'పులి'.. అక్కడ చిక్కింది.. ఇక్కడ నక్కింది! | The tiger was finally caught in Kurmapuram | Sakshi
Sakshi News home page

'పులి'.. అక్కడ చిక్కింది.. ఇక్కడ నక్కింది!

Feb 7 2026 5:33 AM | Updated on Feb 7 2026 5:33 AM

The tiger was finally caught in Kurmapuram

ఏపీలో దొరికిన పులి.. 

విశాఖ జూకు తరలింపు

రాయవరం: వారం రోజులుగా తూర్పు గోదావరి జిల్లా ప్రజలను వణికించిన పులి ఎట్టకేలకు రాయవరం మండలం కూర్మాపురంలో పట్టుబడింది. గ్రామంలోని పంట పొలాల్లో శుక్రవారం ఉదయం రైతులకు పులి కనిపించింది. పాద ముద్రలను గుర్తించిన వారు గ్రామ శివార్లలోని చెరువు గట్టు వద్ద దాని గాండ్రింపులు వినిపించడంతో వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ, పోలీసు అధికారులు అక్కడకు చేరుకున్నారు. గ్రామంలోని ఓ ఇంటి ఆవరణలో తిష్ట వేసినట్లు గుర్తించారు. వెంటనే ఆ ఇంటిని చుట్టుముట్టారు. 

ట్రాంక్విలైజేషన్‌ ద్వారా పూణే నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్‌ పులిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే, అధికారుల కళ్లుగప్పి ఆ పులి గోడ దూకి పారిపోయింది. అక్కడి నుంచి ఓ పశువుల పాకలోకి దూరింది. ఆ పాక చుట్టూ అధికారులు వలలు పన్ని పులిని పట్టుకునేందుకు వ్యూహం రచించారు. బయటకు రాగానే ట్రాంక్విలైజేషన్‌ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 

సాయంత్రం 6.30 గంటల సమయంలో పులి బయటకు రావడంతో రెస్క్యూ టీమ్‌ సిబ్బందిలో ఇద్దరు ట్రాంక్విలైజర్‌ (తుపాకి వంటి సాధనం)తో మత్తు ఇంజక్షన్‌ ఇచ్చారు. దీంతో పులికి ఇంజక్షన్‌ తగిలి 100 మీటర్ల దూరం వెళ్లి గ్రామంలోని దుర్గమ్మ తల్లి ఆలయం వద్ద మత్తు తో పడిపోయింది. నిమిషాల వ్యవధిలో అధికారులు పులిని బోనులోకి నెట్టా రు. విశాఖపట్నంలోని జంతు ప్రదర్శన శాలకు తరలిస్తున్నామని చెప్పారు.

రఘునాథపల్లి మండలంలో  లేగదూడపై పెద్దపులి దాడి 
రఘునాథపల్లి/బచ్చన్నపేట: జనగామ జి ల్లా రఘునాథపల్లి మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. మండెల గూడెం శివారులోని పరిశె రాజుకు చెందిన లేగదూడపై శుక్రవారం తెల్లవారుజా మున పెద్ద పులి దాడిచేసి చంపింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై దూదిమెట్ల నరేశ్, డీఎఫ్‌వో కొండల్‌రెడ్డి, సిబ్బందితో వెళ్లి పులి పాదముద్రలు గుర్తించారు. అవి పులి అడుగులేనని నిర్ధా రించారు. పులిని సురక్షితంగా బంధించేందుకు చర్యలు చేపట్టినట్లు డీఎఫ్‌వో కొండల్‌రెడ్డి పేర్కొన్నారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

మద్దూర్‌లో పులి సంచారం...
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సరిహద్దు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్‌పూర్‌ గ్రామంలో పులి పాదముద్రలను గుర్తించారు. శుక్రవారం ఉదయం గ్రామ పొలాల్లో పులి అడుగులను గుర్తించిన రైతులు.. పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రమేశ్, ఎస్సై ఆసిఫ్, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ రాముడు కలిసి వచ్చి పాదముద్రలు పరిశీలించారు. 

పులి అడుగులుగా నిర్ధారించారు. పక్క గ్రామాలైన బచ్చన్నపేట మండలంలో కట్కూర్, వీఎస్‌ఆర్‌ నగర్, బండనాగారం, బంజేరు, మార్మాముల గ్రామాల సర్పంచ్‌లకు సమాచారమిచ్చి జాగ్ర త్తగా ఉండాలని సూచించారు.  కాగా, రఘునాథపల్లి, బచ్చన్నపేట మండలాల్లో సంచరిస్తున్న పులులు వేర్వేరని, రెండు పులులు ఉన్నట్లు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement