటారు. అందువల్ల వీరు రెగ్యులర్‌ ఉపాధ్యాయుల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదు. వీరిని ’పార్ట్‌ టైం టీచర్లు’ అని పిలవడం మోసపూరితం. 

వారు రెగ్యులర్‌ ఉపాధ్యాయులతో సమానమైన అర్హతలు కలిగి ఉండి, సమాన విధులను నిర్వర్తిస్తున్నారు. వారి విషయంలో ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం వేరే ఏ ఇతర ఉద్యోగం చేయకూడదు. ప్రభుత్వం వారిని ఇతర పనులు చేయకుండా నిరోధించినప్పుడు, వారిని వాస్తవానికి పూర్తి స్థాయి ఉపాధ్యాయులుగానే పరిగణించాలి’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.

తాత్కాలికం మానేసి.. రెగ్యులర్‌ నియామకాలు చేపట్టాలి
‘పార్ట్‌టైం టీచర్లు, ఇన్‌స్ట్రక్టర్లు 10 ఏళ్లకు పైగా నిరంతరాయంగా పనిచేస్తున్నారు. దీంతో వీరికి ఒక రకమైన శాశ్వతత్వం ఏర్పడింది. వారు రోజుకు ఎనిమిది పీరియడ్‌ల వరకు బోధిస్తూ రెగ్యులర్‌ ఉపాధ్యాయుల మాదిరిగానే పని భారాన్ని మోస్తున్నారు. వారి పని శాశ్వత స్వభావం కలిగినది. అనుభవం ఉన్న ఈ ఉపాధ్యాయులను తీసేసి కొత్త వారిని నియమించడం కుదరదు. 

ఒక కాంట్రాక్ట్‌ ఉద్యోగిని.. మరో కాంట్రాక్ట్‌ ఉద్యోగితో భర్తీ చేయకూడదు. ప్రభుత్వం ఇలాంటి తాత్కాలిక నియామక పద్ధతులను మానేసి సరైన పద్ధతిలో రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలి. వీరంతా సరైన ప్రక్రియ, ప్రకటన ద్వారా ఎంపికయ్యారు కాబట్టి వీరి నియామకాలను పూర్తిస్థాయి నియామకాలుగానే పరిగణించాలి. 

వీరిని అడ్‌హాక్‌ సిబ్బందిగా పిలవడం అసంబద్ధం. ప్రభుత్వ సంస్థలలో తాత్కాలిక ఉద్యోగులు ఎదుర్కొంటున్న దోపిడీని ఈ కోర్టు గుర్తించింది. సమానమైన పనులు చేస్తున్నప్పటికీ వారిని ’తాత్కాలికం’ అని ముద్ర వేసి పెన్షన్, పీఎఫ్, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వంటి ప్రాథమిక హక్కులను నిరాకరించడం వారి గౌరవానికి భంగం కలిగించడమే’ అని సుప్రీంకోర్టు  తేల్చి చెప్పింది.

తక్కువ వేతనానికి పని చేయించుకోవడం వెట్టి చాకిరియే..
‘ఉపాధ్యాయుల గౌరవ వేతనాన్ని నిర్ణయించడం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అయినప్పటికీ అది ఏకపక్షంగా ఉండకూడదు. ధరల పెరుగుదల, జీవన వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని కాలానుగుణంగా వేతనాన్ని సవరిస్తూ ఉండాలి. అతి తక్కువ వేతనానికి పని చేయించుకోవడం రాజ్యాంగంలోని 23వ అధికరణం ప్రకారం ‘వెట్టిచాకిరి’ కిందకు వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల తక్కువ వేతనానికి అంగీకరించడం స్వచ్ఛందమైన పని కాదు. అది బలవంతపు శ్రమ అవుతుంది. 

వేరే పని చేయనివ్వకుండా కట్టడి చేసి ఇచ్చే వేతనాన్ని కూడా తగ్గించడం ఆర్థికంగా వారిని అణచివేయడమే. ఇది రాజ్యాంగ విరుద్ధం’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ‘బడ్జెట్‌ ఆమోదించడం, గౌరవ వేతనాన్ని నిర్ణయించే అధికారం కేవలం పీఏబీ (ప్రాజెక్ట్‌ అప్రూవల్‌ బోర్డ్‌)కు మాత్రమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం లేదా ఇతర కమిటీలు వేతనాలను తగ్గించడం లేదా మార్చడం చేయలేవు. 

గౌరవ వేతనం ఖరారుతో సహా బడ్జెట్‌ కేటాయింపుల అధికారాలన్నీ పీఏబీకే ఉన్నాయి. ఒకసారి పీఏబీ ఆమోదించిన గౌరవ వేతనం అమలులో ఉన్నపుడు దాన్ని రాష్ట్రం ఏకపక్షంగా తగ్గించడం చట్టవిరుద్ధం. విద్యా హక్కు చట్టంలోని రూల్‌ 20 ప్రకారం ఈ ఉపాధ్యాయుల జీతభత్యాలు, పెన్షన్, ఇతర సౌకర్యాలు రెగ్యులర్‌ ఉపాధ్యాయులతో సమానంగా ఉండాలి’ అని తేల్చి చెప్పింది.

రెగ్యులర్‌ ఉపాధ్యాయులతో సమానంగా అన్ని ప్రయోజనాలు..
‘నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం, ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించకూడదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జనగణన, విపత్తు నివారణ విధులు, స్థానిక సంస్థలు లేదా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల విధులకు మాత్రమే వారిని కేటాయించవచ్చు. సర్వ శిక్షా అభియాన్‌ పథకం కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఇటువంటి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. 

ఈ పథకం కింద నియమితులైన ఉపాధ్యాయుల జీతభత్యాలు, వైద్య సదుపాయాలు, పెన్షన్, గ్రాట్యుటీ, పీఎఫ్‌ వంటివన్నీ కూడా రెగ్యులర్‌ ఉపాధ్యాయులతో సమానంగా ఉండాలి. దీని అర్థం.. వీరు కూడా అన్ని రకాల ప్రయోజనాలకు అర్హులు. ఈ ఉపాధ్యాయులు అకడమిక్‌ పనులతో పాటు ఇతర విధులను కూడా నిర్వహిస్తున్నందున వారికి ఇతర ఉపాధ్యాయులతో సమానంగా గౌరవ వేతనం అందాలి’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement