చంద్రబాబు సర్కారు కుట్రలపై వైఎస్ జగన్ నిప్పులు
శ్రీవేంకటేశ్వరస్వామి ముందు లెంపలేసుకుని చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
తిరుమల లడ్డూ నెయ్యిలో జంతుకొవ్వు కలవలేదని ప్రఖ్యాత ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యాబ్‌లు నిర్ధారించాయి
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని, జంతుకొవ్వు కలవలేదని సీబీఐ చార్జ్‌షీట్‌లో తేల్చేసింది
ఆ చార్జ్‌షీట్‌లో మరో ముఖ్యమైన అంశం.. చంద్రబాబు సీఎం అయ్యాక నాణ్యత లేదని టీటీడీ 4 నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసింది
ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దొడ్డిదారిన మరో పేరుతో తిరిగి వస్తే టీటీడీ ఆమోదించింది
అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సీబీఐ వెల్లడించింది
చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులు, వాళ్లు చేసిన అన్యాయంపై చార్జ్‌షీట్‌లో రాసింది
తనకు అనుకూలమైన నివేదిక కోసమే బాబుసీబీఐ రిపోర్టును కాదని.. కొత్తగా కమిషన్
న్యాయం కోసం ఎన్‌హెచ్‌ఆర్‌సీ, సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాం..
ఇప్పుడు తప్పులు చేస్తున్న వారెవరినీ వదిలి పెట్టబోం.. బోనులో నిలబెడతాం
వచ్చేది మా ప్రభుత్వమే..
వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి ఏ తప్పూ చేయలేదు.. అందుకే వారి పేర్లు సీబీఐ చార్జ్‌షీట్‌లో పెట్టలేదు.. అరెస్టు చేయలేదు
జంగిల్‌రాజ్‌పై ప్రశ్నిస్తున్నందుకే.. టీడీపీ గూండాల దాడులు
అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు హేయం
పోలీసుల సమక్షంలోనే రెండు చోట్లా దాడులు.. విధ్వంస కాండ
చంద్రబాబుకు చిప్ సరిగ్గా ఉంటే ఇలాంటి పనులు చేయిస్తారా?
టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన జోగి రమేష్ నివాసాన్ని పరిశీలించిన వైఎస్ జగన్.. అండగా ఉంటామని భరోసా
సీబీఐ సిట్ చార్జ్‌షీట్ వేసిన తర్వాత అయినా చంద్రబాబు చేయాల్సిన పని ఏంటంటే.. శ్రీ వేంకటేశ్వరస్వామి ముందు లెంపలేసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కనీసం మానవత్వం ఉన్న మనిషైతే చంద్రబాబు అలాంటి పని ఎందుకు చేయడం లేదు?
సీబీఐ సిట్ చార్జ్‌షీట్‌లో పొందుపరిచిన వాస్తవాలను చూపించి ఎవరైనా చంద్రబాబుని ప్రశ్నిస్తే.. ఆయన అసహనంతో మా నాయకుల మీద దాడులు చేయించే నీచ స్థాయికి దిగజారిపోయాడు. అందులో భాగంగానే వరుసపెట్టి మా నాయకులు విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకరరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీద దాడి చేయడమే కాకుండా అంబటి రాంబాబు ఇంటి మీద కూడా దాడి చేశారు.
అసలు చంద్రబాబుకు చిప్ సరిగ్గా ఉంటే ఇలాంటి పనులు చేయిస్తారా? తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా.. ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యాబ్‌లు ఎలాంటి జంతు కొవ్వు లేదని ధ్రువీకరించినా.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్,లోకేశ్ తమ తీరు అస్సలు మార్చుకోవడం లేదు.
తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న కూటమి నేతల ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు వక్రబుద్ధి, అబద్ధాలపై వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ సిట్‌ను ఏర్పాటు చేసింది. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఎవరూ తప్పుపట్టలేరు. సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు పదవి పెద్దది కాదు. ఇవాళ చంద్రబాబు తన స్వార్థం కోసం వన్‌మ్యాన్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వాటికి ఎలాంటి ప్రామాణికత ఉండదు. తనకు అనుకూలంగా రిపోర్టు రాకపోవడంతో మళ్లీ కొత్త కమిషన్ ఏర్పాటు చేసుకుని, తనకు అనుకూలమైన రిపోర్టు కోసం కుట్ర చేస్తున్నాడు. - వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని సీబీఐ చార్జ్‌షీట్‌లో తేల్చి చెప్పింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ కలవలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ చంద్రబాబు అన్యాయంగా ఇంకా దుష్ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. చంద్రబాబు సీఎం కాక ముందు వరకు ఎవరైనా తిరుమల ప్రసాదం ఇస్తే కళ్లకు అద్దుకుని తినేవారు.
కానీ ఇప్పుడు ఆ ప్రసాదం పవిత్రతను చంద్రబాబు దిగజార్చాడు. ఒక అబద్ధాన్ని సృష్టించి రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకున్న దుర్మార్గుడు చంద్రబాబే. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు లేదని ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యాబ్‌ల నివేదికలు స్పష్టం చేసినా చంద్రబాబు ఇంకా ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం దారుణం..’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
అబద్ధాన్ని సృష్టించి రెక్కలు కట్టి దుష్ప్రచారం చేశారని, కానీ చంద్రబాబువి అబద్ధాలని సీబీఐ చార్జ్‌షీట్ తేల్చేసిందని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టీడీపీ మూకల దాడిలో దెబ్బతిన్న జోగి రమేష్ ఇంటిని శుక్రవారం వైఎస్ జగన్ పరిశీలించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..

కక్షగట్టి దాడులు
చంద్రబాబు అబద్ధాలను ప్రశ్నిస్తున్నందుకు చిప్ పని చేయక పోవడం వల్లే కక్షగట్టి దాడులకు దిగుతున్నారు. చేసిన తప్పు ఒప్పుకుని, లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పుడు వన్‌మ్యాన్ కమిషన్ అంటూ అనుకూల నివేదిక కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఆ కమిషన్‌కు ఏ మాత్రం విలువ ఉండదు. టీడీపీ గూండాలు గుంటూరులో అంబటి రాంబాబు ఇంట్లో ఐదు కార్లు «ధ్వంసం చేయడంతోపాటు ఇల్లు, ఆఫీసులో విధ్వంసం సృష్టించి ఆఫీస్‌కు నిప్పుపెట్టారు.
ఆ మర్నాడు ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు జోగి రమేష్ ఇంటిపై ఏకంగా యాసిడ్ బాటిళ్లతో, పెట్రోల్ బాంబులతో వి«ధ్వంసం సాగించారు. అక్కడ అంబటి రాంబాబు.. ఇక్కడ జోగి రమేష్ తండ్రిపై హత్యాయత్నం జరిగింది. పోలీసుల సమక్షంలోనే రెండు చోట్లా దాడులు జరిగాయి. టీడీపీ గూండాలకు వారు అండగా ఉంటున్నారు. నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు రాష్ట్రంలో జంగిల్‌రాజ్ కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తున్నారు. నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు సర్కారు చర్యలు ఉన్నాయి. తప్పులు చేస్తున్న ఎవరినీ వదిలిపెట్టబోం. సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాం. మరో మూడేళ్లలో వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. ఇప్పుడు తప్పులు చేస్తున్న అందరినీ బోనులో నిలబెడతాం. వారికి శిక్ష తప్పదు.
నాగరిక సమాజం తలదించుకునేలా..
రాష్ట్రంలో జంగిల్‌రాజ్ పరిపాలన సాగుతోంది. నాగరిక ప్రపంచం తలవంచుకునేలా చంద్రబాబునాయుడు చేశారు. గుంటూరులో అంబటి రాంబాబు ఇంట్లో 5 కార్లను ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడ్డారు. అద్దాలను పగలగొట్టారు. ఇంట్లో ఆడవాళ్లను దుర్భాషలాడారు. ఇంటి పక్కనే ఉన్న ఆఫీసులోకి చొరబడి విధ్వంసానికి దిగి ఆఫీసును తగలబెట్టారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరగటాన్ని అంతా చూశాం. అక్కడ సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దహనకాండ జరిగింది. ఆ మర్నాడే ఇక్కడ కూడా సాయంత్రం అదే పరంపర కొనసాగింది. జోగి రమేష్ ఇంటిపైనా దారుణంగా దాడి చేశారు.
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని సీబీఐ తేల్చింది
చంద్రబాబునాయుడు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నాడని, ప్రజలను తప్పుదోవ పట్టించాడని సాక్షాత్తూ సీబీఐయే తేటతెల్లం చేస్తూ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడు ఆరోపించినట్లుగా తిరుమలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ, పందికొవ్వు కానీ, చేప నూనె కానీ కలపలేదని సీబీఐ స్పష్టం చేసింది. శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు దు్రష్పచారం చేశాడు.
ప్రతిష్టాత్మక ల్యాబ్‌లూ అదే నిర్ధారించాయి
తిరుమలలో వాడిన నెయ్యిపై చంద్రబాబు చెబుతున్నవి అబద్ధాలని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌డీఆర్‌ఐ), నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) ల్యాబ్‌లు నిర్ధారించాయి. ఆ మేరకు నివేదికలు ఇచ్చాయి. అవి రెండూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వారు పరీక్షించిన నెయ్యి శాంపిల్స్ అన్నీ కూడా చంద్రబాబు సీఎంగా ఉండగా, ఆయన మనిషి టీటీడీ ఈవోగా ఉండగా సేకరించినవే. సీబీఐ ఆధ్వర్యంలో ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీకి ఆ శాంపిల్స్ పంపారు.
తిరుమలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, గొడ్డు కొవ్వు లేదని, పందికొవ్వూ లేదని, ఎలాంటి చేపనూనె కూడా కలవలేదని ఆ ల్యాబ్‌లు ధ్రువీకరించాయి. ఆ రిపోర్టులను సీబీఐ కూడా సరి్టఫై చేసింది. సీబీఐ సిట్ ఆ మేరకు చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
భూమన, వైవీకి సీబీఐ క్లీన్‌చిట్..
ఆ చార్జ్‌షీట్‌లో సీబీఐ మరో విషయం కూడా చెప్పింది... గతంలో టీటీడీ చైర్మన్లుగా వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి ఉన్నప్పుడు వాళ్లు ఎలాంటి తప్పూ చేయలేదని, అన్యాయమైన పనులు చేయలేదని స్పష్టం చేసింది. అందుకే వారి పేర్లు చార్జ్‌షీట్‌లో పెట్టలేదు. వారిలో ఎవరినీ అరెస్టు చేయలేదు. అంటే సీబీఐ వారికి క్లీన్‌చిట్ కూడా ఇచ్చింది. ఇదొక్కటే కాదు.. ఆ చార్జ్‌షీట్‌లో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. (పేజీ నెం 62 ప్రస్తావించారు) చంద్రబాబు సీఎం అయిన తర్వాత 2024 జూలై 25న నెయ్యిలో నాణ్యత లేదని టీటీడీ 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేసింది (ఆ రిపోర్టు చదివి వినిపించారు.
చార్జ్‌షీట్‌లోని పేజీ నెం 64, 44 అంశాలను చదివి వినిపించారు). కానీ ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్లీ ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే దొడ్డిదారిన వేరేవాళ్ల పేరుతో తిరిగి వస్తే వాటిని టీటీడీ ఆమోదించింది. అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సీబీఐ వెల్లడించింది. అలా చంద్రబాబు ప్రభుత్వం మీద, వాళ్లు చేసిన తప్పుల మీద, వాళ్లు చేసిన అన్యాయంపై చార్జ్‌షీట్‌లో రాశారు.
పాపం చేసింది ఎవరు బాబూ..?
ఏకంగా సీబీఐనే చంద్రబాబు ప్రభుత్వం మీద ఈ మాదిరిగా చార్జిషీట్‌లో రాసిన తర్వాత అసలు పాపం చేసిన వాళ్లు ఎవరు? అని చంద్రబాబును, ఆయన కుమారుడిని, కూటమిలో ఉన్న పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నిస్తున్నా. టీటీడీ నెయ్యిలో చేప నూనె, గొడ్డు కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని ఎవరు చెప్పారు..? సీబీఐ చెప్పిందా..? ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యాబ్ రిపోర్టులు చెప్పాయా..? చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌తో పాటు రోజూ వారి పల్లకి మోస్తున్న ఎల్లో మీడియా (ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5) ప్రచారం చేయడం మినహా ఎవరైనా చెప్పారా? ఒక అబద్ధానికి రెక్కలు కట్టి దు్రష్పచారం చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం కన్నా హేయమైన చర్య ఇంకోటి ఉంటుందా?
చంద్రబాబుకు ఇకనైనా బుద్ధి రావాలి..
అనిల్ సింఘాల్‌ను చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే టీటీడీ ఈవోగా నియమించారు. మా ప్రభుత్వం ఆయన్ను కొనసాగించింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన్నే తెచ్చారు. శ్యామలరావును టీటీడీ ప్రక్షాళన కోసం తెచ్చానని చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక చెప్పారు. ప్రక్షాళనకు ముందే ఆయన్ను ఎందుకు టీటీడీ ఈవోగా తొలగించారు? శ్యామలరావు ఈవోగా ఉన్నప్పుడు కొన్ని నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. అవే ట్యాంకర్లు.. మళ్లీ టీటీడీకి మరో డెయిరీ పేరుతో తిరిగి వచ్చినట్లు సీబీఐ సిట్ ధ్రువీకరించింది. మరి పాపం చేసింది ఎవరు చంద్రబాబూ? చంద్రబాబుకు ఇకనైనా బుద్ధి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.
పూజలు చేయడం తప్పా..?
మానవత్వం లేని చంద్రబాబుని ప్రశ్నిస్తూ.. ఆయనకు దేవుడు జ్ఞానోదయం కలిగించాలని ప్రార్థిస్తూ మా నాయకులు ఆలయాల్లో పూజలు చేశారు. ఆయనతోపాటు లోకేశ్, పవన్‌కల్యాణ్‌తో సహా ఇతర నాయకులకు బుద్ధి, జ్ఞానం కలగాలని, వారి చిప్ రిపేర్ చేయాలని మా నాయకులంతా గుళ్లల్లో పూజలు చేశారు. ఒక అబద్ధానికి రెక్కలు కట్టి దు్రష్పచారం చేస్తూ శ్రీవారి ప్రతిష్టను మంట కలిపేస్తుంటే మావాళ్లు గుళ్లలో పూజలు చేయడం తప్పా?
ఇది హత్యాయత్నం కాదా..?
లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఆరోపణలు పచ్చి అబద్ధమని అంత స్పష్టంగా, అన్ని విధాలుగా తేలిన తర్వాత కూడా ఈ పెద్ద మనిషి ఫ్లెక్సీలు కట్టి తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా దు్రష్పచారం చేయడం ధర్మమేనా? ఆ ఫ్లెక్సీల్లో అన్యాయమైన మాటలు రాసి దు్రష్పచారం చేయడం న్యాయమేనా? చంద్రబాబు, లోకేశ్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రశ్నిస్తూ మా నాయకుడు జోగి రమేష్.. మీ చిప్ రిపేర్ చేసుకోమని సలహా ఇచ్చాడు.
దానికి ఇంత అన్యాయమైన పని చేయడం ధర్మమేనా? సలహా ఇవ్వడం మినహా జోగి రమేష్ ఏమీ చేయలేదు. దానికే చంద్రబాబుకి అసహనం ఏస్థాయిలో వచ్చింది అంటే.. ఏకంగా యాసిడ్ బాటిల్స్, పెట్రోల్ బాంబులతో జోగి రమేష్ ఇంటి మీద దాడులు చేయించాడు. ఆ యాసిడ్ పడిన ప్రాంతంలో బండలు తీవ్రంగా కాలిపోయాయి. గోడల నిండా యాసిడ్ మరకలు కనిపిస్తున్నాయి. యాసిడ్ పడి డోర్లు కాలిపోయాయి. ఆ పక్కనే ఉన్న స్విచ్ బోర్డుల మీద పడి షార్ట్ సర్క్యూట్ అయితే పెద్ద ఘోరం జరిగి ఉండేది.
ఇంట్లో ఉన్న కర్టెన్లు, ఉడెన్ ఫర్నీచర్లు కాలిపోతే పరిస్థితి తీవ్రరూపం దాల్చేది. ఇంట్లో 80 ఏళ్ల వయసున్న జోగి రమేష్ నాన్న నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇది హత్యాయత్నం కాదా? బీసీ నాయకుడిగా జోగి రమేష్ ఎదుగుతుంటే, ప్రభుత్వ తప్పులపై ఆయన వాయిస్ బలంగా వినిపిస్తుంటే.. ఆ గొంతు నొక్కే కుట్రలో భాగంగానే చంద్రబాబు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలతో దాడులు చేయిస్తున్నాడు.
పోలీసులతో కలిసి టీడీపీ కుట్ర..
జోగి రమేష్ ఇంటి మీద సాయంత్రం ఐదు గంటలకు దాడి జరిగితే.. ఆ దాడికి సంబంధించి పోలీసులు, తెలుగుదేశం పార్టీ వ్యక్తులు ఏ రకంగా కుట్రలు చేశారనే దానికి ఈ ఫొటోనే సాక్ష్యం (పోలీసులతో టీడీపీ నాయకులు మంతనాలు జరుపుతున్న ఫొటోను చూపారు). ఇదే సర్కిల్లో డీసీపీ రామకృష్ణ, ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్‌తో టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు దాడులకు సంబంధించి వ్యూహరచన చేశాడు.

జోగి రమేష్‌ను హత్య చేసి, ఇంటి మీద దాడి చేసి వారి ఆస్తులను ధ్వంసం చేసే కుట్రలకు ఇక్కడే పోలీసులతో టీడీపీ నాయకుడు మంతనాలు జరిపాడని క్లియర్‌గా తెలిసిపోతోంది. హత్యా యత్నం ఎలా చేయాలి? ఆ దాడికి పోలీసులు ఎలా సహకరించాలో పథక రచన చేశారు. ఏకంగా పోలీసులే టీడీపీ నాయకులతో కలిసి మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంతనాలు జరిపారు. ఆ తర్వాత టీడీపీ నాయకులు ఏకంగా పోలీసులనే వెంటబెట్టుకుని కలసికట్టుగా జోగి రమేష్ ఇంటిపై దాడికి దిగారు.
ఈ పాపాలు ఎవరివి బాబూ?
» నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసి.. మళ్లీ అదే నెయ్యి ట్యాంకర్లు మరో పేరుతో వస్తే ఆమోదించింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కదా.
» అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని స్వయంగా సీబీఐ చెప్పింది.
» చంద్రబాబు ప్రభుత్వం తప్పులు, వాళ్లు చేసిన అన్యాయాన్ని చార్జ్‌షీట్‌లో సీబీఐ రాసింది
» టీటీడీ ఈవోగా అనిల్ సింఘాల్‌ను తీసుకొచ్చింది ఎవరు?
» ప్రక్షాళన కోసం తెచ్చామన్న శ్యామలరావును తప్పించింది ఎవరు?

ఇవిగో పచ్చి నిజాలు... సాక్ష్యాలు
టీడీపీ నాయకుడు ఫతావుల్లా ఏకంగా యాసిడ్ బాటిల్, పెట్రోల్ బాంబులతో దాడి చేశాడు. దాడికి ముందు వాటితో ఉన్న ఫొటోల్లో క్లియర్‌గా చూడవచ్చు. పోలీసుల సమక్షంలోనే జోగి ఇంటిపైకి పెట్రోల్ బాంబులు విసిరి నిప్పంటించాడు. ఫతావుల్లాతోపాటు ఆశా అనే టీడీపీ కార్యకర్త కూడా జోగి రమేష్ ఇంటి మీద పోలీసుల సమక్షంలోనే రాళ్ల దాడి చేసింది. ఆశా కుమార్తె పెళ్లికి చంద్రబాబు కూడా హాజరయ్యాడు. (చంద్రబాబు, లోకేశ్, హోంమంత్రితో వారు దిగిన ఫొటోలు, ఆశా కుమార్తె పెళ్లికి హాజరైన చంద్రబాబు ఫొటోలు చూపించారు.

పోలీసులతోనే కలసి వచ్చి వారి సమక్షంలోనే టీడీపీ నాయకులు దాడికి దిగిన వీడియోలు కూడా చూపారు). టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు, డీసీపీ, సీఐ మంతనాలు జరుపుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులతో కలిసి టీడీపీ శ్రేణులు వస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. (టీడీపీ నాయకుడు బాటిల్ ఎగరేస్తూ పోలీసులతో కలిసి జోగి రమేష్ ఇంటి వద్దకు వచ్చిన వీడియో క్లిప్పింగ్స్‌ను మీడియాకు చూపారు).

మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా? లేక జంగిల్ రాజ్‌లో ఉన్నామో చెప్పేందుకు ఈ వీడియోలే సాక్ష్యం. కల్తీ లిక్కర్ కేసుకు సంబంధించి తంబళ్లపల్లె కోర్టుకు హాజరయ్యేందుకు జోగి రమేష్ వెళ్తుండగా ఇక్కడ ఇబ్రహీంపట్నంలోని తన ఇంటిపై దాడి జరిగినట్లు ఆయనకు సమాచారం వచ్చింది. ఈ విషయంపై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసేందుకు జోగి రమేష్ ఫోన్ చేసినా స్పందించలేదు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి సమయంలోనూ ఇలాగే జరిగింది.
అన్ని ఆధారాలున్నాయ్.. ఎవరినీ వదిలిపెట్టం..
దాడులు, విధ్వంసాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి గడప తొక్కుతాం. న్యాయ పోరాటం చేస్తాం. రాష్ట్రంలో సాగుతున్న జంగిల్‌రాజ్ పాలనను దేశానికి తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వానికి ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యాయి. ఇక మిగిలింది మూడేళ్లే. ఆ తరువాత వచ్చేది మా ప్రభుత్వమే. ఇవాళ మా పార్టీ నాయకుల ఇళ్లపై గూండాగిరీ చేసిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతాం. ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదు.
బీసీలంటే చంద్రబాబుకు చులకన..
తంబళ్లపల్లిలో టీడీపీ తరఫున పోటీ చేసిన వ్యక్తి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాడు. కమీషన్ల పంపకాల్లో తేడా రావడంతో ఆ వ్యవహారం బయటపడింది. ఆ కేసులో జయచంద్రారెడ్డిని అరెస్టు చేయాల్సింది పోయి సంబంధం లేని జోగి రమేష్‌ను కేసులో చేర్చారు. చంద్రబాబు రాజ్యంలో జోగి రమేష్ లాంటి వ్యక్తి నకిలీ లిక్కర్ తయారు చేయగలడా? ఆ లిక్కర్‌ను బెల్ట్ షాపుల్లోకి సరఫరా చేయగలరా?
జోగి రమేష్ పై చంద్రబాబు ప్రభుత్వం 12 కేసులు పెట్టింది. చేయని నేరానికి 83 రోజులు జైలులో పెట్టారు. ఆయన కుమారుడు రాజకీయంగా యాక్టివ్ అవుతున్నాడని చిన్న పిల్లాడిపై ఏడు కేసులు పెట్టారు. జోగి రమేష్ భార్యపై పోలీసులే దౌర్జన్యం చేసి తిరిగి ఆమెపైనే కేసులు పెట్టారు. బీసీలపై చంద్రబాబుకు ఉన్న చులకన భావానికి జోగి రమేష్‌పై నమోదైన కేసులే నిదర్శనం.


