జోగి రమేశ్‌కు హైకోర్టులో ఊరట | Jogi Ramesh gets relief in the High Court | Sakshi
Sakshi News home page

జోగి రమేశ్‌కు హైకోర్టులో ఊరట

Feb 7 2026 5:37 AM | Updated on Feb 7 2026 5:37 AM

Jogi Ramesh gets relief in the High Court

ఆయన వ్యాఖ్యలు వాక్‌ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణలో భాగం  

ఆయనపై ఆరోపించిన నేరాలు ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవే 

కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.. కఠిన చర్యలేవీ తీసుకోవద్దు 

జోగి రమేశ్‌ దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు 

తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదు చేసిన కేసుల్లో కఠిన చర్యలేవీతీసుకోవద్దని ఎన్టీఆర్‌ జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీసులతోపాటు, తిరుపతి జిల్లా, తిరుపతి గ్రామీణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఫిర్యాదుదారుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. 

ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై అధికార టీడీపీ కూటమి నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారంపై జోగి రమేశ్‌ చేసిన వ్యాఖ్యల గురించి న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. 

జోగి వ్యాఖ్యలు రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 19(1)(ఏ) ప్రకారం ‘వాక్‌ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ’ పరిధిలోకి వస్తాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అంతేకాక ఆయనపై ఆరోపించిన నేరాలు ఏడేళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడేవేనని తెలిపారు. అందువల్ల ప్రస్తుత దశలో జోగి రమేశ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన తక్షణ అవసరం ఏదీ లేదని ఆమె ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement