ఎమ్మెల్యే అయినందుకు శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ చేసిన అమ్మాయిలకు వల
స్నేహితులుగా ఉందామన్నా వినకుండా పరిచయస్తురాలితో అసభ్యంగా సంభాషణ
రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే మరికొన్ని చాటింగ్‌లు వెలుగులోకి..
సాక్షి, అమరావతి: ప్రభుత్వోద్యోగి అయిన ఓ మహిళను లైంగికంగా వేధించారంటూ పీకల్లోతు ఆరోపణల్లో కూరుకుపోయిన జనసేన కూటమి పార్టీ రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. బాధిత మహిళ శుక్రవారం ఎమ్మెల్యేకు సంబంధించిన మరికొన్ని ప్రైవేట్ వీడియోలు, చాట్‌లు బయటపెట్టారు. వీటినిబట్టి ఆయన మరికొంత మంది మహిళలకు వల వేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
రాయలేని విధంగా మెసేజ్‌లు
బెంగళూరులో చదువుకుంటున్న ఓ అమ్మాయి శ్రీధర్ ఎమ్మెల్యే కాగానే శుభాకాంక్షలు చెబుతూ ఓ మెసేజ్ చేసింది. అంతే.. ఆమెకు అరవ శ్రీధర్ వరుసగా మెసేజ్‌లు చేస్తూనే ఉన్నారు. కొన్నింటికి సమాధానం ఇచి్చన ఆ అమ్మాయి.. ‘మీరు ఎమ్మెల్యే కదా.. ఇలా ఇంతసేపు అమ్మాయిలతో చాటింగ్ చేసేంత తీరిక, ఖాళీ దొరుకుతుందా’ అని సందేహం వ్యక్తంచేసింది. ఉంది కాబట్టే మెసేజ్‌లు చేస్తున్నానని శ్రీధర్ బదులిచ్చారు. మరో అమ్మాయితో చాటింగ్ చేసిన ఎమ్మెల్యే ఆమె శరీరాన్ని రాయలేని విధంగా వర్ణిస్తూ మెసేజ్‌లు చేశారు.

వద్దన్నా వినలేదు..
ఓ వివాహితతోనూ వ్యవహారం నడపాలని కూడా ఎమ్మెల్యే చూశారు. ఆమెతో గతంలో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని చిన్ననాటి స్నేహితుడినంటూ ఆమెను లోబరుచుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అంతేకాక.. ఆమెను ఏకాంతంగా గడిపేందుకు రావాల్సిందిగా మెసేజ్‌ల రూపంలో అడిగారు. దానికి ఆమె నిరాకరించారు. తాను వివాహితనని, భర్త, పిల్లలు ఉన్నారని, తనతో ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడటం సరికాదని వారించారు. కాదూ కూడదంటే మంచి స్నేహితులుగా ఉందామని హితవు చెప్పారు.
అయినాసరే ఎమ్మెల్యే శ్రీధర్ వినిపించుకోకుండా ఆమె వెంటపడుతూనే ఉన్నారు. ఇలా ఇవి కొన్ని ఆధారాలు మాత్రమేనని, ఇంకా చాలా అధారాలు, ఎంతమంది మహిళలతో ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తించారనే వీడియోలు తన వద్ద ఉన్నాయని ప్రభుత్వోద్యోగి అయిన బాధిత మహిళ చెబుతున్నారు. అదే విధంగా.. ఎమ్మెల్యే ఇతర మహిళల గురించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించి వాట్సప్ చాటింగ్‌ను కూడా ఆమె బయటపెట్టారు. వాట్సప్, స్నాప్‌చాట్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించి వారిని బుట్టలో వేసుకోవాలని ఎమ్మెల్యే చూశారని ఆరోపించారు.


