సీఐపై కత్తితో దాడి | Most wanted criminal Kavadi Nagendra attacked CI Anjaneyulu and Constable Ravi | Sakshi
Sakshi News home page

సీఐపై కత్తితో దాడి

Feb 7 2026 5:24 AM | Updated on Feb 7 2026 5:25 AM

Most wanted criminal Kavadi Nagendra attacked CI Anjaneyulu and Constable Ravi

కానిస్టేబుల్‌కూ గాయాలు

దుండగుడు కావడి నాగేంద్ర మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ 

అత్తాకోడళ్ల గ్యాంగ్‌ రేప్‌ కేసులో ప్రధాన నిందితుడు  

చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీప్రాంతంలో ఘటన 

గాయపడిన నిందితుడు, ఆస్పత్రిలో చికిత్స  

హిందూపురం/చిలమత్తూరు: శ్రీ సత్యసాయి హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలోని ఎర్రకొండ అటవీప్రాంతంలో హిందూపురం రూరల్‌ సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్‌ రవిపై మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ కావడి నాగేంద్ర కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఆత్మరక్షణలో భాగంగా సీఐ కాల్పులు జరపడంతో నిందితుడు గాయపడ్డాడు. శుక్రవారం టేకులోడు అటవీప్రాంతంలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది.  

పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడి 
2024లో చిలమత్తూరు మండలం టేకులోడు పంచాయతీ నల్ల»ొమ్మనపల్లి వద్ద అత్తాకోడళ్లపై సామూహిక లైంగిక దాడి చేసిన ఘటనలో హిందూపురం పట్టణం గుడ్డం ప్రాంతానికి చెందిన కావడి నాగేంద్ర ప్రధాన నిందితుడు. బెయిల్‌పై బయటకు వచి్చన అతను కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు అతనికోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో అతను ఉన్నట్లు శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో హిందూపురం అప్‌గ్రేడ్‌ స్టేషన్‌ సీఐ ఆంజనేయులు, హిందూపురం రూరల్‌ సీఐ జనార్దన్, చిలమత్తూరు ఎస్‌ఐ మునీర్‌ అహ్మద్‌ మూడు బృందాలుగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో హిందూపురం రూరల్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ రవికి నిందితుడు నాగేంద్ర కనిపించడంతో అతను పట్టుకునేందుకు వెళ్లాడు. దీంతో నాగేంద్ర తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్‌ రవిపై దాడి చేసి అడవిలోకి పరారయ్యాడు. 

తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ రవి గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న సీఐ ఆంజనేయులు అక్కడికి చేరుకుని రవిని వెంటనే హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నాగేంద్రను వెంబడిస్తూ అడవిలోకి వెళ్లాడు. కొద్దిదూరం వెళ్లాక నాగేంద్ర కనిపించడంతో లొంగిపోవాలని సీఐ కోరినా అతను వినిపించుకోలేదు. పైగా పట్టుకునేందుకు వెళ్లిన సీఐపై కూడా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. 

దీంతో ఆత్మరక్షణ కోసం సీఐ ఆంజనేయులు తన సర్వీసు రివాల్వర్‌తో నాగేంద్ర కాళ్లపై కాల్చడంతో అతను కింద పడిపోయాడు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు సీఐ ఆంజనేయులుతోపాటు, నిందితుడు నాగేంద్రను చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ రవి, సీఐ ఆంజనేయులు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.  

చట్టప్రకారం శిక్షిస్తాం 
నిందితుడు కావడి నాగేంద్రకు చట్టప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్‌ తెలిపారు. నాగేంద్ర చేసిన దాడిలో గాయపడిన సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్‌ రవీంద్రను  హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం మధ్యాహ్నం ఎస్పీ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నాగేంద్ర 2024లో టేకులోడు ఫ్యాక్టరీ వద్ద అత్తాకోడళ్లపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ కేసులో నిందితుడిగా ఉన్నాడని, అలాగే జిల్లాలో అతడిపై 41 కేసులు, కర్ణాటకలో 70 కేసులు నమోదైనట్లు తెలిపారు. అంతకుముందు ఆయన ఘటన జరిగిన టేకులోడు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement