విజయవాడ: వరుసగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ గూండాలు చేస్తున్న దాడులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.అక్కడ(గుంటూరులో) అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడి విధ్వంసం.. ఇక్కడ జోగి రమేష్( విజయవాడ, ఇబ్రహీంపట్నం) ఇంటిపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిళ్లతో దాడులు చేయడం కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు నిదర్శనమంటూ మండిపడ్డారు వైఎస్ జగన్.
ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 06) జోగి రమేష్ ఇంట్లో దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన వైఎస్ జగన్.. ఆపై కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం,వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అంబటి రాంబాబు ఇంట్లో కొనసాగించిన జంగిల్ రాజ్ పరంపరను జోగి రమేష్ విషయంలో కూడా కొనసాగించారని ధ్వజమెత్తారు.
‘గుంటూరులో అంబటి రాంబాబు అన్న ఇంటిని.. ఇక్కడ జోగి రమేష్ అన్న ఇంటిని ధ్వంసం చేశారు. అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడ్డారు.. విధ్వంసం సృష్టించారు. అంబటి కుటుంబ సభ్యులపై దుర్భాషలాడారు. పక్కనున్న అంబటి ఆఫీస్‌ను కూడా తగలబెట్టారు. అంబటి ఇంట్లో, ఆఫీస్‌లో జరిగిన జంగిల్ రాజ్‌ను.. జోగి రమేష్ విషయంలో కూడా కొనసాగించారు. అసత్య ప్రచారం చేస్తున్న మీ చిప్ సరి చేసుకోమన్నందుకే జోగిరమేష్‌పై దాడి చేశారు. చిప్ సరిగ్గా లేకనే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు. చిప్ సరిగ్గా లేకనే సీబీఐ రిపోర్టుపై అసత్య ప్రచారం చేశారు’ అంటూ వైఎస్ జగన్ విమర్శించారు.
రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం...
చంద్రబాబు అబద్ధాలను సీబీఐయే తేటతెల్లం చేసింది. తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని సీబీఐ స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కానీ ఎటువంటి పంది కొవ్వు కలపలేదని సీబీఐ రిపోర్ట్‌లో పేర్కొంది. శ్రీ వెంకటేశ్వరస్వామిని అగౌరపరిచిన, అవమానపరిచిన వ్యక్తి చంద్రబాబు. ఒక అబద్ధాన్ని సృష్టించి.. దానికి రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు అంటూ విష ప్రచారం చేశారు. చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు హయాంలో సేకరించిన నమూలను కేంద్ర సంస్థలైన ఎన్డీడీబీకి, ఎన్డీఆర్‌ఐకి పంపింది.
ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పాయి. సీబీఐ ఇంకొకటి కూడా చెప్పింది. టీటీడీ చైర్మన్‌లుగా పని చేసిన తమ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిలు సమయంలో ఎటువంటి తప్పు జరగలేదని సీబీఐ క్లీన్‌చిట్ కూడా ఇచ్చింది. సీబీఐ ఇచ్చిన చార్జ్‌షీట్‌లో.. పేజ్ నం 62లో వాళ్లు మెన్షన్ చేసింది ఏమిటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా జూలైలో టీటీడీ వాళ్లు నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. అవే ట్యాంకర్లను దొడ్డిదారిని మళ్లీ టీటీడీకి రప్పించి, వాటినే వాడారని సీబీఐ చెప్పింది.
మరి ఇప్పుడు పాపం చేసింది ఎవరు అనేది ప్రశ్నిస్తున్న చంద్రబాబుని. కూటమి నేతల్ని కూడా ప్రశ్నిస్తున్న తప్పు ఎవరు చేశారు? పాపం ఎవరు చేశారు? అని, జంతువుల కొవ్వు ఉందని గొడ్డుమాంసం ఉందని ఏ ల్యాబ్ రిపోర్ట్‌లు చెప్పాయి. ఎవరూ చెప్పలేదు. అది చంద్రబాబు సృష్టి. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబే సృష్టించారు’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ అరాచకాన్ని నిలదీస్తే.. దాడులు చేస్తారా?
ఒక అబద్ధాన్ని స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు సృష్టిస్తే.. దానికి ఆయన తనయుడు లోకేష్, పవన్ కళ్యాణ్‌లు వంత పాడారు. వీరికి ఎల్లో మీడియానే ఈ విషయాన్ని పదే పదే విష ప్రచారం చేశాయి. దుష్ప్రచారం చేసి దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు. ఆ దుష్ప్రచారం తప్పు అని చెప్పినప్పుడు.. చంద్రబాబు ఏం చేయాలి. క్షమించమని లెంపలు వేసుకోవాలి. తప్పుడు ప్రచారం చేశారు కాబట్టి వారి చిప్‌లు బాగు చేయమని గుడుల్లోకి పూజలు చేయడం తప్పా?, సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చినప్పడు.. తప్పుడు ఫ్లెక్సీలు కట్టి దుష్ప్రచారం మొదలుపెట్టారు. దాన్ని నిలదీస్తే.. ఈ అరాచకం మొదలుపెట్టారు. ఈ జంగిల్ రాజ్ పరిపాలన ఆరంభించారు’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
పోలీసులతో కలిసి టీడీపీ గూండాలు స్కెచ్
దీన్ని ప్రశ్నించే వారిపై ఎటాక్ చేశారు. అంబటి రాంబాబు ఇంటిపై ఆపై జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారు. రమేష్ ఇంటిపై పెట్రోల్, యాసిడ్‌లతో దాడులు చేశారు. ఓ పెద్దాయన(జోగి రమేష్ తండ్రి) ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేయడం హత్యాయత్నం కాదా? అని అడుగుతున్నా. జోగి రమేష్ ఇంటిపై దాడిక జరగకమునుపు.. కుట్ర చేశారు. నాలుగు గంటల ప్రాంతంలో దాడి జరిగితే.. రెండు గంటలకు ఓ స్కెచ్ వేశారు.

పోలీసులే.. టీడీపీ నాయకులతో కలిసి స్కెచ్ వేశారు( జోగి రమేష్ ఇంటిపై దాడికి ముందస్తు పన్నాగం ఎలా చేశారో పలు దృశ్యాలను చూపిస్తూ) వైఎస్ జగన్ తూర్పూరాబట్టారు.. ఆశ. ఫతుల్లా, సుబ్బారావులు కలిసి పెట్రోల్ బాంబులతో జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వీరంతా టీడీపీ నేతలే అనడానికి ఇవే రుజువులు అంటూ కొన్ని క్లిప్పింగ్స్ చూపించారు వైఎస్ జగన్. ఆశ కూతురు పెళ్లికి చంద్రబాబు వెళ్లడం, ఫతుల్లాకి లోకేష్‌కి సన్నిహిత సంబంధాలను వైఎస్ జగన్ మీడియా సాక్షిగా చూపించారు. దాడులకు సంబంధించి అన్నిఆధారాలున్నాయని, దీనిపై ఎన్‌హెచ్‌ఆర్సీ, సుప్రీంకోర్టులను ఆశ్రయిస్తామన్నారు వైఎస్ జగన్.



మీకు చిత్తశుద్ధి లేదనడానికి ఇది నిదర్శనం కాదా?
తాము తప్పు చేసి ఉంటే, తమ హయాంలో పని చేసిన అనిల్ సింఘాల్‌ను మళ్లీ టీటీడీ ఈవోగా ఎందుకు తెచ్చావ్ చంద్రబాబూ అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ‘ గత చంద్రబాబు హయాంలో అనిల్ సింఘాల్ టీటీడీ ఈవోగా పని చేశారు. మేము ఆయన్ను మా హయాంలో కూడా కొనసాగించాము. ఇప్పుడు అదే అనిల్ సింఘాల్‌ను మళ్లీ టీటీడీ ఈవోగా చంద్రబాబు తెచ్చుకున్నారు. మరి ఇందులో అర్థమేమిటి చంద్రబాబు. అంటే చంద్రబాబు చేసే ఆరోపణలకు చిత్తశుద్ధి లేదు అనడానికి ఇది నిదర్శనం కాదా? అని అడుగుతున్నా.
అదే సమయంలో టీటీడీ ఈవోగా చేసిన శ్యామలరావును తొలగించడానికి కారణాలను కూడా వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘ మీరు అధికారంలోకి రాగానే టీటీడీ ప్రక్షాళన అంటూ శ్యామలరావును తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఆయన్ను తీసేశారు. టీటీడీ ప్రక్షాళన జరిగిందా చంద్రబాబు?అని వైఎస్ జగన్ నిలదీశారు.
అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, అదే శ్యామలరావు టీటీడీ ఈవో ఉండగానే నాలుగు నెయ్యి ట్యాంకర్లు తిరుమలకు వచ్చాయని, వాటిని రిజెక్ట్ చేసి పంపితే మళ్లీ దొడ్డిదారిన అవి మళ్లీ అక్కడకే వచ్చాయనేది సీబీఐ చెబుతున్న నేపథ్యంలో ఇది చంద్రబాబు ప్రభుత్వానికి మచ్చ కాదా? అని ప్రశ్నించారు జగన్.


